తొంభై మూడేళ్ళ క్రితం ఇదే రోజున 1927 డిసెంబర్ 27న బ్రాహ్మణ మనువాద భావజాలానికి వ్యతిరేకంగా తన అనుచరులతో కలిసి మనుస్మృతి ప్రతులను దగ్ధం చేసిన సంధర్భంగా ప్రతి ఏటా మనుస్మృతి దహన దివస్ కార్యక్రమాన్ని అంబేడ్కర్ అభిమానులు జరుపుకుంటున్నారు. కొంకణ్ తీరంలోని కుగ్రామమైన మహద్ లో అందరికీ మంచినీరు అందుబాటులో ఉంచాలన్న కలక్టర్ అదేశాల్ని పక్కనబెట్టి దళితులకు నీళ్లను అందకుండా అడ్డుకున్న అగ్రవర్ణాల అధిపత్యానికి నిరసనగా మహాద్ సత్యాగ్రహం ఆరంభమైంది. అసమానతలకు నిలయమైన మనువాదాన్ని మట్టుపెట్టడమే ఈ ఉద్యమం అసలు ఉద్దేశ్యమని కొందరు పేర్కొంటారు.
నీళ్లు తాగే సౌకర్యం అందరికీ ఉన్నా కొన్ని వర్గాలు మహాద్ చెరువులో దళితవర్గాలు నీళ్ళు తాగకుండా అడ్డుకోవడం అంబేడ్కర్ ను బాధించి దళితుల జీవిత పరిస్థితి మెరుగుపరచడం కోసం, వారి హక్కుల కోసం ఆయ్న దారి మళ్లించింది. మహాద్ చెరువులో దళితులకు మంచినీళ్ళు అందించే లక్ష్యంతో మొదలెట్టిన ఉద్యమానికి,సభకు అగ్రవర్ణాలు అడ్డు తగులుతూ అనుకున్న స్థలంలో సభ పెట్టకుండా ప్రయత్నించగా స్థానిక ముస్లిం ఫతేఖాన్ అంబేడ్కర్ సభ పెట్టుకోవడానికి తన స్థలం ఇచ్చి ఇతర ఏర్పాట్లు చేశారు. ఆ సభలో అంబేడ్కర్ వర్ణవ్యవస్థ అంతం గురించి, హిందూమత అసమానతల గురించి చారిత్రక ఉపన్యాసం ఇచ్చారు. అంబేడ్కర్ బ్రాహ్మణ అనుచరుడు నీలకంఠ శాస్ట్రబుద్ధే మనుస్మృతి దహనం చేసారు. మనుస్మృతి దహన కార్యక్రమంలో భాగంగా గాంధీ చిత్రపటాన్ని ఉంచారు.
మహాద్ సత్యాగ్రహం కేవలం మంచినీళ్ల కోసమే కాదని దీనికి వెనుక అనేక ఆశయాలు ఉన్నాయని అంబేడ్కర్ తన ప్రసంగంలో చెప్పారు. మనుస్మృతి దహనం తర్వాత అంబేడ్కర్ ను కొన్ని పత్రికలు భీమాసుర అని ప్రచురించగా ‘‘బహిష్కృత భారత్’’ పత్రికలో ఎందుకు మనుస్మృతి దహనం చేయాల్సి వచ్చిందో వ్యాసాల సంపుటి రాగా తరువాత అవి సంకలనాలుగా వెలువడ్డాయి. కులాంతర వివాహాల్ని ప్రోత్సహించనందువల్లే అసమానతలు ఉన్నాయని, అవి తొలగి సమానత్వపు సౌధపు నిర్మాణంపై బంగారు అడుగులు పడాలని అంబేడ్కర్ కలలు కన్నారు. మహాద్ చెరువులో మంచినీళ్లను తాగి దళిత జాతుల ఆత్మగౌరవ పతాక ఎవరవేసారు. అసమానతలు పెంచి పోషించే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా 1956లో బౌద్ధంలో చేరిన అంబేడ్కర్ ఇంకో పదేళ్లు జీవించి ఉంటే ఈ దేశంలో ఎక్కువ శాతం దళితులు బౌద్ధ ధర్మాన్ని అనుసరించి ఉండేవారనే చరిత్రకారుడు రామ చంద్రగుహ మాటల్ని గుర్తు చేసుకోవాల్సిన చారిత్రక సందర్భమిది.
