Take a fresh look at your lifestyle.

భారత జాతీయ పతాక తయారీ, నిబంధనలు

భారత జాతీయ పతాకం, దీర్ఘ చతురస్రాకారంలో కాషాయం, తెలుపు, పచ్చ రంగులు సమ నిష్పత్తిలో త్రివర్ణంగా ఉంటూ మధ్యలో 24 ఆకులు కలిగిన నేవీ బ్లూ రంగులో ఉండే చక్రమైన అశోక చక్రంతో ఉంటుంది. 1947 జూలై 22న భారత రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ప్రస్తుతం ఉన్న రూపంలో ఆమోదం పొంది, 1947 ఆగస్టు 15న భారత డొమినియన్‌కు అధికారిక పతాకంగా ఆమోదం పొందింది. తర్వాత క్రమేపీ భారత గణతంత్రానికి అధికారిక పతాకంగా స్వీకరించారు. 1951లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ర (బి.ఐ.ఎస్.) జాతీయ పతాకానికి కొన్ని నిర్దేశకాలను రూపొందిం చింది. ఈ నిర్దేశకాలను మన దేశంలో అమల్లోకి వచ్చిన మెట్రిక్ మానానికి సరిపోయేటట్లు 1964లో ఒకసారి, 1968 ఆగష్టు 17న మరొక సారి సవ రించారు. పతాక పరిమాణం, రంగులు, వాడే బట్టకు వర్తించే ఈ నిర్దేశకాలు చాలా కచ్చితమైనవి. వీటి ఉల్లంఘన శిక్షార్హమైన నేరం.

పతాక కొలతలు మి.మీ. లలో…
6300 × 4200; 3600 × 2400; 2700 × 1800;
1800 × 1200; 1350 × 900; 900 × 600; 450 × 300; 225 × 150; 150 × 100గా నిర్ణయించారు.
పతాకం తయారీలో ఖాదీ లేక చేనేత వస్త్రాన్ని మాత్రమే వాడాలి. ఖాదీలో నూలు, పట్టు, ఉన్ని బట్టలను మాత్రమే వాడుతారు. జెండాలో రెండు రకాల ఖాదీని వాడుతారు: జెండా రూపానికి ఖాదీ-బంటింగ్, జెండాను కఱ్ఱకు తగిలించడానికి అవసరమయ్యే బట్టకు ఖాదీ-డక్. ఖాదీ-డక్ ప్రత్యేకమైన beige (పసుపు పచ్చ-బ్రౌన్ కలిసిన రంగు) రంగులో ఉంటుంది. సాంప్రదాయిక నేతలో రెండు పోగులను వాడేచోట ఖాదీ-డక్ లో మూడు పోగులను వాడుతారు. ఇది చాలా అరుదైన నేత. దేశం మొత్తమ్మీద ఈ రకమైన నేతపని తెలిసిన వాళ్ళు పదిమంది కంటే ఎక్కువ లేరు. ఇంకా చదరపు సెంటీ మీటరుకు కచ్చితంగా 150 పోగులు ఉండాలని, కుట్టుకు నాలుగు పోగులు ఉండాలని, ఒక చదరపు అడుగు గుడ్డ కచ్చితంగా 205 గ్రాములుండాలని నిర్దేశకాలు ఊన్నాయి. జాతీయపతాకాలను ఉత్పత్తిచేయడానికి అవసర మైన ఖాదీ బట్ట ఉత్తర కర్ణాటకలోని ధార్వాడ్, బాగల్కోట్ జిల్లాల్లోని రెండు చేనేత యూనిట్ల నుంచి వస్తుంది. ప్రస్తుతం దేశంలో జాతీయ పతాకాలను తయారు చేయడానికి ప్రభుత్వ అనుమతి గల ఒకే ఒక్క సంస్థ హుబ్లీలో ఉంది. జాతీయ పతాకాలను ఉత్పత్తి చేయడానికి అనుమతి ఇచ్చే అధికారం ఖాదీ డెవలప్‌మెంట్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కు ఉన్నప్పటికీ ఆ అనుమతిని రద్దు చేసే అధికారం బి.ఐ.ఎస్.కు ఉంది.

నేసిన బట్టను పరీక్ష నిమిత్తం బి.ఐ.ఎస్.కు పంపిస్తారు. తిరిగొచ్చిన తర్వాత బ్లీచింగు చేసి రంగులద్ది, మధ్యలో అశోకచక్రాన్ని స్క్రీన్ ప్రింటింగు గానీ, స్టెన్సిల్ గానీ, ఎంబ్రాయిడరీ గానీ చేస్తారు. చక్రం రెండు వైపులా ఒకేచోట స్పష్టంగా కనిపించాలి. జెండాపై వేసిన రంగులను బి.ఐ.ఎస్. పరీక్షించిన తర్వాతే పతాకాలను అమ్మటానికి అనుమతిస్తారు. మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు నాలుగు కోట్ల జెండాలు అమ్ముడు పోతాయి. దేశంలోనే అతిపెద్ద పతాకం (6.3 × 4.2 మీ) మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయమైన మంత్రాలయ భవనం మీద ఎగురుతుంది.

2002కు ముందు జాతీయ సెలవు దినాల్లో తప్ప మిగతా సమయాల్లో జాతీయ పతాకాన్ని ప్రజలు ఎగరేయడానికి అనుమతించేవారు కాదు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు మాత్రమే ఆ అధికారముండేది. ఈ నిబంధనను తొలగించాలని కోరుతూ నవీన్ జిందాల్ అనే పారిశ్రామికవేత్త ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాడు. జిందాల్ తన కార్యాలయ భవంతి మీద జాతీయ పతాకాన్ని ఎగురవేయగా అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుని, ఆయన్ను ప్రాసిక్యూట్ చేస్తామని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా జాతీయ పతాకాన్ని ఎగరేయడం పౌరుడిగా తన హక్కని, దేశం పట్ల తన ప్రేమను ప్రకటించుకునే మార్గమని జిందాల్ వాదించాడు. ఆ కేసు సుప్రీమ్‌ కోర్టుకు వెళ్ళింది. సుప్రీమ్‌కోర్టు ఈ విషయాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని వేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర మంత్రిమండలి పతాకం గౌరవానికి భంగం కలగని రీతిలో ఎవరైనా జాతీయ పతాకాన్ని ఎగరేయవచ్చని అనుమతిస్తూ జాతీయపతాక నియమావళిని సవరించింది.

భారత జెండా కోడ్‌, జాతీయ చిహ్నాలకు సంబంధిం చిన ఇతర చట్టాలు జెండా వాడుకకు వర్తిస్తాయి. మొదట్లో ఈ కోడ్ భారత స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ దినోత్సవాల సందర్భంగా తప్ప మిగతా రోజుల్లో సాధారణ పౌరులు జెండాను వాడడం నిషేధించింది. 2002లో నవీన్ జిందాల్ అభ్యర్థన పరిశీలిస్తూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సాధారణ పౌరులు జెండాను వాడుకునేందుకు వీలుగా కోడ్‌ను సవరించమని భారత ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దాన్ని అనుసరించి భారతీయ కేంద్ర మంత్రివర్గం కోడ్‌ను పరిమితంగా వాడేందుకు సాధారణ పౌరులకు వీలునిస్తూ సవరించింది. 2005లో మరోసారి కోడ్‌ను సవరించి కొన్ని రకాల దుస్తుల మీద ఉపయోగించడం సహా మరికొన్ని అదనపు వాడుకలను అనుమతించారు. జెండాను ఎగురవేయడం, ఇతర జాతీయ, సాధారణ జెండాలతో కలిపి భారత జాతీయ పతాకాన్ని వాడేప్పుడు అనుసరించాల్సిన విధానాలకు ఆ కోడ్ వర్తిస్తుంది. ఈ సవరణ 2002 జనవరి 26 న అమల్లోకి వచ్చింది. జాతీయపతాక నియమావళి అనేది చట్టం కానప్పటికీ, ఆ నియమావళి లోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సుప్రీమ్‌కోర్టు యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ నవీన్ జిందాల్ కేసులో పేర్కొంది.

జాతీయ పతాకాన్ని ఎగరేసే హక్కు సంపూర్ణ హక్కు కాదు. పరిమితులతో కూడిన హక్కు. దీన్ని భారతరాజ్యాంగంలోని 51ఎ ఆర్టికల్‌ లోని ప్రాథమిక విధులతో కలిపి అన్వయించ వలసి ఉంటుంది. వాస్తవంగా జెండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కూడా యూనిఫారాలు, బట్టలు, ఇతర వస్త్రాలపై జెండా వినియోగాన్ని ఒప్పుకోదు. జూలై 2005 లో, భారతదేశం ప్రభుత్వం కొన్ని రకాల వినియోగాన్ని అనుమతించటానికి సవరించారు. సవరించిన కోడ్ ప్రకారంలో దుస్తులలో జెండా వాడుక నిషేధిస్తుంది. పిల్లో కవర్స్, చేతి రుమాలు లేదా ఇతర వస్త్రాలు పై ఎంబ్రాయిడరీ డిజైన్స్ నిషేధిస్తుంది. దెబ్బతిన్న జెండాలు లేదా పాడయి పోయిన జండాలు నాశనము చేయడానికి ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. పాడయిన లేదా చిరిగి పోయిన జెండాలను పక్కన పడెయ్యటం లేదా అగౌరవంగా నాశనం చేయకూడదు. అలాంటి వాటిని కాల్చడము /తగులబెట్టడం లేదా భూమిలో పాతిపెట్టడం చేయాలి. లేదా జెండా గౌరవాన్ని కాపాడే మరే ఇతర పద్ధతి ద్వారా మాత్రమే వాటిని నాశనము చేయాలి.

భారతీయులు సగర్వంగా, సగౌరవంగా తలెత్తి వందనం చేసే, భారత సార్వభౌమాధికారానికి ప్రతీక అయిన త్రివర్ణ పతాక రూపకర్త బహుముఖ ప్రజ్ఞ కలిగిన పింగళి వెంకయ్యను భారతీయులంతా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం.
రామకిష్టయ్య సంగనభట్ల
9440595494

Leave a Reply