Take a fresh look at your lifestyle.

మనో దీపపు చమురే అక్షరం

మనో దీపపు చమురే అక్షరం
నిర్జీవ అక్షరాయుధమైతేమి
విశ్వ మానవ జాతిని సమస్తం
జాగృత పరుచును అనునిత్యం !

మానవాళి ప్రగతి రథ చక్రానికి..
కందెన మాత్రమే కాదు అక్షరం
దిశ నిర్ధేశక నిజ సూచిక కూడా తానే !

అక్షరాల కుప్ప కాదు పుస్తకం
మనో దీపాన్ని దివ్యంగా వెలిగించే..
చమురే కదా అక్షర నిధి గ్రంథం !

మనో వ్యాధికి మందే అక్షరం
వ్యక్తిత్వ వికాసానికి ఊతమే కాదు..
ఆత్మగౌరవం ఉబికే జ్ఞాన చెలిమె కూడా !

అక్షర శోషణంతో మనసు నిండగా..
ఒళ్లంతా ధైర్య లేపన కవచం ఏర్పడి..
విశ్వ విజేతగా గెలిపించును సగర్వంగా !

క్షరము కానిదేగా అక్షరం..
తస్కరించ లేని తపో ధనం..
అందరికీ అందును సమన్యాయంతో !

అక్షర కూర్పు తెలిసిన నేర్పరి..
భావ ప్రవాహాల పథ నిర్ణేత
అతడేగా అద్భుత జ్ఞాన విదాత !

వివేక విజ్ఞాన ప్రదాతేగా అక్షరం
అనంతాన్ని అల్పంగా చూపే అద్దం
ప్రశంసల జల్లు కురిపించే అక్షర ఆకసం !

బాహ్య సౌందర్యం వాకిలైతే
అంతర్‌ అం‌దమే అక్షరజ్ఞాన గృహం
మానవున్ని మాధవుడిగా చూపే సాధనం !

పెరుగును చిలికితే వెన్న వచ్చినట్లు
అక్షరాల్ని మధిస్తే భావాల నురగొచ్చును
సద్భావం లోంచే చిగురించును ‘సౌ’భాగ్యాలు !

– డా।। బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
99497 00037

Leave a Reply