Take a fresh look at your lifestyle.

జ్వలిస్తున్న ఉత్తేజం మన్నెబొయిన నర్సిములు యాదవ్

‘తెలంగాణ గ్రామాల్లో గొల్ల కుర్మలు తమ జీవానాధారమైన గోర్లు,మేకలు కాసుకుని బతికేవారు.ఇతర వృత్తులవారు వెట్టి చాకిరి, విపరీత శ్రమ దోపిడీకి గురయ్యేవారు.యాదవులు కుర్మలు తాము పెంచుకునే జీవాలను ఉరి దొరలు,గ్రామాలకు వచ్చే అధికారులు,పోలీసులు బలవంతంగా లాక్కునేవారు.ఎట్టి గోర్లు,మేకలు ఇవ్వరాదు, బలవంతం చేస్తే ప్రతిఘటించాలి అని సంఘం ఇచ్చిన చైతన్యంతో తుమ్మలగూడెం గ్రామములో మన్నబోయిన నర్సింలు యాదవ్ తన తండ్రి రామకృష్ణల నేతృత్వంలో గ్రామ వలంటీర్ దళం ఏర్పడింది ..’

ప్రజా కంఠకులను దునుమాడిన సాహసులు, చిత్ర హింసలకు లొంగని ధిరోదాత్తులు, సాయుధ పోరాట సీమలో సామాన్యుల సాహస చరిత్ర నమోదు పరిపూర్ణ స్థాయిలో జరగలేదు.ఇది ఎప్పటికి మనలను వెంటాడే,హృదయాన్ని మెలిపెట్టే ఒక బాధ.,అన్యాయము.దొరల,నిజాం వ్యతిరేక పోరులో నాలుగువేల మంది అమరత్వం. లక్షలాది మంది పై అణచివేత,కానీ పట్టుమని ఒక వందమంది వీరుల చరిత మనకు దక్కలేదు.ఎందరెందరో విస్మృత వీరులు,వారి కృషి,సేవ,త్యాగాలు మన తరాలకు అందకుండా పోతున్న దైన్యం..ఈ భాధలో, అన్వేషణలో వెలుగులోకి వచ్చిన సాయుధ మరియు ప్రజాస్వామిక పోరాటాల్లో పీడితుల కోసం జ్వలించిన, ప్రసరించిన వారు మన్నెబొయిన నర్సింలు యాదవ్ .

సై సై నల్లగొండ వీరుడా నీవు ఎత్తేదే ఎర్రని జెండా
అంటూ అన్నార్తుల విముక్తి కోసం ఎగిసిన నైజాం వ్యతిరేక పోరులో రామన్నపేట మండలంలో తుమ్మలగూడెం కు చెందిన మన్నబోయిన కుటుంబం క్రియాశీలకంగా పాల్గొన్నది.1944 భువనగిరి ఆంధ్రమహాసభ నాయకుడైన రావి నారాయణరెడ్డి పిలుపు మేరకు అనేక గ్రామాలలో వలంటీర్ దళాలు ఏర్పడ్డాయి. తెలంగాణ గ్రామాల్లో గొల్ల కుర్మలు తమ జీవానాధారమైన గోర్లు,మేకలు కాసుకుని బతికేవారు.ఇతర వృత్తులవారు వెట్టి చాకిరి, విపరీత శ్రమ దోపిడీకి గురయ్యేవారు.యాదవులు కుర్మలు తాము పెంచుకునే జీవాలను ఉరి దొరలు,గ్రామాలకు వచ్చే అధికారులు,పోలీసులు బలవంతంగా లాక్కునేవారు.ఎట్టి గోర్లు,మేకలు ఇవ్వరాదు, బలవంతం చేస్తే ప్రతిఘటించాలి అని సంఘం ఇచ్చిన చైతన్యంతో తుమ్మలగూడెం గ్రామములో మన్నబోయిన నర్సింలు యాదవ్ తన తండ్రి రామకృష్ణల నేతృత్వంలో గ్రామ వలంటీర్ దళం ఏర్పడింది. భీంరెడ్డి,దేవులపల్లి ,ఆరుట్ల వంటి పోరాట అగ్రనేతల స్పూర్తితో అప్పటికే 40 ఏళ్ల పై వయసు ఉన్న రామకృష్ణ యాదవ్ ,తన కొడుకు నర్సిములు తో కలిసి నిజాం పోలీస్ క్యాంపు ల పై పార్టీ చేపట్టిన దాడులలో చురుకుగా పాల్గొన్నాడు.కడవెండి లో కుర్మ కులానికి చెందిన దొడ్డి మల్లయ్య వీరోచిత చర్యలు, కొమురయ్య అమరత్వం,జనగామ లో యాదవ కులానికి చెందిన దండెబోయిన నరహరి యాదవ్ నాయకత్వంలో పార్టీ కార్యక్రమాలు తమ సామాజిక వర్గాల్లో వెల్లువెత్తిన చైతన్యంతో నర్సింలు యాదవ్ మరింత చురుకుగా పని చేసాడు. చుట్టూ ఉన్న అనేక గ్రామాల వలంటీర్ దళాలకు శిక్షణ ఇచ్చేవాడు.ఊరేగింపులకు నాయకత్వం,దొరలకు వెట్టి ఆపి వేయించడం,దొంగతనాలు జరగకుండా చూడటం,పార్టీ రాత్రి శిక్షణ బడులను నడపడం వంటి పనులను ఈ గ్రామ రక్షణ దళాలు చేపట్టేవి.

రోజుకు రోజుకు రైతాంగ పోరుకు గుండె కాయగా మారుతున్న నల్గొండ జిల్లా ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేయడానికి నిజాం పెద్ద ఎత్తున సైనిక బలగాలను రామన్నపేట ,సూర్యాపేట ప్రాంతాలకు తరలించారు. దీనిని సాయుధంగా ఎదుర్కోవాలనే పార్టీ పిలుపు ఇచ్చింది. దొరలు,పోలీసుల ఆయుధాలను చేజిక్కుంచుకోవాలని ఆదేశించింది.తండ్రి కొడుకులు లైన రామకృష్ణ,నర్సింలు యాదవ్ బాలేముల,అమ్మనబ్రోలు గ్రామ రక్షణ దళాలతో కలిసి అడ్డ గూడూరు,పులిగిళ్ళ, సోలిపేట, మల్లారెడ్డి గూడెం లలో నిజాం పోలీసుల శిబిరాలపై జరిగిన దాడులలో పాల్గొని అనేక మంది శత్రువులను హతమార్చి ఆయుధాల స్వాధీనంలో ముఖ్యపాత్ర పోషించారు..చివరకు 1946 లోఅమ్మనబ్రోలు గ్రామంలో దళాలకు,పోలీసులకు జరిగిన ఎదురుకాల్పులలో మన్నబోయిన రామకృష్జ్ఞ యాదవ్ ,తన సహచరులైన మన్నెబొయిన సాంభన్న,లింగయ్యలతో అమరత్వం పొందాడు.

తండ్రి వారసత్వాన్ని 1946 నుండి 1951 వరకు కొనసాగిన నైజాం,రజాకార్ల,పటేల్ సైన్యాల వ్యతిరేఖ పోరులో ఉద్యమ విస్తరణకు,ఉద్యమకారులను కాపాడుకోవడంలో మన్నబోయిన నర్సింలు యాదవ్ పని చేశారు.చకిలం యాదగిరి రావు దళంలో పని చేస్తూ ఆలేరు, సాయిగూడెం ప్రాంతాలలో నిజాం పోలీసులను చావు దెబ్బ తీసాడు. భోనగిరి, రామన్నపేట ప్రాంత పార్టీ కన్వీనర్ డి సుబ్బారావుతో కలిసి హైదరాబాద్ రాష్ట్ర కమిటీ కి పోరాట ప్రాంతాల దళాలకు మధ్య సమాచార మార్పిడి,సాహిత్యం అందుచేత ,కీలక నాయకుల రక్షణ భాద్యత ను పర్యవేక్షిస్తూ వారిని రహాస్యంగా వివిధ ప్రాంతాలకు చేరవేసే వంటి పనులను నిర్వర్తించారు.ఈ క్రమంలో వీరనారి నర్సింలు గారి తల్లి దుర్గమ్మ భర్త అమరత్వం తర్వాత చెక్కు చెదరని ధైర్యంతో వ్యవహరించి అటు ఉద్యమాన్ని,ఇటు కుటుంబాన్ని కాపాడుకుంది.యూనియన్ సైన్యాలు 1948 సెప్టెంబర్ లో ప్రవేశించాక కమ్యూనిస్టు ల పై నిర్బంధం మరింత గా పెరిగింది.దళాలు చెల్లా చెదురయ్యాయి.1951 లో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటం విరమణ ప్రకటన చేసే వరకు తన గ్రామ తుమ్మలగూడెం కు చెందిన ఉద్యమ సహచరులైన మందాడి జనార్దన్ రెడ్డి ,పాశం రామచంద్రయ్య,మల్లయ్య,స్వామి యాదవ్ లతో నల్లమల అటవీ ప్రాంతంలో రక్షణ పొందుతూ,ఆదివాసీలకు గ్రామ స్వరాజ్య కమిటీలకు ధైర్యాన్ని ఇస్తూ తిరిగారు.

పోరాట విరమణ తర్వాత తల్లి దుర్గమ్మ తో హైదరాబాద్ ఆడిక్ మెట్ ప్రాంతంలోకి నివాసం ఏర్పాటు చేసుకున్నారు.ఆ తర్వాత కమ్యూనిస్టు నుండి కాంగ్రెస్ రాజకీయాలలోకి వచ్చిన స్వామి రామానంద తీర్థ పట్ల ఆకర్షితులయ్యారు.అలాగే సాయుధ పోరులో కమ్యూనిస్టుల కోసం న్యాయ సహయం చేసిన కాంగ్రెస్ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ సహచర్యంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. పని చేసిన కార్మికుల శ్రేయస్సు,బస్తీ వాసుల హక్కుల,సౌకర్యాల కల్పన కోసం పని చేసారు.కాంట్రాక్టర్ గా మారి తుంగ భద్ర డాం నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో అప్పటి కార్మిక శాఖ మంత్రి ,పేద ప్రజల పక్షపాతి టంగుటూరి అంజయ్య ,జి.వెంకటస్వామి,యం.ఏ హషిమ్ ,మర్రి చెన్నారెడ్డి వంటి కాంగ్రెస్ సోషలిస్టుల సమకాలీనుడుగా వారితో కలిసి పనిచేశారు.ఆంధ్ర,తెలంగాణ విలీనం నాటి హామీలను కాంగ్రెస్ పెద్దలు విస్మరించినప్పుడు, 1969 తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో మధ్య తరగతి విద్యా వంతుల వర్గం పోరాటాలతో చురుకుగా పని చేసింది .ఈ ఉద్యమాన్ని రైతుల్లో,కార్మికుల్లో తీసుకెళ్లడానికి కీలక కృషి చెలింది నర్సింలు యాదవ్.సహజంగా శ్రామిక వర్గ పక్షపాతి అయిన నర్సిములు కార్మిక వర్గ బస్తీలు తిరిగి తన ప్రసంగాలతో,సేవ కార్యక్రమాలతో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనంద రెడ్డి అన్యాయాలపై విరుచక పడుతూ తెలంగాణ ప్రజా సమితి విజయంలో కీలక పాత్ర విజయం సాధించారు.

ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల తర్వాత చివరి వరకు కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు.కార్మిక మంత్రిగా,ముఖ్యమంత్రి గా ఎదిగిన టంగుటూరి అంజయ్య ప్రస్థానానికి అపూర్వ సహకారం అందించారు.నర్సిములు అక్టోబర్ 1,1976 లో మరణించినప్పుడు అతని అంత్యక్రియలలో అప్పటి కాంగ్రెస్ లోని తెలంగాణ మంత్రులంతా పాల్గొన్నారు.ఈ అంశాన్ని అప్పటి ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ ప్రముఖంగా ప్రచురించింది. ప్రస్తుతం ఉన్న తెలంగాణ ఆర్కైవ్స్ భవనాన్ని నర్సింలు యాదవ్ నిర్మించారు.అనేక ప్రభుత్వ భవనాలకు ఇసుక ను సప్లై చేశారు.ఆనాటి రాజకీయ,పారిశ్రామిక,కార్మిక వర్గాలలో ఉసుకె నర్సింలు యాదవ్ గా ప్రచారం పొందాడు. అనేక కార్మిక బస్తీలను ఏర్పాటు చేసి మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేసారు. ఆర్ట్స్ కాలేజీకి రాళ్ళెత్తిన కూలీల వారసులకు వడ్డెర బస్తీని ఏర్పాటు చేశారు.ఈ బస్తీ మలి దశ ఉద్యమంలో విద్యార్థులను పోలీసుల దాడులు నుండి దాచుకుని కాపాడుకుంది.గొల్ల కుర్మల ఇలవేల్పు కొమురెల్లి మల్లన్న దేవాలయ అభివృద్ధికి ఇతోధిక కృషి చేసారు.గుడి ప్రాంగణంలో ఉన్న కమాన్ మన్నెబొయిన నర్సింలు నిర్శించిందే .1.అక్టోబర్1976లో మరణించేవరకు ప్రజా ఉద్యమాలకు సంఘీభావంగా ఉంటూ ,తెలంగాణ ప్రజల శ్రేయస్సు పరమావధిగా పని చేస్తూ సేవా కార్యక్రమాలలో జీవించాడు . తన పిల్లలకు విద్య ప్రాముఖ్యతను తెలియచేసి , ప్రజాహిత రాజకీయాలపై మమకారం కలిగించే విధంగా తర్ఫీదు ఇచ్చాడు.తమ తండ్రి ,తాత, నానమ్మ ల ప్రజా రాజాకీయాలలో చేసిన త్యాగాలు,దీక్ష ల స్మరణ కోసం వారి వారసులు మలి దశ తెలంగాణ ఉద్యమకారుడు యమ్ బి కృష్ణయాదవ్ నేతృత్వంలో మన్నెబొయిన ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.నవ సమాజం కోసం సాయుధ పోరాట కమ్యూనిస్టుగా,తర్వాత కాంగ్రెస్ వాదిగా నర్సింలు యాదవ్ పయనించిన మార్గం సదా స్ఫూర్తిదాయకం.

asnala srinivas
అస్నాల శ్రీనివాస్
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం

Leave a Reply