Take a fresh look at your lifestyle.

ఉత్తమ శ్రేణి సంపాదకులలో మణికిరీటం ముట్నూరి జూన్‌ 25 – 76‌వ వర్థంతి

“కృష్ణారావు వ్యక్తిత్వంలోని ముఖ్యమయిన లక్షణం స్వతంత్ర వర్తనం. మద్రాసులో సహాధ్యాయుడైన పట్టాభి కృష్ణారావును రాష్ట్ర స్థాయి కాంగ్రెస్‌ ‌నేతగా ముగ్గులోకి దించాలని శతధా కృషి చేసినా పుట్టిన గడ్డకీ, పెంచిన ప్రజలకీ దూరమయిపోవడం కృష్ణారావుకు ఇష్టంలేక తన కార్యకలాపాలను జిల్లా స్థాయికి పరిమితం చేసుకున్నారు. చిలకమర్తి లక్ష్మీనరసింహం, కొమర్రాజు లక్ష్మణరావు, కాశీనాథుని నాగేశ్వరరావు, ఉన్నవ లక్ష్మీనారాయణ, టంగుటూరి ప్రకాశం తదితరుల కోవకే చెందిన ప్రజ్ఞావంతుడు ముట్నూరి. విద్యారంగం, సాహిత్యం, పత్రికా రచన, జాతీయోద్యమం, నాటక రంగం తదితర క్షేత్రాల్లో తమ ప్రతిభ ప్రదర్శించారు.”

తె•లుగు పత్రికలకూ, సంపాదకులకూ ఒక ఒరవడిని, కొత్త గౌరవాన్ని ఆపాదించిన మహానుభావుల్లో ఆద్యులనతగ్గవారు ముట్నూరి కృష్ణారావు పంతులు. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ‘కృష్ణా పత్రిక’ సంపాదకుడిగా పనిచేసిన కృష్ణారావు తెలుగునాట ఆదర్శప్రాయుడయిన సంపాదకుడిగా – నాటికీ నేటికీ – నిలిచి వున్నారు. ఉత్తమ శ్రేణికి చెందిన సంపాదకులలో ముట్నూరి కృష్ణారావు ఒక మణికిరీటం. వేదాంతం, దేశభక్తి, సాహిత్యం త్రివేణి సంగమంగా ఆయన సంపాదకీయాలలో ఉరకలెత్తుతూ తెలుగువారిని అలరించేవి. తెలుగు, ఇంగ్లిష్‌, ‌సంస్కృత సాహిత్యాలతో ప్రగాఢ పరిచయం కలిగిన కృష్ణారావు కేవలం శక్తిమంతమయిన రాజకీయ వ్యాఖ్యాతగానే కాక, తూకం తెలిసిన కళాభిజ్ఞుడిగా కూడా సుప్రసిద్ధులు.

‘‘కృష్ణాపత్రిక’’ సంపాదకునిగా తెలుగు ప్రజలను చైతన్యవంతం చేసిన ప్రముఖ పాత్రికేయులు ముట్నూరి కృష్ణారావు 1879 లో కృష్ణా జిల్లా దివి తాలూకా ముట్నూరులో జన్మించారు. పుట్టగానే తల్లి గతించారు, బాల్యంలోనే తండ్రి పరమపదించడం వల్ల పినతండ్రి ప్రాపకంలో పెరిగారు. ప్రాథమిక విద్యాభ్యాసం బందరు హిందూ ఉన్నత పాఠశాలలో జరిగింది. తరువాత బందరు నోబుల్‌ ‌కళాశాలలో ఎఫ్‌.ఏ అభ్యసించారు. ఇక్కడే ఈయన రఘుపతి వెంకటరత్నం నాయుడుకు శిష్యుడయ్యే అవకాశం కలిగింది. వెంకటరత్నం నాయుడు సంఘసంస్కరణ శీలన, మూఢాచార నిర్మూలన వంటి ఉద్యమాలు కృష్ణారావును ప్రభావితం చేశాయి. గురువుతో కలిసి బ్రహ్మసమాజంలో ధార్మిక ఉపన్యాసాలు ఇవ్వటం అలవాటయ్యింది. నాయుడు కృష్ణారావును ఆదర్శ విద్యార్థిగా తీర్చిదిద్దటమే కాక, బ్రహ్మసమాజ ప్రచారకునిగా మలచాలని ప్రయత్నించారు.
కృష్ణారావు మద్రాసులో ఎఫ్‌.ఎ ‌చదువుతున్నరోజులలో వంగ దేశ నాయకుడు బిపిన్‌ ‌చంద్రపాల్‌ ‌బ్రహ్మ సమాజం ఉపన్యాసాలు ఇవ్వ్వటానికి మద్రాసు వచ్చినప్పుడు కృష్ణారావుకు ఆయన మీద గురికుదిరి, శిష్యుడుగా మారారు.

తరువాత ఆయనతో కలసి బెంగాల్‌ ‌వెళ్ళారు. దాదాపు సంవత్సరం అజ్ఞాతవాసం చేసిన తరువాత ఇంటికి తిరిగివచ్చి కలకత్తాలో బిపిన్‌ ‌పాలు, అరవింద ఘోష్‌, ‌ఠాగూర్‌ ‌పరిచయ అనుభవంతో 1903లో బందరు తిరిగివచ్చి కృష్ణాపత్రికలో సహాయ సంపాదకునిగా చేరారు.. మద్రాసు క్రిష్టియన్‌ ‌కళాశాలలో బి.ఎ.లో చేరినప్పుడే ఈయనకు పట్టాభి సీతారామయ్య సహాధ్యాయిగా పరిచయమయ్యారు. ఇరవయ్యో శతాబ్ది మొదట్లో ‘దేశభక్త’ కొండ వెంకటప్పయ్య మొదలుపెట్టిన ‘కృష్ణాపత్రిక’ ఉపసంపాదకుడిగా చేరిన కృష్ణారావుకు ఆంధ్రపత్రిక సంపాదకుడు కాశీనాథుని నాగేశ్వరరావు ఐదువందల రూపాయల వేతనం ఆశచూపి కృష్ణాపత్రిక నుండి తమ పత్రికకు ఆకర్షించారు. మరోవైపు పట్టాభి సీతారామయ్య కృష్ణారావును రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేశారు. కానీ కృష్ణారావు వీటన్నింటికీ లొంగక జీవితాంతం కృష్ణాపత్రిక లోనే పనిచేస్తూ తెలుగు భాషకు సేవ చేశారు. నాలుగయిదేళ్లలోనే ఆ పత్రిక సంపాదక బాధ్యతలు చేపట్టారు. కృష్ణారావు సంస్కృత సాహిత్యంతో పాటు ఆధునిక ఆంగ్ల సాహిత్యాన్ని కూడా అభ్యసించారు.. అవకాశం దొరికినప్పుడల్లా ఎమర్సన్‌, ‌వాల్ట్ ‌విట్మన్‌, ‌షెల్లీ, కూపర్‌ ‌వంటి పాశ్చ్యాత్య రచయితల రచనలు చదివేవారు. తెలుగులోనే కాక మరే భాషలోనూ అన్ని సంవత్సరాలు ఒకే పత్రికకు సంపాదకత్వం వహించిన ఘనత కృష్ణారావుదే. 38 సంవత్సరాల సంపాదక జీవితంలో ఆయన ఎన్నెన్నో నూతన ప్రమాణా లను నెలకొల్పారు.

ముట్నూరి కొంతకాలం ‘‘ఆంధ్ర భారతి’’ సాహిత్య పత్రికను కూడా నిర్వహించారు. జాతీయోద్యమ కాలంలో కృష్ణాపత్రిక చురుకుగా వ్యవగహరించే రోజుల్లో పత్రిక కార్యాలయలంలో రాజకీయ, కళా, సాంస్కృతిక, సాంఘిక విషయాలపై పలు చర్చలు జరిగేవి. ఈ పత్రిక సంపాదకత్వ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించడం ముట్నూరి ఒక కళగా, తపస్సుగా పరిగణించేవారు. కృష్ణాపత్రికలో వార్తల పై ప్రజలకు విపరీతమైన విశ్వాసం ఉండేది. సంపాదకుడిగా ఉంటూనే కాంగ్రెస్‌ ‌కమిటీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పని చేశారాయన. 1930, 1932, 1943 సంవత్సరాల్లో కృష్ణారావు కారాగారవాసం అనుభవించారు. తన దేశభక్తికి హామీగా ధరావత్తు చెల్లించమని నిర్బంధించిన పాలకులను బాహాటంగా ధిక్కరించిన సాహసి కృష్ణారావు. కృష్ణారావు వ్యక్తిత్వంలోని ముఖ్యమయిన లక్షణం స్వతంత్ర వర్తనం. మద్రాసులో సహాధ్యాయుడైన పట్టాభి కృష్ణారావును రాష్ట్ర స్థాయి కాంగ్రెస్‌ ‌నేతగా ముగ్గులోకి దించాలని శతధా కృషి చేసినా పుట్టిన గడ్డకీ, పెంచిన ప్రజలకీ దూరమయిపోవడం కృష్ణారావుకు ఇష్టంలేక తన కార్యకలాపాలను జిల్లా స్థాయికి పరిమితం చేసుకున్నారు. చిలకమర్తి లక్ష్మీనరసింహం, కొమర్రాజు లక్ష్మణరావు, కాశీనాథుని నాగేశ్వరరావు, ఉన్నవ లక్ష్మీనారాయణ, టంగుటూరి ప్రకాశం తదితరుల కోవకే చెందిన ప్రజ్ఞావంతుడు ముట్నూరి. విద్యారంగం, సాహిత్యం, పత్రికా రచన, జాతీయోద్యమం, నాటక రంగం తదితర క్షేత్రాల్లో తమ ప్రతిభ ప్రదర్శించారు.

తెలుగు, ఇంగ్లిష్‌, ‌సంస్కృత సాహిత్యాలతో ప్రగాఢ పరిచయం కలిగిన కృష్ణారావు కేవలం శక్తిమంతమయిన రాజకీయ వ్యాఖ్యాతగానే కాక, తూకం తెలిసిన కళాభిజ్ఞుడిగా కూడా సుప్రసిద్ధులు. లోతయిన ‘లోవెలుగులు’ ప్రసరింపచేసిన జ్ఞాన భాస్కరుడాయన. కాటూరి వెంకటేశ్వరరావు, కోలవెన్ను రామకోటేశ్వరరావు, మల్లాది రామకృష్ణ శాస్త్రీ, అడివి బాపిరాజు, పింగళి నాగేంద్రరావు, పువ్వాడ శేషగిరిరావు, మాధవపెద్ది బుచ్చి సుందరరామ శాస్త్రీ, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రీ, చింతా దీక్షితులు ‘కృష్ణాపత్రిక’ కార్యాలయాన్ని నిత్యం అలరించే దర్బారీయులు. చెళ్లపిళ్ల వెంకట శాస్త్రీ, చిత్తూరు నాగయ్య తదితరులు తరచు కృష్ణారావు దర్శనం చేసుకుంటూ వుండేవారు. కృష్ణాపత్రిక కార్యాలయంలో వీరి గోష్ఠిని సాహితీవేత్త అడివి బాపిరాజు ‘కృష్ణరాయ దర్బార్‌’ అనేవారు.

కృష్ణాపత్రిక సంపాదకునిగా నాలుగు దశాబ్దాలు తెలుగు సాహితీ వికాసానికి కృషిచేసిన మహనీయుడు. ఆ రోజుల్లో చేతిలో కృష్ణాపత్రిక ఉండటం సాహితీ ప్రియులకొక అలంకారం. కృష్ణారావు మంచి హాస్యప్రియులు కూడా. పత్రికల స్థాయి, ప్రమాణాలు తగ్గి, ప్రతి పత్రిక ఏదో ఒక రాజకీయ పార్టీకి కరపత్రంగా తయారయిన ఈ రోజుల్లో పత్రికా సంపాదకులు కృష్ణారావు పాటించిన నీతి, నిజాయితీలను ఆదర్శంగా తీసుకోవాలని విలువలు కోరుకునేవారు ఆశిస్తారు. కృష్ణాపత్రిక సంపాదకునిగా తెలుగు సాహితీ వికాసానికి కృషిచేసిన మహనీయుడు 1945 జూన్‌ 25‌న దేహం చాలించారు. హిమవన్నగం వంటి ఆ రూపం, మంచులాంటి తెల్లని దుస్తులు ధరించి, తెల్లని తలపాగా చుట్టి ఆయన ఠీవిగా నడుస్తుంటే బందరుకే వన్నె తెచ్చేదట! ఆరోజుల్లో కృష్ణాపత్రికలో ఒక వ్యాసం గాని, ఒక కధ గాని, ఒక గేయం కాని ప్రచురితమైతే రచయితలకు ఎంతో గర్వంగా వుండేది. తదనంతరం ఆయన అభిమానులు ముట్నూరి సంపాదకీయాలను గుదిగుచ్చి ఒక గ్రంథ రూపం ఇచ్చారు.
– నందిరాజు రాధాకృష్ణ,

Leave a Reply