Take a fresh look at your lifestyle.

ఆకుపచ్చని హరితహారం తెలంగాణకు మణిహారం

“అడవులు భూమికి ఊపిరితిత్తులు గా పనిచేస్తాయి. సకల జీవరాసులకు ప్రాణవాయువును అందిస్తాయి. అడవుల తరుగుదల 24% కర్బన ఉద్గారాలకు కారణమవుతుంది. ఫలితంగా భూమి వేడెక్కుతుంది. పర్యావరణ సమతుల్యానికి ఏ దేశంలో అయినా మూడో వంతు వైశాల్యంలో అడవులు ఉండాలి. ఐక్యరాజ్యసమితి , ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ‌ప్రతి ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే ప్రపంచ అటవీ వనరుల అంచనా (జి ఎఫ్‌ ఆర్‌ ఎ) ‌నివేదిక ప్రకారం ప్రపంచ సరాసరి అడవుల విస్తీర్ణం 30.6 శాతం కాగా భారత్‌ ‌లో అది 21.5 శాతం మాత్రమే ఉంది. జి ఎఫ్‌ ఆర్‌ ఎ ‌ప్రకారం అడవులు సగటున హెక్టారుకు 74 టన్నుల కార్బన్‌ ‌ను నిల్వ చేసుకుంటాయి. ఈ విధంగా అడవులతో కార్బన్‌ ‌పరిమాణాన్ని పెంచడం ద్వారా హరిత గృహ వాయువుల ప్రభావాన్ని తద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా తగ్గించవచ్చునని నిపుణుల అభిప్రాయం.”

ఆధునికత అనేది మనిషి అభివృద్ధికి తోడ్పడాలి కానీ , అది వినాశానికి దారి తీయకూడదు. మానవుడు ఆర్థికాభివృద్ధి కొరకు ప్రకృతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నాడు. అడవులను నరికి వేయడం, పరిశ్రమలు నెలకొల్పి కాలుష్యాన్ని మరింత పెంచి గ్రీన్‌ ‌హౌస్‌ ‌వాయువుల తో భూగోళాన్ని వేడెక్కించడం వంటి చర్యల ద్వారా పుడమి తల్లికి పురిటి నొప్పులు తెప్పిస్తున్నాడు. శతాబ్దాలుగా మనిషి సాగించిన ప్రకృతి వనరుల విధ్వంసం అత్యంత ప్రమాదకరంగా భూతాపం పెరుగుదలకు, వాతావరణ మార్పులకు కారణభూతమై ప్రాణాంతక ఉత్పాతాలను సృష్టిస్తుంది.

ఒకవైపు భారీ వర్షాలు, తుఫాన్లు, వరదలు మరోవైపు కరువు కాటకాలు ఇలాంటి పరస్పర విరుద్ధ వాతావరణ మార్పులు భూగోళంపై చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకు భూతాపం పెరుగుదల ప్రధాన కారణమని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. భూతాపం పెరుగుదల వల్ల హిందూ కుష్‌ ‌హిమాలయ పర్వత ప్రాంతంలోని హిమనీ నదులను హరించే ప్రమాదం పొంచి ఉంది. 2100 నాటికి ఈ ప్రాంతంలోని 64% హిమనీ నదులను మానవాళి కోల్పోయే మహా విషాదం కనుచూపు మేరలో ఉన్నట్టు వాతావరణ మార్పు పై అంతర ప్రభుత్వ నిపుణుల సంఘం ప్రత్యేక నివేదిక హెచ్చరించింది. ఈమధ్య ఉత్తరాఖండ్‌ ‌లోని చమోలి జిల్లాలో నందాదేవి హిమనీ నదాలు కరిగి ధౌలీ గంగ నదికి అకస్మాత్తుగా వరద సంభవించి ప్రాణ ,ఆస్తి నష్టం జరగడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. సముద్ర మట్టాలు కేవలం 50 సెంటీమీటర్ల పెరిగితే రేవు పట్టణాల్లోని 15 కోట్ల ప్రజలకు వరద ముంపు ప్రమాదం తప్పదని పేర్కొంది. ముంబై, కోల్‌ ‌కత్తా ,చెన్నై లాంటి మహానగరాలకు ఈ ముప్పు ఎక్కువ. వాతావరణ మార్పుల వల్ల ఇప్పటికే 75% పగడపు దిబ్బలు ,సముద్ర అంతర్భాగం లోని అరుదైన జీవ జాతులు ప్రమాద అంచులో ఉన్నాయి. అర డిగ్రీ భూతాపం పెరిగితే 90 శాతం మేర పగడపు దిబ్బలు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. గత సంవత్సరం దేశం ఎదుర్కొన్న ఎడారి మిడతల దండయాత్ర కూడా వాతావరణ మార్పుల ప్రభావమే. హిందూ మహా సముద్రంలో డై పోల్‌ ఏర్పడడం కారణంగా అరేబియా మరియు తూర్పు ఆఫ్రికా ఎడారి ప్రాంతాలలో తేమ పెరిగి మిడతల వృద్ధికి దోహదపడ్డాయి.

ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారి వ్యాధులకు మించి కాలుష్యం జనాల ప్రాణాలను కబళిస్తుంది . మనదేశంలో గతేడాది 12.4 లక్షల మంది కేవలం వాయు కాలుష్యం కారణంగా తలెత్తిన ఆరోగ్య సమస్యలతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేశంలో సంభవిస్తున్న అకాల మరణాల్లో దాదాపు 26 శాతం మరణాలు కాలుష్యం కారణంగా సంభవిస్తున్నాయని అధికార గణాంకాలు చెబుతున్నాయి. సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఇంత దారుణంగా మారిందంటే అక్కడి జనాలు స్వచ్ఛమైన గాలి కోసం ఆక్సిజన్‌ ‌బార్లను ఆశ్రయించాల్సి వచ్చింది. మరోవైపు పంట వ్యర్ధాలను తగలబెట్టడం ద్వారా ఏర్పడిన కాలుష్యంపై ఢిల్లీ కంటే నరకమే నయమని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పందించిన తీరు కాలుష్యం యొక్క ప్రభావాన్ని తెలియజేస్తున్నది .

ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ, వ్యవసాయ అభివృద్ధి పేరుతో చెట్ల నరికివేత ,కార్చిచ్చు తదితర కారణాల వల్ల అటవీ సంపద క్షీణిస్తుంది. గతంలో ఆస్ట్రేలియాలో సంభవించిన కార్చిచ్చు పర్యావరణానికి పెను ఉపద్రవాన్ని కలిగించింది. అడవులు భూమికి ఊపిరితిత్తులు గా పనిచేస్తాయి. సకల జీవరాసులకు ప్రాణవాయువును అందిస్తాయి. అడవుల తరుగుదల 24% కర్బన ఉద్గారాలకు కారణమవుతుంది. ఫలితంగా భూమి వేడెక్కుతుంది. పర్యావరణ సమతుల్యానికి ఏ దేశంలో అయినా మూడో వంతు వైశాల్యంలో అడవులు ఉండాలి. ఐక్యరాజ్యసమితి , ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ‌ప్రతి ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే ప్రపంచ అటవీ వనరుల అంచనా (జి ఎఫ్‌ ఆర్‌ ఎ) ‌నివేదిక ప్రకారం ప్రపంచ సరాసరి అడవుల విస్తీర్ణం 30.6 శాతం కాగా భారత్‌ ‌లో అది 21.5 శాతం మాత్రమే ఉంది. జి ఎఫ్‌ ఆర్‌ ఎ ‌ప్రకారం అడవులు సగటున హెక్టారుకు 74 టన్నుల కార్బన్‌ ‌ను నిల్వ చేసుకుంటాయి. ఈ విధంగా అడవులతో కార్బన్‌ ‌పరిమాణాన్ని పెంచడం ద్వారా హరిత గృహ వాయువుల ప్రభావాన్ని తద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా తగ్గించవచ్చునని నిపుణుల అభిప్రాయం.

తెలంగాణ రాష్ట్రం హరితహారం పేరుతో నిర్దిష్ట లక్ష్యం ఏర్పర్చుకొని ప్రజలు ,స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థుల భాగస్వామ్యంతో నిరుపయోగ భూములు, ప్రభుత్వ స్థలాలు, జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట భారీ స్థాయిలో చెట్లను పెంచే కార్యక్రమం చేపట్టింది. ఆరు విడుతల హరితహారం కార్యక్రమం లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 217 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. తద్వారా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 24 శాతం నుండి 28 శాతానికి చేరింది. మొక్కల పెంపకంలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఏడవ విడత హరితహారం లో భాగంగా 34 ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో 20 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హరితహారం కార్యక్రమానికి బాసటగా సోషల్‌ ‌మీడియా వేదికగా గ్రీన్‌ఇం‌డియా ఛాలెంజ్‌ ‌కార్యక్రమం మరియు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా ఆయా ప్రాంతాల్లో మొక్కల పెంపకం బాధ్యతలను ప్రజా ప్రతినిధులకు అప్పగించడం జరిగింది. అదేవిధంగా జంగి ల్‌ ‌బచావో- జంగిల్‌ ‌బడావో నినాదంతో తెలంగాణలో ఉన్న అడవులను 33 శాతానికి పెంచడం, జీవవైవిద్య రచ్చబండ (బయోడైవర్సిటీ చౌపాల్‌ )‌కార్యక్రమం ద్వారా జీవవైవిధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎకాలజీ ఈజ్‌ ‌పర్మినెంట్‌ ఎకానమీ (నాశనం కానీ జీవావరణ వ్యవస్థల సముదాయమే స్థిరమైన ఆర్థిక వ్యవస్థ) అన్న భావనను తెలియజెప్పిన చిప్కో ఉద్యమం నేత స్వర్గీయ సుందర్‌ ‌లాల్‌ ‌బహుగుణ గారి స్ఫూర్తితో సమాజంలోని ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడాలి.

– డాక్టర్‌ ‌చల్లా ప్రభాకర్‌ ‌రెడ్డి, 9059734830

Leave a Reply