Take a fresh look at your lifestyle.

‌ప్రచారాస్త్రాలుగా మేనిఫెస్టోలు

Manifestos as propagandists

నూతన సంవత్సర ప్రథమ మాసంలో జరుగబోతున్న మున్సిపల్‌, ‌కార్పొరేషన్‌ ఎన్నికలపై అటు రాష్ట్ర ప్రజలు, ఇటు రాజకీయ వర్గాలు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ ఎన్నికలు గడచిన ఆరేళ్ళ టిఆర్‌ఎస్‌ ‌పాలనకు అద్దం పట్టనున్నాయన్న వాదన ఒకవైపు ఉండగా, తమ గెలుపు ఖాయమని అధికార పార్టీవర్గాలంటున్నాయి. ఈనెల 22న జరుగనున్న ఈ ఎన్నికలు రాష్ట్రంలో గత కొంతకాలంగా జరుగుతున్న వివిధ ఎన్నికలకు చివరి ఘట్టం కానుంది. ఈ ఎన్నికల తర్వాత ఇప్పట్లో మరే ఎన్నికలు లేకపోవడంతో ఇందులోనే తమ సత్తాఏమిటో చూపించుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా కృషిచేస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీతో రెండు జాతీయ పార్టీలు తలపడుతుండడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆరేళ్ళ కింది వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ‌ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రాంతీయ పార్టీ అయిన టిఆర్‌ఎస్‌ను ఈ ఎన్నికల్లో మట్టికరిపించేందుకు తమ శక్తుయుక్తులను ప్రదర్శిస్తున్నాయి. వోటర్లను ఆకట్టుకునేందుకు తమ ప్రచారాస్త్రాల్లో భాగంగా మేనిఫోస్టోలను ప్రయోగిస్తున్నాయి. స్థానిక అంశాలతో కూడిన లోకల్‌ ‌మేనిఫెస్టోతో పాటు, ఒక కామన్‌ ‌మేనిఫెస్టోను కూడా ఆయా పార్టీలు విడుదల చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఆయా పార్టీల పాలసీ ఏమిటీ, ఆ పార్టీలు ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తున్నదన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిపేందుకే కామన్‌ ‌మేనీఫెస్టోను కూడా విడుదల చేస్తున్నాయి. ఈ విషయంలో ప్రధానంగా కాంగ్రెస్‌, అధికార పార్టీలు పోటీ పడుతుండగా, బిజెపితో పాటు ఇతర పార్టీలు టిఆర్‌ఎస్‌ ఆరేళ్ళ పాలనలో అబద్ధాలను బయటపెట్టి వోటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అవినీతి రహిత• పాలన అందిస్తామని టిఆర్‌ఎస్‌ ‌మొదటి నుండీ చెబుతున్నట్లుగానే ఈ ఎన్నికల్లో మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌లపై తమ జంఢా ఎగిరితే అవినీతికి తావులేని పాలన అందిస్తామని కాంగ్రెస్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ప్రజలకు చెబుతున్నాయి.

కాంగ్రెస్‌ ‌తన మేనిఫెస్టోను తయారు చేయడంలో బాగానే కష్టపడింది. స్థానికంగా సామాజిక అవగాహన ఉన్న వారితో ఒక కమిటీ వేసి, స్థానిక సమస్యలపైన ఆయా మునిసిపాలిటీ పరిధిలో మేనిఫెస్టోను తయారుచేసింది. అలాగే రాష్ట్రస్థాయిలో మరో కమిటీవేసి రాష్ట్రస్థాయి మేనిఫెస్టోను తయారుచేసింది. ముఖ్యంగా పేద, మధ్య రకం కుటుంబాల వారిని ఆకట్టుకునే అనేక అంశాలను కాంగ్రెస్‌ ‌తమ మేనిఫెస్టోలో పొందుపర్చింది. ప్రతీ నిరుపేద కుటుంబానికి వందగజాల ఇంటిస్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి ఆరులక్షల ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వంపై వొత్తిడి తెస్తామంటోంది. తమ పార్టీ గెలిచిన మునిసిపాలిటీల్లోనైతే 500 చదరపు గజాల వైశాల్యమున్న ప్రతీ ఇంటికి ఇంటిపన్నును మాఫీచేస్తామంటోంది కాంగ్రెస్‌. అలాగే నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు ఉపాధి కల్పనా శిబిరాల నిర్వహణ, ప్రతీ మునిసిపల్‌ ‌పరిధిలో ఆధునిక వైద్య సదుపాయాలతో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు, 108, 104 సేవలను విస్తరిస్తామంటోంది. వాస్తవంగా అధికారంలోకి వొచ్చిన తర్వాత ఈ ఆరేళ్ళ కాలంలో టిఆర్‌ఎస్‌ ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదన్నది ఆ పార్టీ వాదన. నిరుద్యోగులకు నెలకు 3016 రూపాయలను ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదు. అలాగే దళితులకు మూడు ఎకరాల భూమినిస్తామని, దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తామని, ముస్లింలకు, ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ మాయమాటలు చెప్పి వోట్లు దండుకున్న టిఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో వోట్లు అడిగే అధికారమేలేదంటోంది కాంగ్రెస్‌. అం‌తేకాదు 2014లో ఆసెంబ్లీలో మిషన్‌ ‌భగీరథ ద్వారా ప్రతీ ఇంటికీ మంచినీళ్ళు అందిస్తామని, కాని పక్షంలో ఇకముందు వోట్లే అడుగమని చెప్పిన టిఆర్‌ఎస్‌ ఇప్పుడు వోట్లు అడిగే నైతిక హక్కును కోల్పోయిన విషయాన్ని తమ మానిఫెస్టోలో పొందుపర్చడంతో పాటు, ఇలాంటి అనేక వైఫల్యాలను ప్రజలముందు పెట్టేందుకు కాంగ్రెస్‌ ‌వ్యూహాన్ని రూపొందిస్తోంది. కాగా తెరాస ఎప్పటి నుండో తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది.

రాష్ట్రంలోని పలు తండాలను పంచాయితీలుగా, పలు మేజర్‌ ‌పంచాయితీలను మునిసిపాలిటీలుగా తీర్చిదిద్దిన ఘనత తమదేనని, తమ పాలనలో రాష్ట్రం పురోగిస్తున్నదనడానికి ఇంతకన్నా నిదర్శనమేముంటుందంటోంది టిఆర్‌ఎస్‌. ‌తెలంగాణలోని పట్టణాలన్నిటినీ దేశంలోనే ఆదర్శ పట్టణాలుగా రూపొందిస్తామని చెబుతున్న టిఆర్‌ఎస్‌ ‌కూడా స్థానిక సమస్యలతో కూడిన లోకల్‌ ‌మేనిఫెస్టోను రూపొందించుకోవాల్సిందిగా తమ పార్టీ శ్రేణులను ఆదేశించింది. ఇప్పటివరకు 45వేల కోట్ల రూపాయలతో అనేక సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలుచేస్తోందని, అవన్నీ ఇప్పటికే ప్రజల గమనంలోనే ఉన్నాయని, అనుభవిస్తున్నారని అలాంటప్పుడు తమ పాలనాతీరుపై ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదంటున్నప్పటికీ, ఈ ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలని తమ శ్రేణులను ఆ పార్టీ హెచ్చరిస్తోంది. కాగా అవినీతి రహిత ఆదర్శ మునినిపాలిటీలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యంగా తెలంగాణ జనసమితి(టిజెఎస్‌) ‌తన మేనిఫెస్టోలో పేర్కొంది. లంచాలకు తావులేకుండా ఇళ్ళు, లేఅవుట్ల అనుమతికోసం పటిష్టమైన సింగిల్‌ ‌విండో వ్యవస్థను ఏర్పాటు చేస్తామంటోంది. అలాగే అవినీతిపై నిఘాకు పౌరసంఘాలతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, తమ పార్టీ నుండి గెలిచిన ఎవరైనా అవినీతికి పాల్పడితే వెంటనే పార్టీ నుండి సస్పెండ్‌ ‌చేస్తామంటోంది. ఇక మరో జాతీయపార్టీ భారతీయ జనతాపార్టీ టిఆర్‌ఎస్‌ ‌వైఫల్యాలనే తమ అస్త్రాలుగా మల్చుకుంది. కేంద్రం నుండి వొచ్చిన నిధులకు సమాన వాటాను కేటాయించి పథకాలను అమలు చేయకపోవడం, ప్రధానమంత్రి ఆవాస్‌ ‌యోజన కింద వొచ్చి లక్షలాది దరఖాస్తులను కేంద్రానికి పంపకపోవడం లాంటి పలు అంశాలతో ఇప్పటికే దాడి మొదలు పెట్టినప్పటికీ ఈ పార్టీ కూడా లోకల్‌ ‌మేనిఫెస్టోలకే ప్రాధాన్యత నివ్వడంతో స్థానిక ఎన్నికల్లో స్థానిక సమస్యలే ప్రధానాస్త్రాలుగా మారుతున్నాయి.

Tags: Manifestos, propagandists, ts municipal elections 2020, trsparty vs congress

Leave A Reply

Your email address will not be published.