Take a fresh look at your lifestyle.

‘‌మండలి’ రద్దు కొత్త కాదు..!

Mandali chaiman

శాసనసభలో తాము చేసే తీర్మానాలకు శాసన మండలి అడ్డుపడడంపై అధికార పార్టీలు అగ్రహించి మండలిని రద్దుచేయడం ఎంతవరకు న్యాయమన్న విషయంలోనే ఇప్పుడు చర్చజరుగుతోంది. అధికార పార్టీ శాసనసభలో తనకున్న మెజార్టీతో తాను తీసుకున్న నిర్ణయాలను నెగ్గించుకున్నప్పటికీ, మండలిలో ఎదురు దెబ్బలు తగలడాన్ని సహించలేకపోతున్నది. దాంతో ఏకంగా మండలినే రద్దుచేసి తన కోపాగ్నిని చల్లార్చుకోవాల నుకోవడం ఇవ్వాళే కొత్తగా జరిగేదేమీ కాదు. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఇలాంటి పరిణామాన్ని చవిచూసింది. నాడు ఎన్టీఆర్‌ ‌ముఖ్యమంత్రిగా ఉండగా టిడిపి ప్రభుత్వం శాసనసభలో చేసిన పలు తీర్మానాలను శాసనమండలికి పంపించినప్పుడల్లా  నాడు మండలిలో కాంగ్రెస్‌ ‌పార్టీ సభ్యులు మెజార్టీ సంఖ్యలో ఉండడంతో ప్రతీ విషయానికి అడ్డుతగులుతోందన్న అభిప్రాయంగా ఆయన ఏకంగా మండలిని రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఫలితంగా 1985లో మండలి రద్దు అయింది. తిరిగి 12 ఏళ్ళ విరామం తర్వాత 2007లో వైఎస్‌ ‌హయాంలో మరోసారి పునరుద్ధరిం చబడింది.ఇప్పుడు మరోసారి ఏపి రాష్ట్ర ప్రభుత్వం ఆదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. కారణం కూడా అదే. ఏపిలో మూడు రాజధానుల ఏర్పాటు, అమరావతి నుండి రాజధానిని తరలించడానికి సంబంధించి తాజాగా కొనసాగుతున్న ఏపి శాసనసభ నిర్ణయం తీసుకుంది. దాన్ని పెద్దల సభకు పంపించిన ప్రభుత్వానికి చుక్కెదురైంది. అనూహ్య పరిణామాన్ని వైఎస్‌ఆర్‌ ‌పార్టీ అవమానంగా భావించింది.

అప్పటివరకు తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని అన్ని రకాలుగా ఆడుకుంటూ వొచ్చిన వైఎస్‌ఆర్‌ ‌పార్టీ నాయకులకు ఇది మింగుడు పడకుండా పోయింది. అందుకు కారణం మండలిలో వారికి సంఖ్యాబలం లేకపోవడమే. గతంలో ఇలాంటి పరిణామాలను ఎదుర్కున్న  ఎన్టీఆర్‌ ‌లాగానే ఇప్పుడు ఏపి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచించడం మొదలుపెట్టారు. అదే విషయంపై వైఎస్‌ఆర్‌ ‌పార్టీ నాయకులు బాహాటంగానే చర్చిస్తున్నారు. అసలు మండలి అవసరమా అన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఎన్టీఆర్‌ ‌హయాంలో రద్దు అయిన మండలి తిరిగి వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పునరుద్ధరించ బడింది. ఇప్పుడు ఆయన తనయుడే తిరిగి రద్దు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక్కడ విచిత్రకర పరిణామేమంటే నాడు రద్దుచేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వమైతే, ఇప్పుడా రద్దును వ్యతిరేకిస్తున్నది అదే పార్టీ. కాకపోతే ఆనాడు టిడిపికి ఎన్టీఆర్‌ అధినాయకుడు, ఈనాడు మండలిలో ఆధిక్యతలో ఉన్న టిడిపికి అధినాయకుడు చంద్రబాబునాయుడు. అవునన్నా, కాదన్నా శాసనసభలో కాని, శాసనమండలిలో కాని ఎవరి సంఖ్యాబలాన్ని బట్టి ఆ పార్టీకి చెందిన వారే చైర్మన్‌లుగా ఎంపిక కావడమన్నది ఆనవాయితీ. అలా ఎంపికైనవారు తమ స్వీయపార్టీ వాదనలవైపు మొగ్గుచూపే అవకాశా లుంటాయన్నది బహిరంగ రహస్యమే. శాసనసభలో అధికారంలో ఉన్న పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే మండలిలో సంఖ్యాబలం ఉన్నపార్టీకే సాధ్యపడుతుంది. అదే ఇప్పుడు ఏపిలో జరిగింది. శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లు చర్చకు వొచ్చినప్పుడు మండలి చైర్మెన్‌గా ఉన్న షరీఫ్‌ ఈ ‌బిల్లులో తప్పులున్నాయని, అందుకే తనకున్న విశేషాధికారాలతో ఈ బిల్లును సెలక్ట్ ‌కమిటీకి పంపిస్తున్నాని ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. ఇది ఒక విధంగా టిడిపికి అనుకూలంగా తీసుకున్న నిర్ణయంగా వైఎస్‌ఆర్‌ ‌పార్టీ బావిస్తోంది. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా మండలి చైర్మెన్‌ ‌వ్యవహరించాడన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తూ అలాంటి మండలి కొనసాగింపు అనవసరమని వైఎస్‌ఆర్‌ ‌పార్టీ అభిప్రాయపడుతోంది. దేశంలో  కేవలం ఆరు రాష్ట్రాల్లోనే శాసనమండలి కొనసాగుతున్నది.

సంవత్సరానికి దాదాపుగా ఆరవై కోట్ల రూపాయలు ఈ మండలిపై ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తోంది. చట్టాలపై, సంక్షేమ పథకాలపై, నిరుపేద వర్గాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై తగిన సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన పెద్దలసభ రాజకీయాలు చేస్తోందని, అలాంటి సభను ఇకముందు కొనసాగించాలా వద్దా అన్నదే ఇప్పుడు ప్రధానాంశంగా వైఎస్‌ఆర్‌ ‌చర్చిస్తోంది. మండలి రద్దు అవుతుందా లేదా అన్నది పక్కన పెడితే ప్రభుత్వ ఈ ఆలోచన ప్రతిపక్ష టిడిపికి పెద్ద చిక్కునే తెచ్చిపెడుతోంది. వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వమ్ముచేసేందుకు టిడిపి మండలి బలంతో అడ్డుకునే ఎత్తుగడ వేస్తే, అసలు మండలినే రద్దుచేయాలని ఏపి సిఎం జగన్‌ ‌మరో ఎత్తుగడ వేస్తున్నాడు.గతంలో మండలిని పునరుద్ధరించవద్దని చంద్రబాబు గొడవచేసిన నాటి క్లిప్పింగ్స్‌తోనే ఆయన నోరు కట్టేసి మండలి రద్దుకు వైఎస్‌ఆర్‌పార్టీ సన్నద్దం అవుతోందని తెలుస్తున్నది. ఏది ఏమైనా అధికారంలో ఏ పార్టీ ఉన్నా, తమ పాలనా వ్యవహారాలకు అడ్డుతగిలితే పెద్దల సభను రద్దుచేయడానికి ఏమాత్రం వెనుకాడవన్నది దీనితో స్పష్టమవుతోంది. ప్రత్యక్షంగా ఎన్నికల్లో నిలబడలేని మేధావుల అమూల్య సలహాలను పొందే అవకాశాలు రద్దుతో లేకుండా పోతాయన్న బాధ ఒక పక్క ఉన్నా, ప్రస్తుత పరిస్థితిలో వారి అనుభవాలు, సలహాల కన్నా  కేవలం రాజకీయ పునరావాస సభగా మారుతోందన్న అపవాదు లేకపోలేదు.

Tags: mandali chairman, shariff, tdp vs ysrcp

Leave a Reply