దీర్ఘకాలంగా మనదేశంలో సామాజిక అభివృద్ధికి, మానవ మనుగడకు ఎనలేని సేవ చేసిన వెనుకబడిన తరగతుల ప్రజలు నేడు బతుకు భారమై బతకలేని దుస్థితిలో ఉన్నారు. ఆదిమానవ సమాజం నుండి ఆధునిక సమాజం వరకు బి.సి లు ఉత్పత్తిలో కీలకపాత్ర వహించడమే కాకుండా ఎన్నో ఆవిష్కరణలు చేసి శాస్త్రజ్ఞులుగా నిలిచారు. జనాభాలో సగానికి ఎక్కువగా ఉన్న బి.సి లు నేటికి ఉత్పత్తిలో, శ్రమలో కీలకపాత్ర వహిస్తున్నారు. అలాంటి బి.సి లను ఆధిపత్య కులాల పాలకులు చిన్నచూపు చూస్తూ అన్ని రంగాల్లో శ్రమ దోపిడీ చేస్తూ అణచి వేస్తున్నారు. వెనుకబడిన వర్గాలు, అంటరాని కులాలు, ముస్లింలకు జరుగుతున్న అన్యాయలపై పోరు చేసి జనాభా ప్రాతిపదికన ప్రత్యేక నియోజకవర్గాల ప్రాతినిధ్యం ఇవ్వాలని అన్ని రంగాల్లో అవకాశం కల్పించాలని బ్రిటిష్ పాలనలోనే ఉద్యమాలు చేశారు. ఫలితంగా ముస్లింలు, ఎస్సిలు, క్రిస్టియన్లకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు. బి.సి లకు మాత్రం ఎలాంటి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించలేదు. స్వాతంత్య్ర ఉద్యమం, రాజ్యాంగ రచన సమయంలో విద్యా ఉద్యోగ రంగాల్లో బి.సి ల రిజర్వేషన్ లు, హక్కులు, రాజకీయ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినా అప్పటి కాంగ్రెస్ నాయకులు ఆ పోరాటాలను నీరుగార్చారు.
స్వాతంత్య్రానంతరం వెనుకబడిన కులాల (బి.సి ల) హక్కుల పోరాటం వల్ల వారి సామాజిక ఆర్ధిక స్థితిగతులను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం 1953 జనవరిలో కాకా కలేల్కర్ కమిషన్ నియమించింది. 1955 మార్చిలో కమిషన్ నివేదిక సమర్పించి బి.సి ల అభివృద్ధికి అనేక సూచనలు చేసింది. దేశంలో 2399 కులాలు వెనుకబడిన తరగతులుగా ఉన్నాయని అందులో 837 కులాలు బాగా వెనుకబడి ఉన్నాయని నివేదికలో తెలిపింది. భూ సంస్కరణలు జరిపాలని, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ పునవ్యవస్థీకరించాలని, వయోజన విద్య, విశ్వవిద్యాలయాల చదువులు అనేక రంగాల్లో వెనుకబడిన తరగతుల సత్వరాభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. 1961 లో కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలని, కమీషన్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. 1977లో జనతా పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో తాము అధికారంలోకి వస్తే కాకా కలేల్కర్ కమీషన్ నివేదిక అమలు చేసి బీ.సి లకు న్యాయం చేస్తామని తెలిపింది. అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ కమీషన్ నివేదికను అమలుపరచక పోవడంతో బి.సి సంఘాల, నాయకులు ఒత్తిడి చేయడంతో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయి ప్రభుత్వం మరోలా స్పందించి కాక కలెల్కర్ కమీషన్ నివేదిక సమర్పించి చాలా ఏండ్లు అయిందని కొత్త కమిషన్ నియమిస్తామని ప్రకటించింది.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి బి.పి మండల్ ఆధ్వర్యంలో 1978 డిసెంబర్ లో ప్రభుత్వం రెండవ బి.సి కమీషన్ నియమించింది. 1980 డిసెంబర్ 31 న మండల్ ప్రభుత్వానికి నివేదిక అందజేసారు. కథ మళ్ళీ మొదటికొచ్చి నివేదిక అమలులో జాప్యం జరిగింది. బి.సి నాయకులంతా ఏకమై 1981 సెప్టెంబర్ లో నేషనల్ యూనియన్ ఆఫ్ బ్యాక్ వార్డ్ క్లాసెస్ అనే ఉద్యమ సంస్థను బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ ప్రారంభించగా చౌదరి బ్రహ్మప్రకాష్ అధ్యక్షులుగా ఉద్యమం చేపట్టారు. 110 మంది పార్లమెంటు సభ్యుల సంతకాలతో ఒక వినతిపత్రం ప్రభుత్వానికి సమర్పించారు. ఐదు లక్షల ప్రజల సంతకాలతో కూడిన మరో విజ్ఞాపనను రాష్టపతి జ్ఞాని జైల్ సింగ్ కు ఇచ్చారు. 1988 నుండి 1990 వరకు బహుజన సమాజ్ పార్టీ మండల్ నివేదిక అమలుకు పోరాటం చేసింది. ఢిల్లీ లోని బోట్స్ క్లబ్ వద్ద కాన్షీరాం 48 రోజుల ధర్నా చేసారు. ఉద్యమాల ఒత్తిడి, మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అప్పటి ప్రధాని వి.పి సింగ్ 1990 ఆగస్టు 7 న మండల్ నివేదిక అమలుపరుస్తానని ప్రకటన చేసారు.
ప్రధాని ప్రకటనతో దేశ వ్యాప్తంగా ఆధిపత్య కులాలు ఆందోళన చేయడమే కాకుండా అన్ని పార్టీలు మండల్ నివేదికకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాయి. మండల్ నివేదిక కు నిరసనగా వి.పి. సింగ్ ప్రభుత్వానికి బయట నుండి మద్దతు ఇస్తున్న బీజేపీ మద్దతు ఉపసంహరించడమే కాకుండా ప్రజల దృష్టి మళ్ళించేందుకు ఆనాడు బీజేపీ అద్వానీ నాయకత్వంలో అయోధ్య రథయాత్ర చేపట్టింది. ఆనాడు రామమందిర్ రధయాత్ర చేసిన బీజేపీ, నేడు రామమందిర నిర్మాణంలో బి.సి లను బాగస్వాములు చేసి మతంలో మునిగి బి.సి ల హక్కులను కాలరాయడాన్ని ఓబీసీ లు గమనించాలి. మండల్ కమీషన్ అమలు చేయరాదని ఆధిపత్య కులాలు కోర్టును ఆశ్రయించగా, చివరకు 1993 లో మండల్ నివేదిక అమలుకు కోర్టు అనుమతి ఇచ్చింది. 52 శాతం జనాభా ఉన్న బి.సీ లకు ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్వంటి కేన్ద్ర సర్వీసుల్లో, ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎం, కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించారు. మండల్ కమీషన్ బి.సి ల అభివృద్ధికి మొత్తం 40 సూచనలు చేయగా అందులో ఒకటైన విద్యా ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ కల్పించి అప్పటి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. పారిశ్రామికీకరణ వల్ల బిసి వర్గాల వృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని వారికి ప్రత్యామ్నాయం చూడాలని, భూ సంస్కరణలు అమలుచేయాలని, ఓబీసీ లకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖన ఏర్పాటు చేయాలని, అన్ని రకాల ఆర్ధిక వనరులను రాష్టాలకు కేంద్రమే సమకూర్చాలని నివేదికలో సూచించారు. ఓబీసీ లు ఉన్న ప్రాంతంలో వయోజన విద్యతో పాటు రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించి, విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని, ఉన్నత విద్యలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, కుల వృత్తిదారులకు ఆర్ధిక సహాయం, సాంకేతిక సహాయం అందించి చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు ప్రోత్సకాలు అందించాలని సిఫారసు చేసారు. వృత్తి కులాలకు సహకార సంఘాలు, ఉత్పత్తి రంగంలో మౌలిక మార్పులు, ఓబీసీ లకు మిగులు భూమి పంపిణీ లాంటి సూచనలు నివేదికలో పొందుపరిచారు. బి.సి డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి సామాజిక, విద్యా, ఆర్ధిక అబివృద్దికి కృషి చేయాలని, చట్ట సభల్లో సముచిత స్థానం కల్పించేందుకు ఆ వర్గాలు అధికసంఖ్యలో నివసించే ప్రాంతాలను డీ లిమిటేషన్ సమయంలో నియోజకవర్గాలుగా మార్చాలని కూడా సూచించారు.
నిజాయితీకి మారు పేరు బి.పి మండల్
బీహార్ రాష్ట్రం మధేపూర్ జిల్లా మోరో గ్రామంలో రాస్ బీహారీ లాల్ మండల్ జమీందారి కుటుంబంలో ఆగస్టు 25, 1918 లో జన్మించిన బి.పి మండల్ 23 ఏటనే జిల్లా కౌన్సిల్ కు ఎన్నికయ్యారు. జీతం తీసుకోకుండా జుడిషియల్ మేజిస్టేట్ గా పనిచేశారు. 1952 మొదటిసారిగా శాసనసభకు ఎన్నికైన మండల్ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఏంపిగా వ్యవహరించారు. రామ్ మనోహర్ లోహియా నాయకత్వంలో పనిచేసిన మండల్ 1967 లో.బీహార్ లో జఠిగిన ఎన్నికల్లో 69 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఫిబ్రవరి 1968 లో బీహార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. బయట నుండి మద్దతునిచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతిపై విచారణ జరిగితే విచారణ బుట్టదా%•ష్ట్ర•%లు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేసినా కాంగ్రెస్ అవినీతి నాయకులపై చర్య తీసుకున్నారు. దాంతో కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కూలిపోయింది నీతికోసం నిలబడిన నాయకుడు బి.పి. మండల్ 1974 లో ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేసి జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని 1977 లో జనతాపార్టీ తరఫున లోకసభకు ఎన్నికయ్యారు.
కమిషన్ నివేదిక సమర్పించిన 10 ఏళ్ళ తర్వాత 40 సూచనల్లో ఒక్క విద్య ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్ కల్పించారు. ఆ రిజర్వేషన్ పలాలను ఇప్పు డిప్పుడే అందుకుంటున్న బి.సి లకు క్రిమిలేయర్ ను ప్రవేశ పెట్టి ఉన్నత విద్యా సంస్థలో ఓబీసీ ల కోటాలో మిగిలిన సీట్లను కూడ ఆధిపత్య కులాల వారు అనుభవిస్తున్నారు. 52 శాతం జనాభా కలిగిన బి.సి లకు సకల సామాజిక రంగాల్లో 52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిన బాధ్యత మరచిన ఆధిపత్య ప్రభుత్వాలు ఎన్నో పోరాటాల పలితంగా వచ్చిన 27 శాతం రిజర్వేషన్ కాపాడుకోవడానికి మండల్ ఆదర్శంగా బి.సి లు ఉద్యమించాల్సిన అవసరముంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ యుగంలో వృత్తులు ధ్వంసమై ఆధునీకరణకు నోచుకోక దిక్కుతోచని స్థితిలో, బతకలేక వలస బాట పట్టడం, బలిదానాలు చేసుకోవడం విచారకరం.
సాయిని నరేందర్, బి.సి స్టడీ ఫోరం, రాష్ట్ర కన్వీనర్ 9701916091