హృదయాలు
హద్దుల్ని చెరిపేసుకొని
ఆర్ద్రత భాషలో
సంభాషించుకొనే సమయాలు
మన ఆశయాల్లోంచే
ఆవిర్భవించాలి…
మన సౌభ్రాతృత్వపు చూపుల ధాటికి
మతమౌఢ్యపు మహమ్మారి
చేష్టలుడిగిజి
మొహం చాటెయ్యాలి-
సంకుచిత పరిధులు
సతతం మాయమవ్వాలి…
మోడువారిన సమైక్యత చెట్టు
మళ్లీ చిగురించడానికి
మనమే తొలకరులు కావాలి…
మన హృదయోద్యానాల్లో
మానవత్వపు ఆమని
మనసారా విరబూసి
మనిషితనపు పరిమళాల్ని
మనచుట్టూ వెదజల్లాలి…
కరడుగట్టిన గుండెల
కల్మష తిమిరాలను
కడతేర్చేందుకు
మన నవ్వుల వెన్నెల
నిరంతరం వెలగాలి…
మన మనసుల మధ్య
ముసురుకున్నజి
విద్వేషపు మబ్బుతెరల్ని
సామరస్యకిరణాలతో
మనమే తొలగించుకోవాలి…
– డాక్టర్ కొత్వాలు అమరేంద్ర,9177732414