Take a fresh look at your lifestyle.

రైతుల ఆందోళనకు మమత మద్దతు…ఇది ఆత్మగౌరవ పోరాటమనన్న దీదీ

ఢిల్లీలో పంజాబ్‌ ‌రైతుల ఆందోళన పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలు జరుపుతున్న తరుణంలోనే దేశవ్యాప్తంగా ఆందోళన ప్రారంభిస్తామంటూ తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించడం ఈ సమస్యపై ప్రతిపక్షాల వైఖరి తీవ్రమౌతోందన్న సంకేతాలకు నిదర్శనం. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కార్తీక పౌర్ణమి నాడు వారణాశిలో పూజలు నిర్వహించిన అనంతరం గంగానది ఒడ్డున చెబుతున్నానంటూ వ్యవసాయ బిల్లులు రైతులకు వరప్రసాదమన్నారు. అవి వరప్రసాదమో కాదో తెలియదు కానీ, ప్రభుత్వ వైఖరి రైతుల అనుమానాలను మరింత పెంచుతోంది. వ్యవసాయానికి సంబంధించి కీలకమైన బిల్లులను హడావిడిగా ఆమోదింపజేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మమతా బెనర్జీ మోడీని ప్రశ్నించారు. కేంద్రం తొందరపడుతున్న ధోరణి రైతులకే కాదు, ఎవరికైనా అనుమానాలు కలిగిస్తుందని అన్నారు. ఇది రైతుల ఆత్మగౌరవ పోరాటమని ఆమె అన్నారు. రైతుల ఆదాయాన్ని ఐదేళ్ళలో రెట్టింపు చేస్తానని హామీలిచ్చిన మోడీ ఇప్పుడు ఉన్న ఆదాయాన్ని ఊడగొట్టే యత్నాలు సాగిస్తున్నారని మమత ఆరోపించారు. మరో వైపు ఢిల్లీలో రైతులు చలిని సైతం లెక్క చేయకుండా ఆందోళనను కొనసాగిస్తున్నారు.

ప్రభుత్వం భోజన సౌకర్యం కల్పిస్తామన్నా వొద్దని తమకు తామే వంటలు చేసుకుని నిరసనలు కొనసాగిస్తున్నారు. రైతు ప్రతినిధులతో చర్చల సందర్భంగా ఈ చర్చల్లో పాల్గొనే వారి కోసం ఢిల్లీలోని విజ్ఞాన భవనంలో భోజన ఏర్పాట్లు చేశారు. తమకు ఆత్మగౌరవం ఉందనీ, ప్రభుత్వం ఒక వంక తమ కోర్కెలను నిరాకరిస్తూ అవమానిస్తూనే, భోజనాలు పెడతామంటే తినేందుకు సిద్ధంగా లేమని రైతు సంఘాల ప్రతినిధులు అన్నారు. ఆందోళనలో పాల్గొంటున్న రైతులు తయారు చేసిన ఆహారాన్నే వారు స్వీకరించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని దేశద్రోహులుగా అధికార పార్టీ నాయకులు అభివర్ణించడంపై అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖబీర్‌ ‌సింగ్‌ ‌బాదల్‌ ఉ‌గ్రుడయ్యారు. ఆయన తండ్రి, అకాలీదళ్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు ప్రకాష్‌ ‌సింగ్‌ ‌బాదల్‌ ‌ప్రభుత్వం తనకిచ్చిన పద్మవిభూషణ్‌ ‌పురస్కారాన్ని వాపస్‌ ‌చేశారు. రైతులను రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంలో బీజేపీ నాయకులు పోటీ పడుతున్నారేమోననిపిస్తోంది.

రైతుల ఆందోళనలో వృద్ధమహిళలు కూడా పాల్గొంటున్నారనీ, అలాంటి వారు ఖలిస్థాన్‌ ఉ‌గ్రవాదులు ఎలా అవుతారని సుఖబీర్‌ ‌బాదల్‌ ‌ప్రశ్నించారు. కర్నాటక బీజేపీ నాయకుడు, రాష్ట్ర వ్యవసాయ మంత్రి బీసీ పాటిల్‌ ‌రైతుల ఆత్మహత్యలపై వారిని అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేశారు. రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోరని అనడం వరకూ బాగానే ఉంది. కుటుంబాలను పోషించుకోలేనివారే ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ ఆయన వ్యాఖ్యానించడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఆ పరిస్థితి ఎందుకు వొచ్చిందో పాలకులు ఆలోచించాలి. బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతులు సుఖసంతోషాలతో ఉన్నట్టు ఆయన అభివర్ణించి చెప్పడం పుండుమీద కారం చల్లిన చందంగా రైతులు భావిస్తున్నారు. రైతుల కోసం మోడీ ప్రభుత్వం చేసిందేమీ లేదనీ, కేవలం ప్రచారం కోసమే వ్యవసాయ చట్టాలను ఉపయోగించుకుంటోందని కర్నాటక కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు ఉగ్రప్ప ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ ‌సంస్థలకు అప్పగించడం కోసమే ఈ మూడు చట్టాలను తెచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

దేశంలో ఇప్పుడు వ్యవసాయ ప్రతికూల విధానాలు అమలు జరుగుతున్నాయనీ, ఇందుకు భారతీయ జనతాపార్టీదే బాధ్యత అని కాంగ్రెస్‌ ‌నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం రైతులతో చర్చలు ప్రారంభించినప్పటికీ అవి కొలిక్కి రావడం లేదు. తమ డిమాండ్లను ఆమోదించేవరకూ వెనక్కి తగ్గబోమని రైతు ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ తరుణంలో ప్రభుత్వం రైతు సంఘాల నాయకుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అకాలీ దళ్‌ ‌నాయకుల్లో సీనియర్‌ అయిన ధిండ్సా కూడా ఈ ఆందోళనకు మద్దతు ప్రకటించారు. పంజాబ్‌ ‌రైతులకు మద్ధతుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ , ఉత్తరప్రదేశ్‌ ‌రైతులు ఆందోళన చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా, వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడమో, లేక వాటిని సరళీకరించడమో చేయాలి. లేని పక్షంలో ఈ ఆందోళన దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల రైతులు తమ మద్ధతును ప్రకటించారు.

రైతు ప్రతినిధులతో చర్చలు జరుపుతున్న మంత్రులు, అధికార పార్టీ నాయకులకు వ్యవసాయ రంగంపై అనుభవం లేదనీ, వారితో చర్చల వల్ల ప్రయోజనం లేదని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇది రాజకీయ ఉద్యమం కాదనీ, పంజాబ్‌ ‌రైతులే రుజువు చేశారు. పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ అం‌డతో సాగుతున్న ఉద్యమాన్ని ప్రతిపక్షమైన అకాలీదళ్‌ ‌మద్ధతుగా నిలవడమే ఇందుకు నిదర్సనం. పంజాబ్‌ ‌రైతుల ఆందోళనపై దేశంలోని వేర్వేరు ప్రాంతాల రైతు సంఘాలు కూడా సానుకూలంగా ప్రకటించాయి. వ్యవసాయ ఉత్పత్తులపై ధరలను నిర్ణయించే అధికారం రైతులకే కల్పిస్తామని అలనాడు యూపీయే ప్రభుత్వం నమ్మబలికింది. ఇప్పుడు బేజేపీ ప్రభుత్వం అదే మాట అంటూ వ్యవసాయాన్ని కార్పొరేట్‌ ‌వర్గాలకు అప్పదించేందుకు సిద్ధపడుతోంది. ప్రధాన పార్టీలపై రైతులకు నమ్మకం పోయింది. అందుకే, ఎవరెన్ని విధాల నచ్చజెప్పినా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు.

Leave a Reply