Take a fresh look at your lifestyle.

గడ్‌ ఆలా పన్‌ ‌సింహ్‌ ‌గేల..

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న ఒక మాట గుర్తుకు వొస్తున్నది. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ‌తన తల్లి జిజియాబాయి కోరిక మేరకు కొండానా కోట ( ఆ తర్వాత దానిపేరు సింహ్‌గడ్‌గా మారింది.) ను జయించి తనకు స్వాధీన పర్చమని, తనకు అత్యంత ఆప్తుడు, సుబేదార్‌ అయిన తానాజీకి బాధ్యతను అప్పగిస్తాడు.. సొంత కూతురు వివాహం ఉన్నప్పటికీ స్వామి భక్తి తో తానాజీ ఆ కోటను జయిస్తాడు. ఆ పోరాటంలో వీరమరణం పొందుతాడు. అది విన్న శివాజీ ‘గడ్‌ ఆలా పన్‌ ‌సింహ్‌ ‌గేలా ’ అంటాడు. ఈ మారాఠీ వ్యాఖ్యకు అర్థమేమంటే కోట అయితే దక్కింది కాని, సింహం పోయిందని. తానాజీ సింహం లాంటివాడు కావడంతోనే శివాజీ ఆయన గెలిచిన కొండాన కోటకు సింహ్‌ గడ్‌గా నామకరణం చేశాడు. పశ్చిమ బెంగాల్‌ ‌ఫలితాలు పై సన్నివేశాన్ని గుర్తు చేస్తున్నాయి.

బెంగాల్‌ ‌టైగర్‌ ‌మమతా బెనర్జీ తాను మాత్రం ఓటమిపాలైనా తన పార్టీ నైతే అత్యంత మెజార్టీతో గెలిపించుకోగలిగింది. ఈ విజయం తో బంగ్లాలో తృణముల్‌ ‌హ్యట్రిక్‌ ‌కొట్టినట్లయింది. దీంతో బెంగాల్‌పై అమెకు ఎంత పట్టు ఉందో అర్థమవుతున్నది. ఒకనాడు కాంగ్రెస్‌ను వీడి, ఇక్కడ కమ్యూనిస్టులను మట్టి కరిపించి దశాబ్దానికి పైగా పాలన సాగిస్తున్న మమత పట్ల అక్కడి ప్రజలకు ఏమాత్రం వ్యతిరేకతలేదన్నది దీనివల్ల స్పష్టమవుతున్నది. అంతేకాదు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అంతకు మించిన స్థానాలు అమె కైవసం చేసుకోగలిగింది కూడా. 2016 శాసనసభ ఎన్నికల్లో తృణముల్‌ ‌కాంగ్రెస్‌ 211 ‌స్థానాలను గెలచుకోగా, ఈ సారి నాలుగు స్థానాలు అధికంగా 215 స్థానాలను గెలుచుకుంది.

ఎట్టి పరిస్థితిలోనూ ఈసారి ఇక్కడ జంఢా పాతుతామన్న ధీమాను వ్యక్తంచేసిన భారతీయ జనతాపార్టీ ఆశలు మాత్రం నిరాశలైయ్యాయి. అయితే గతంతో పోలిస్తే ఆ పార్టీ బెంగాల్‌లో ఈసారి మంచి పట్టు సాధించిందనే చెప్పాలె. 2016 ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలకే పరిమితమైన ఆ పార్టీ ఈసారి 75 స్థానాలకు ఎదగడం మామూలు విషయమేమీకాదు. విచిత్రమేమంటే గతంలో 44 స్థానాలు సంపాదించుకున్న కాంగ్రెస్‌, 26 ‌స్థానాలను సాధించుకున్న సిపిఎం పార్టీలకు సున్నా స్థానాలు రావడం. మిగతాపార్టీల సంగతి ఎలాఉన్నా దేశంలో తాజాగా జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ విజయఢంకా మోగిస్తామని ఉత్సాహపడిన బిజెపి కేవలం రెండు రాష్ట్రాలు అస్సాం, పుదుచ్చేరిల్లో కూటమితో విజయం లభించింది.

బెంగాల్‌, ‌కేరళ, తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రాల్లో మాత్రం నిరాశే ఎదురైంది. అన్నిటికీ మించి పశ్చిమ బెంగాల్‌పైన బిజెపి మొదటినుంచీ దృష్టిసారించింది. ప్రధానిమోదీకి, బెంగాల్‌ ‌సిఎం దీదీకి చాలా కాలంగా పడకపోవడంతో ఎట్టిపరిస్థితిలో బెంగాల్‌పై కాషాయ జంఢాను ఎగురవేయాలని బిజెపి ఆ రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాదాపు ఒక సంవత్సరకాలంగా రాజకీయం చేస్తూ వొచ్చింది. దీదీని, ఆమె పార్టీని బలహీనపర్చేందుకు పార్టీలోని ముఖ్యనేతలను ఒక్కొక్కరిగా తమ పార్టీలో చేర్చుకునే ప్రక్రియను ఎన్నికలకు చాలా ముందునుండే మొదలెట్టింది. చివరకు ఆమె కుడిభుజంగా ఉన్న సువేదు అధికారిని లాక్కుని అమెకు పోటీగా నిలిపి ఆ స్థానంలో విజయం సాధించడం ద్వారా లక్ష్యానికి చేరువయినట్లుగా ఆ పార్టీ భావిస్తోంది.

2011 నుండి తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న మమతా బెనర్జీ లక్ష్యంగా సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోదీ మొదలు హోంశాఖ మంత్రి అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, ‌స్మృతి ఇరానీ, పీయూష్‌గోయల్‌, ‌రవిశంకర్‌ ‌ప్రసాద్‌, ‌యుపి సిఎం అధిత్యనాథ్‌దాస్‌ ‌లాంటి హేమాహేమీలంతా బెంగాలంతా పర్యటించి దాదాపు వందకు పైగా సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మమతపై అనేక మాటల తూటాలను పేల్చారు. ఎన్నికల సంఘం వ్యవహార శైలి పై కూడా మమత అసంతృప్తి వ్యక్తం చేసారు .రాష్ట్రం మొత్తం కేంద్ర భద్రతా దళాలను భారీగా మోహరించారు. ఎనిమిది విడుతలుగా ఎన్నికలు నిర్వహించి ఆమెను ఇరుకున పెట్టె ప్రయత్నం చేసారు .ఒక నియోజక వర్గంలో నాలుగు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. అయినా మొక్కవోని ధైర్యంతో బెంగాల్‌ ‌బెబ్బులిలా మమత ఒంటిచేత్తో అనే కన్నా ఒంటి కాలుతో హ్యాట్రిక్‌ ‌సాధించింది.

తృణముల్‌ ‌కాంగ్రెస్‌, ‌బిజెపి వర్గాల మధ్య జరిగిన తోపులాటలో తన కాలుగా గాయమైనప్పటికీ ఏమాత్రం బెదరకుండా కాలుకు కట్టుకట్టుకుని చక్రాల కుర్చీలోనే ప్రచారాన్ని నిర్వహించి ఆమె విజయం సాధించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, 75లక్షలమంది రైతులకు పిఎం కిసాన్‌ ‌కింద ఆర్థిక సహాయం అందిస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం సిఫారసులను అమలుపరుస్తామని, ఆడ పిల్లలకు కెజి నుండి పిజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ఇలా అనేక వాగ్ధానాలను బిజెపి చేసినప్పటికీ బెంగాల్‌ ‌ప్రజలు దీదీ పక్షాన్నే నిలిచారు. తాను బెంగాల్‌కా బేటీనని, మోదీ,అమిత్‌షాలంతా బయటివారన్న మమత ప్రచారం స్థానికతను తట్టిలేపింది.

అలాగే సిఎఎకు వ్యతిరేకంగా మమత చేసిన ప్రచారం ముస్లిం వోటర్లను ఆకర్షించడం కూడా ఆమెకు కలిసి వొచ్చిన అంశం. ఒంటరిగానే బిజెపి లాంటి కొండను ఢీకొన్న మమతకు తన ఎన్నిక మాత్రం కలిసి రాలేదు.వోట్ల లెక్కింపులో గందరగోళం ఏర్పడిందని, అందుకు మళ్ళీ వోట్లు లెక్కించాలన్న అమె డిమాండ్‌ను ఇసి తోసిపుచ్చింది. కాగా న్యాయం కోసం కోర్టుకు వెళ్తానంటున్న ఆమె మోదీపై ధ్వజం ఎత్తేందుకు గతంలోని ఆలోచనమేరకు ప్రాంతీయ పార్టీ లన్నిటిని ఏకం చేసే ఆలోచనేమైనా చేస్తుందేమో వేచిచూడాలి.

Leave a Reply