Take a fresh look at your lifestyle.

తెలంగాణ  సాయుధ పోరాటయోధురాలు  మల్లు స్వరాజ్యం

 

భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా  సాయుధ పోరాటం చేసిన ప్రముఖ మహి ళామణుల్లో  మల్లు స్వరాజ్యం అగ్ర భాగాన నిలి చారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం కీలకపాత్ర పోషించి సరికొత్త చరిత్ర సృష్టించారు. మల్లు స్వరాజ్యం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని   ( ప్రస్తుత సూర్యాపేట జిల్లా ) తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెంలో వందలాది ఎకరాలు కలిగిన భూస్వామ్య కుటుంబంలో 1931 వ సంవత్సరంలో  భీంరెడ్డి  రాంరెడ్డి, చొక్కమ్మ దంపతులకు జన్మించారు. ఏడు సంవత్సరాల వయస్సులో ఆమె తండ్రి రామి రెడ్డి మరణించారు.  ఆమె ఐదవ తరగతి వరకు అభ్యసించారు. తన పదకొండవ ఏటనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మల్లు స్వరాజ్యం పదేళ్ల వయసులోనే మాక్సిం గోర్కి రాసిన ‘అమ్మ’ నవలను చదివి స్ఫూర్తి పొంది కమ్యూనిస్టు పార్టీలో చేరారు. నిజాం కాలంలో వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటంలో  పాల్గొని నిజాం అరాచకాలను ఎదిరించారు.
   మల్లు స్వరాజ్యం  పదకొండు సంవత్సరాల వయస్సులో కట్టుబానిసలకు స్వస్తి పలకాలని ఆంధ్ర మహాసభ ఇచ్చిన పిలుపుకు ప్రతిస్పందిస్తూ కుటుంబ కట్టుబాట్లను ధిక్కరించి వివిధ కులాలు మరియు వర్గాల నుండి వచ్చిన బంధు కార్మికులకు బియ్యం పంపిణీ చేయడంతో ప్రజా  జీవితాన్ని ప్రారంభించారు. ఆ  రకంగా ఆంధ్ర మహాసభ పిలుపు మేరకు పదకొండు సంవత్సరాల వయసులో కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులు అవడమే కాకుండా తక్షణమే ‘దున్నే వాడిదే భూమి’ అని,  ‘దొరల పాలన అంతం కావాలి’ అని ఆమె నినదించారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో ఆమె   తన పొలంలో పండిన ధాన్యాన్ని పేదలకు పంచారు.  వ్యవసాయ భూములను తమ గుప్పిట్లో పెట్టుకుని నిజాం రాజు, ఆయనకు సహకరించే దేశముఖ్లు రైతుల మీద దౌర్జన్యాలకు పాల్పడుతూ, వారి శ్రమను దోచుకుంటుంటే చూసి సహించలేక పదమూడు ఏళ్ల వయసులోనే మల్లు స్వరాజ్యం భారత కమ్యూనిస్ట్  ‌పార్టీ నేతృత్వంలో సాయుధ పోరాటంలోకి ప్రవేశించి భూస్వామ్య వ్యతిరేక ఉద్యమంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం  అవిశ్రాంతంగా ఉద్యమించారు.
మల్లు స్వరాజ్యం తెలంగాణలోని పల్లెపల్లెకు తిరిగి నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచారు. నైజాం పోలీసులు, భూస్వాముల ప్రైవేటు సైన్యాలను హడలెత్తించేలా ఆమె గెరిల్లా పోరాటంలో పాల్గొన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేయడం, భూస్వాముల గడీలపై దాడులు చేయడం, ధాన్యాన్నిపేదలకు పంచడం, గ్రామాలను విముక్తం చేసి, భూములను రైతులకు పంచి ఇవ్వడంలాంటి కార్యక్రమాలలో పాల్గొన్నారు. రైతులను, మహిళలను, గిరిజనులను ఏకం చేసి గెరిల్లా పోరాటం సాగించిన మల్లు స్వరాజ్యం తనలాంటి ఎందరో మహిళలకు  ఆ పోరాటంలో శిక్షణ ఇచ్చారు.
మల్లు స్వరాజ్యం భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికి అనునిత్యం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో  తన సోదరుడు బి. ఎన్‌. ‌రెడ్డితో  కలిసి పాల్గొన్న అత్యున్నత ధైర్యసాహసాలు ప్రదర్శించి ఎందరో మహిళలకు స్ఫూర్తిదా య కంగా నిలిచారు.ఆడవాళ్ళు ఇంట్లోంచి బయటకి అడుగు పెట్టడమే పాపంగా భావించే ఆ రోజుల్లో ధైర్యంగా గ్రామాల్లో పర్యటించి తన పదునెక్కిన ఉపన్యాసాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశారు. మిలిటెంట్‌ ‌పోరా టంలో చురుకుగా పాల్గొన్న మల్లు  స్వరాజ్యం తన సోదరుడు బి.ఎన్‌.‌రెడ్డితో కలిసి అడవుల్లో మిలిటెంట్‌ ‌స్క్వాడ్లను (దళాలు) ఏర్పాటు చేశారు. ఆమె  పదహారు సంవత్సరాల వయస్సులో ఆయుధాలు కాల్చడంలో శిక్షణ పొంది రైతుల పక్షాన భూస్వాములపై పోరాడేందుకు తుపాకి ఎక్కుపెట్టారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా  మల్లు స్వరాజ్యం ఆదిలాబాద్‌, ‌వరంగల్‌, ‌కరీంనగర్‌ ‌జిల్లాలో పని చేశారు. గెరిల్లా దళాలతో దాడులు చేస్తూ నైజాం సర్కారును గడగడలాడించారు. అజ్ఞాతంలో ఉండి రాజక్క పేరుతో దళాలను నిర్మించి నడిపించారు.  మల్లు స్వరాజ్యం   తన దళం కార్యకలాపాలతో రజాకారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. మల్లు స్వరాజ్యాన్ని పట్టుకోవడానికి వీలుకాకపోవడంతో నైజాం పోలీసులు ఆమె ఇంటిని తగులబెట్టారు. అయినా ఏమాత్రం వెరవకుండా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు.  సహ కార్యకర్తల సలహా మేరకు ఆమె కొంతకాలం అండర్గ్రౌండ్కు వెళ్లిపోయారు. ఆమెను పట్టుకున్నవారికి పదివేల రూపాయలు బహుమతి ఇస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఏది ఏమైననూ  ‘నిజాం పాలనపై తిరుగుబాటు చేసి 1945-1948 మధ్య కాలంలో తెలంగాణ సాయుధ పోరాటంలో అసమాన ధైర్య సాహసాలతో  వీరోచితంగా ఉద్యమించిన విప్లవకారిణి మల్లు స్వరాజ్యం’ అని   సగర్వంగా  పేర్కొనవచ్చు.
మల్లు స్వరాజ్యం  సహ కార్యకర్త మరియు వ్యూహకర్త  అయిన కామ్రేడ్‌ ‌మల్లు వెంకట నర్సింహారెడ్డిని వివాహం చేసుకున్నారు. 1954 మే నెలలో  హైదరాబాద్లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని దేవులపల్లి వెంకటేశ్వరరావు నివాసంలో సాయుధ పోరాట యోధుడు కమ్యూనిస్టు నాయకులు బద్దం ఎల్లారెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు సమక్షంలో నిరాడంబరంగా కేవలం దండలు మార్చుకుని వారు వివాహం చేసుకున్నారు.  ఆమె భర్త వెంకటనర్సింహారెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా సి.పి.ఎం కార్యదర్శిగా పనిచేసి 2004 డిసెంబర్‌ 4 ‌నాడు మరణించారు.
మల్లు స్వరాజ్యం భారత కమ్యూనిస్ట్ ‌పార్టీ చీలిన తర్వాత భారత కమ్యూనిస్ట్ ‌పార్టీ (మార్క్సిస్ట్ )‌లో చేరారు. మల్లు స్వరాజ్యం భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) ‌తరపున నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజక వర్గం నుంచి 1978, 1983లలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా  గెలుపొంది ప్రజాసేవ చేశారు. మొదటిసారి ఐదేళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిననూ  1983లో మాత్రం
ఆమె రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అసెంబ్లీని రద్దు చేయడంతో ఒక ఏడాది మాత్రమే ఎం.ఎల్‌. ఏగా కొనసాగారు. అలా 1985 లో ప్రభుత్వం కూలిపోవడంతో 1985, 1989 రెండు పర్యాయాలు ఎం.ఎల్‌.ఏ అభ్యర్థిగాను మరియు 1996 లో మిర్యాలగూడెం పార్లమెంట్‌ ‌స్థానానికి మల్లు స్వరాజ్యం పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయిననూ పార్టీ నాయకురాలిగా నిరంతరం సభలు, సమావేశాల్లో  విస్తృతంగా పాల్గొన్నారు. అలాగే పార్టీ రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత భారత కమ్యూనిస్ట్ ‌పార్టీ ( మార్క్సిస్ట్ ) ‌కేంద్ర కమిటీ సభ్యురాలు స్థాయికి ఎదిగారు.
మల్లు స్వరాజ్యం శాసనసభ్యురాలుగా ఉన్న సమయంలో ముఖ్యంగాఅనేక భూసమస్యలను పరిష్కరించారు. అలాగే తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి ప్రభుత్వ జూనియర్‌ ‌కళాశాలను మంజూరు చేయించారు. అప్పట్లో కార్పస్‌ ‌ఫండ్‌ ‌చెల్లిస్తేనే కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేది. కానీ, మల్లు స్వరాజ్యం తుంగతుర్తి ప్రాంతం వెనుకబడిన ప్రాంతమని ప్రభుత్వంతో కొట్లాడి కార్పస్‌ ‌ఫండ్‌ ‌చెల్లించకుండానే జూనియర్‌ ‌కళాశాలను మంజూరు చేయించారు.
వామపక్ష భావజాలంతో మహిళా కార్యకర్తలు నిర్వహిస్తున్న ‘‘చైతన్య మానవి’’ పత్రిక సంపాదకవర్గ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.తన జీవిత చరిత్రను  ‘‘నా మాటే తుపాకి తూట’’ అనే పుస్తకం రూపంలో వెలువరించారు.
మల్లు స్వరాజ్యం భూస్వామ్య  కుటుంబంలో పుట్టి పెరిగిననూ ఆమె అదే భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించి భూస్వాములను గడగడలాడించారు. ‘‘నేను భూస్వాముల కుటుంబం నుంచే వచ్చాను. భూస్వాముల దౌర్జన్యం ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రజల కోసం ఆయుధం పట్టడంలో, ప్రజల కోసం పనిచేయడంలో విప్లవ కార్యాచరణ  ఉంది’’ అని ఆమె పేర్కొనడం విప్లవ స్ఫూర్తికి సంకేతంగా నిలుస్తుంది.
తన జీవిత చివరి దశలో కూడా పీడిత ప్రజలకు అండగా నిలవడమే కాకుండా అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చి కార్యకర్తలల్లో  నిత్య చైతన్య స్ఫూర్తిని సజీవంగా రగిలించిన మల్లు స్వరాజ్యం 91 సంవత్సరాల వయసులో 2022, మార్చి 19 నాడు మరణించారు. ఆమె మరణం వామపక్ష ఉద్యమాలకు తీరనిలోటు. ‘దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు ఎర్రజెండాతో మమేకమైన  మల్లు స్వరాజ్యం జీవితం కడవరకు పోరాట స్ఫూర్తితోనే కొనసాగడమే కాకుండా ఎందరికో చెరగని పోరాట స్ఫూర్తిని రగిలిస్తుంది’ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
 జె.జె.సి.పి. బాబూరావు
రీసెర్చ్ ‌స్కాలర్‌,94933 19690

Leave a Reply