Take a fresh look at your lifestyle.

మళ్ళీ..’’జెండెత్తాల్సిందే’’!..

“లాక్‌ ‌డౌన్‌ అనంతరం దేశ ఆర్థిక రంగానికి తిరిగి ప్రాణం పోయటానికి ప్రభుత్వాలు నిర్మాణాత్మకంగా కృషి చేయాల్సివుంది. దిగువ, నిరుపేద ప్రజల కనీస అవసరాలు తీర్చుకునే కొనుగోలు శక్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవల్సిన ప్రభుత్వాలు ఇందుకు భిన్నంగా యాజమాన్యాల బొక్కసాలు నింపే తిరోగమన చర్యలు చేపడ్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌, ‌మధ్యప్రదేశ్‌ ‌ప్రభుత్వాలు రద్దుచేసిన 38కి పైగా కార్మిక చట్టాల ఆర్డినెన్సులు వందల సంవత్సరరాలు కార్మిక వర్గ పోరాటాల చరిత్రను భూస్థాపితం చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌ ఏకంగా 38 చట్టాలను రద్దుచేస్తూ ఆర్డినెన్స్ ‌తేవటం ఆర్థిక ఆవలంబన సూత్రాలకు విరుద్ధమని భావిస్తున్నారు.”

లాక్‌ ‌డౌన్‌ ‌కుంగదీసిన ఆర్థికరంగానికి జవసత్వాలు కల్పించే మిషతో ఉత్తరాదిన రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్మికచట్టాలను సవరణ పేరుతో రద్దు చేస్తూ ఆర్డినెన్స్‌లు జారీచేశాయి. కోవిడ్‌ 19 ఒక సునామీలా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ప్రమాదం కన్నా పెద్దది. ఆర్థిక రంగాన్ని బతికించేందుకు యజమానులకు అనుకూలంగా కార్మిక చట్టాల సవరణ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ, సామాజిక, ఆర్థిక అవగాహనారాహిత్యాన్ని బట్టబయలు చేస్తున్నది. యూనియన్ల భాషలో చెప్పాలంటే ఈ చట్టాల సవరణ పెట్టుబడిదారుల కొమ్ము కాస్తున్నదనవచ్చును. లాక్‌ ‌డౌన్‌లో స్థంభించిన ఉత్పత్తులు, సేవారంగం, పరిశ్రమలు జన జీవనాన్ని కకావికలం చేస్తుండగా కార్మికచట్టాల హననం ప్రధానంగా కోట్లాది మంది సంఘటిత, అసంఘటిత, కార్మిక వర్గం ఉపాధి ఉద్యోగాలను ప్రశ్నార్థకంలో పడవేసింది. లాక్‌ ‌డౌన్‌ అనంతరం దేశ ఆర్థిక రంగానికి తిరిగి ప్రాణం పోయటానికి ప్రభుత్వాలు నిర్మాణాత్మకంగా కృషి చేయాల్సివుంది. దిగువ, నిరుపేద ప్రజల కనీస అవసరాలు తీర్చుకునే కొనుగోలు శక్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవల్సిన ప్రభుత్వాలు ఇందుకు భిన్నంగా యాజమాన్యాల బొక్కసాలు నింపే తిరోగమన చర్యలు చేపడ్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌, ‌మధ్యప్రదేశ్‌ ‌ప్రభుత్వాలు రద్దుచేసిన 38కి పైగా కార్మిక చట్టాల ఆర్డినెన్సులు వందల సంవత్సరరాలు కార్మిక వర్గ పోరాటాల చరిత్రను భూస్థాపితం చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌ ఏకంగా 38 చట్టాలను రద్దుచేస్తూ ఆర్డినెన్స్ ‌తేవటం ఆర్థిక ఆవలంబన సూత్రాలకు విరుద్ధమని భావిస్తున్నారు.

పారిశ్రామిక వివాదాల చట్టం, వృత్తి భద్రతా చట్టం, ఆరోగ్య సంరక్షణ చట్టం, కాంట్రాక్ట్ ‌కార్మిక చట్టం, వలస కార్మిక చట్టం, సమాన వేతన చట్టం తదితర ముఖ్యమైన చట్టాలన్నింటిని ఒక్క కలం పోటుతో సమాధి చేయటం భవిష్యత్‌ ‌పరిణామాలకు ముందస్తు హెచ్చరికలా తోస్తుంది. ‘‘టెంపరరీ ఎగ్జంషన్స్ ‌ఫర్‌ ‌సస్టేయిన్‌ ‌లేబర్‌ ‌లాస్‌ అం‌డ్‌ ఆర్డినెన్స్ 2020’’ ‌పరిధిలో రానివి కేవలం నాలుగే. అవి భవన నిర్మాణ కార్మికులచట్టం, నష్టపరిహార చట్టం, వెట్టికార్మికచట్టం వేతన చెల్లింపుల చట్టంలు మాత్రమే! మధ్యప్రదేశ్‌ ‌ప్రభుత్వం కూడా ఇదే దారుణాలకు ఒడికట్టింది. రాజస్థాన్‌, ‌గుజరాత్‌, ‌పంజాబ్‌, ‌హిమాచల ప్రదేశ్‌లు పన్నెండు గంటలు పనిదినం చట్టంతో పాటు మిగతా అనేక చట్టాలను ఇంతకు ముందే తుంగలో తొక్కాయి. పారిశ్రామిక చట్టాలను సరళతరం చేయటం ద్వారా యాజమాన్యాలు లాభపడే కుట్రలకు ఒడిగడ్తున్న ఉత్తరాది రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక ధోరణులు మిగతా రాష్ట్రాలకు కూడా వ్యాపించే అవకాశం త్వరలోనే వుంది. మన దేశ ఆర్థిక రంగాభివృద్ధికి విదేశీ పెట్టుబడులే శరణ్యమంటూ యాజమాన్యాలకు లాభం కల్గించే కార్మిక వ్యతిరేక చర్యలకు దిగుతున్నాయి.. వృత్తి సేవల వినిమయం మాత్రమే దేశ అర్థికాభివృద్దికి దోహదపడుతుంది. ఈ శాస్త్రీయ ధృక్పథానికి భిన్నంగా ప్రభుత్వాలు తప్పటడుగులు వేస్తున్నాయి.రాష్ట్ర ప్రభుత్వాల ఈ దుందుడుకు తప్పడుగులకు అసలు కేంద్ర ప్రభుత్వమే బీజం వేసిందన్న సంగతి మరువరానిది. ‘‘శ్రమయేవజయతే’’ పేరిట ‘సువిధ’’ పోర్టల్‌ ఏర్పాటు ద్వారా ప్రకటించిన కార్మిక విధానాల్లో ‘‘మేకినిండియా’’ ప్రధానమైంది. ఈ ప్రధానమైన కార్మిక ‘సంక్షేమ’ గవాక్షం గుండానే కార్పొరేట్‌ ‌శక్తుల కనుసన్నలతో ప్రభుత్వం లాక్‌ ‌డౌన్‌ ‌బూచి చూపి పన్నెండుగంటల ‘‘పనిచట్టం’’తో సహా పలు కార్మిక చట్టాలను సవరించే ప్రమాదం పొంచి వుందన్న నిజం భారతీయ కార్మిక వర్గాల్ని కలవర పెడ్తుండగనే అది ఉత్తరాది రాష్ట్రాల్లో నిజమైంది.

ఒక వైపు ‘‘మేకినిండియా’’ ద్వారా విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్న బిజెపి సర్కార్‌, ‌మరోవైపు కార్మికవర్గాలు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న పలుహక్కులను, వివిధ చట్టాలను కాలరాసే దుశ్చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేసిందనేది అక్షరాల సత్యం. కార్మిక చట్టాల సవరణ బిల్లు 2011, అప్రెంటిస్‌ ‌బిల్లు 2014లను ఏకపక్షంగా పార్లమెంట్‌లో ఆమోదింపచేసుకుంది. అప్రెంటిస్‌ ‌చట్టం 1962ను సవరించటం, అప్రెంటిస్‌ల నియమాకం, పనిగంటల నియమాలు, కార్మిక రక్షణ తదితర విషయాల్లో యాజమాన్యాల దోపిడీకి దోహదపడుతూంది. బీడీ కార్మిక సంక్షేమచట్టం (1976), బీడీ కార్మిక సంక్షేమనిధి చట్టం(1976), సినిమా కార్మిక సంక్షేమ చట్టం(1976), సున్నపురాయి, డోలమైట్‌ ‌కార్మికుల సంక్షేమనిధి చట్టం(1972), మైకా గని కార్మికు సంక్షేమనిధి చట్టం(1946), ఇనుము, మాంగనీసు, క్రోమియం గని కార్మికుల చట్టం(1976), బాలల శ్రమనిరోధక చట్టం(1973), వారాంతపు సెలవుల చట్టం(1942), భారత బాయిలర్ల చట్టం(1923) సవరణల బారిన పడ్డాయి. ఇప్పటికే తొంభయికి పైగా కార్మిక చట్టాల దస్త్రాలు ప్రభుత్వం వద్ద సవరణ కోసం సిద్ధంగున్నాయి. ఇందులో భాగంగా1948 నాటి ఫ్యాక్టరీచట్టంలోని సెక్షన్‌ 51‌ని సవరించేందుకు సర్కార్‌ ‌ప్రయత్నం చేస్తే కార్మికవర్గ ఆగ్రహానికి మరింతగా గురయ్యే అవకాశం లేకపోలేదు. కార్మికవర్గ ప్రయోజనాలకు విఘాతం కలిగించే పెట్టుబడిదారి సమాజంపై కార్మికుల నిరంతర పోరాటాలే ఎనిమిది గంటల పనిదినం సాధనకు దోహదపడ్డాయనేది నిజం. సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న ఎనిమిదిగంటల పనిదినం ‘‘పన్నెండుగంటల పనిదినంచట్టం’’గా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రూపుదిద్దుకోవటం శోచనీయం.

1990 తర్వాత భారత సర్కార్‌ ‌ప్రపంచీకరణ నేపథ్యంలో కార్మికుల హక్కుల రక్షణ, సంక్షేమం బాధ్యతల నుండి తప్పుకుంటూ, వారి హక్కుల హననానికి, చట్ట సవరణలకు సైతం పాల్పడుతూంది. కంప్యూటరీకరణ పేరుతో ఎనిమిది గంటల పనిదినం నిర్వీర్యమైంది. మోటర్‌ ‌కార్మికులు, కాల్‌ ‌సెంటర్లు, భవన నిర్మాణ కార్మికులు, పలు రంగాలలోని కాంటాక్ట్ ‌కార్మికులు, హమాలీ కార్మికులకు ఎనిమిది గంటల పనిదినం నామమాత్రమే అవుతూన్నది. 1991 తరువాత నూతన పారిశ్రామిక విధానాలను నిరసిస్తూ భారత కార్మిక వర్గం 16కు పైగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలను నిర్వహించింది. శ్రమ దోపిడికి పెట్టుబడిదారులకు స్వేచ్ఛనిచ్చే ‘‘సెజ్‌’’‌ల చట్టానికి వ్యతిరేకంగా కార్మికవర్గం బలమైన పోరాటాలు నిర్వహించింది. జాతీయస్థాయిలో బొగ్గు పరిశ్రమలో ప్రయివేటీకరణపై 2015లో కార్మికులు సమ్మెకు దిగి నిరసన తెలిపారు.బహుళజాతి కంపెనీల కోసం తమ మార్కెట్లను తెరచివుంచే ప్రయత్నాల పారిశ్రామికవిధానాలను రూపొందించుకుంటున్న దేశాలతో భారత్‌ ‌పోటీ పడుతూన్నది. మనదేశంలోని 90శాతం అసంఘటిత వలస కూలీలకు పిఎఫ్‌ ‌సౌకర్యం, ఇఎస్‌ఐ, ‌వైద్య సౌకర్యం, ఉపాధి హామీ, ప్రమాద మరణాలకు ఎక్స్ ‌గ్రేషియా చెల్లింపు, పనిగంటలు, ఓవర్‌ ‌టైం చెల్లింపునకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలియని దుస్థితి నెల కొన్నది. బడా పెట్టుబడిదారుల కార్పొరేట్‌ ‌రంగానికి ‘జీ’ హుజూరంటూ లక్షల కోట్ల రుణమాఫీలు చేయటం తార్కాణంగా కనిపిస్తున్నది. బహుళ జాతి కంపెనీలకు పలు రాయితీలివ్వటం తదితర చర్యలకు కేంద్రం తప్పటడుగులు వేసింది. యాజమాన్యాలకు లాభాలు తెచ్చే కార్మిక చట్టాలు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు అదే దారిన నడుస్తున్నాయి. పెట్టుబడిదారిశక్తుల శ్రమదోపిడికి పరాకాష్ట అయిన కోట్లాది వలస కార్మికులకు లభించాల్సిన కార్మిక ప్రయోజనాలు, అందాల్సిన సంక్షేమం యాజమాన్యాల ఖాతాల్లో లాభాలను పెంచేందుకు తేచ్చేటి తప్పుడు ఆర్డినెన్సుల సంగతిని కార్మిక పోరాటాలే తేల్చాల్సివుంది.

లాక్‌ ‌డౌన్‌ ‌వెల్లడించిన వలస కార్మికుల విషాదజీవనం, నిర్లక్ష్యం చేయబడిన వారి సంక్షేమంపై ఇంతవరకు సర్కార్‌ ‌పెదవి విప్పలేదు. లాక్‌ ‌డౌన్‌ ‌కాలంలో ఉత్పత్తి మూతబడి లాభార్జనకు కలిగిన అకస్మాత్‌ ‌విరామం పెట్టుబడిదారి శక్తులను కుదేలు చేసింది. ఈ నేపథ్యంలో రెట్టింపు లేదా అదనపు పనిదినాలను తక్షణావసరంగా పెట్టుబడిదారులు డిమాండ్‌ ‌చేసే అవకాశాలను తోసిపుచ్చలేము. కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభంలో విపత్తు నివారణల చట్టానికి ‘‘చిత్ర’’భాష్యాలు చెప్పటం ద్వారా, ప్రభుత్వాలు ఈ ఆర్థిక విపత్తును పరిష్కరించే లాజిక్కులను ముందుకు తెచ్చి, వాటి ఫలితాలను దేశప్రజల భుజస్కంధాలపై మోపే ప్రయత్నంచేయనున్నాయి. ఇందుకు సర్కార్‌ ‌దేశభక్తి అంశాన్ని ‘‘ఇరుసు’’గా వాడుకునే అవకాశం లేకపోలేదు. కరోనా సంక్షోభం పేరిట కునారిల్లిన ఆర్థిక సంక్షోభం బూచి చూపి దేశవ్యాప్తంగా రేపు చేయబోయే సమ్మూల మార్పుల నీడన బ్యాంకులు, రైల్వే, ఇన్సురెన్స్, ‌పోస్టల్‌, ‌నావీ రంగాల్లో ఉదోగుల పనిగంటలపై ప్రభావం చూపకపోదు. పారిశ్రామిక, కార్మిక చట్టాలన్నీ సవరిస్తూన్న సర్కార్‌ ‌విధానాలు కార్మిక సంక్షేమాన్ని విస్మరిస్తున్న నేపథ్యంలో భారత కార్మిక వర్గం అసహనానికి గురవుతున్నది. పెరిగే అసహనం ఉధృత రూపంలో మరో సార్వత్రిక సమ్మెనగారా మోగే అవకాశం లేకపోలేదు.

– అజయ్‌, ‌వరంగల్‌

Leave a Reply