Take a fresh look at your lifestyle.

మళ్ళీ అధోగతే బతుకు

కొండలను పిండి జేసే
గుండె బలం గల చేతులు
ఆకలి జయించలేక
ఓటమి దరిజేరుచుండె

మండుటెండలో మాడుచు
మట్టిని ముద్దాడే మనిషి
గిట్టుబాటు గాని కృషి లో
నలుగుతు నశించుతుండె

భవిత పట్ల బెంగ పడుచు
యువతలొ రగిలిన వేదన
ఏలేవాడి మోసం తో
ఎదలో రేగెను అలజడి

కూడు గుడ్డ నీడ కొరకు
కూలి నాలి జేసే జనం
సృష్టించిన సంపదతో
సుఖాలనుభవించెదెవడు

అంబానీలు అదానీలు
అవని కబ్జ జేయుచుండె
దళారీల దండయాత్ర
దండోరై మ్రోగుచుండె

ప్రజాస్వామ్య మన్న పేరు
పరిహాసమవుచుండెను
నోటుతో పుట్టిన ఓటుతో
నోటికి తాళం  పడియెను

ప్రశ్నకు సంకెళ్ళు వేసి
ప్రజాస్వామ్యమంటున్నరు
జనం సొమ్ము మింగినోళ్ళు
దేశభక్తులవుతున్నరుజి

బుసలు గొట్టె విష నాగులు
భువిలొ చిచ్చు రేపుచుండె
మతమౌడ్యం మనుషుల్ల
విషబీజం నాటుచుండె

భరతభూమి నలుమూలల
బ్రాంది వరదపారుచుండె
మత్తులొ చిత్తవుతు జనం
మగువకురులు పేనుచుండె

అంగట్లో భరతావని
అమ్ముడుబోతున్నతీరు
కళ్ళుతెరిచి చూడకుంటే
మళ్ళీ అధోగతే బతుకు

– గన్‌ ‌రెడ్డి ఆదిరెడ్డి, 9494789731

Leave a Reply