- ఎమ్మెల్యే రఘునందన్ రాకతో ఉద్రిక్తత
- వారికి తగిన న్యాయం చేయాలని డిమాండ్
మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ బిజెపి చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నిర్వాసితులను ఆదుకోకుండా ప్రభుత్వం బలవంతగా వారి భూములు గుంజుకుందని, వారికి నీడ లేకుండ ఆచేశారని ఆరోపించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లాలోని ఏటిగడ్డ కిష్టాపూర్‌కు వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద అరెస్ట్ చేశారు. అలాగే సిద్దిపేట నుంచి కిష్టాపూర్ వెళ్లే రహదారిని మూసేసారు. దీంతో గ్రామానికి ఎవరు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూనిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే అరెస్టు చేయడం దారుణమని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఫాంహౌజ్‌లో కూర్చుండి కాంట్రాక్టర్ల కోసం నిర్వాసితులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. గజ్వేల్, సిద్దిపేట తరహా మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలెక్టర్‌కు గాని, ఎంపీ, ఎమ్మెల్యేకుగాని చిత్తశుద్ధి ఉంటే మల్లన్నసాగర్ కట్ట వి•దికి రండి..నేను ఒక్కడినే వస్తాను… దొంగల్లాగ దారులు కాచి అరెస్టు చేయడం ఎందుకు అంటూ సవాల్ విసిరారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ప్రతీరోజు జిల్లాలో నిషేధ సెక్షన్ అమల్లో ఉండడం గమనార్హమన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కు ఒక న్యాయం.. దుబ్బాకకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. అందుకే దుబ్బాకలో తమను ఓడగొట్టారన్నారు. తొగుటలో చీకటి ప్రజాస్వామ్యం నడుస్తోంది.. ఎందుకని నిలదీశారు. దుబ్బాకలో పోలీసులతో గొంతు నొక్కుతు న్నారేమో- రానున్న అసెంబ్లీలో మాత్రం నొక్కలేరు.. అక్కడ మాట్లాడుతాను అంటూ ఎమ్మెల్యే రఘునందన్‌రావు హెచ్చరించారు. అయితే ఆందోళనకు దిగడంతో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు పరిహారం ఇవ్వకుండా అధికారులను ప్రాజెక్ట్ దగ్గరకు రానిచ్చేదిలేదంటూ గ్రామస్తులు గత కొన్ని రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. వారికి మద్ధతుగా మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది.
దాంతో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ దగ్గరికి బయలుదేరాడు. దాంతో పోలీసులు ఆయనను తొగుటలో అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఏటిగడ్డ కిష్టాపూర్ నిర్వాసితులకు సిద్దిపేట,గజ్వేల్ తరహాలో పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. కలెక్టర్, అధికారులు ప్రజాస్వామిక వాదులుగా పని చేయడం లేదని ఆరోపించారు.దీంతో సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. కిష్టాపూర్‌కు వెళ్లడానికి ప్రయత్నించిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
గత రాత్రి కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. మల్లన్న సాగర్ కట్ట కోసం సిద్దిపేట నుంచి ఏటిగడ్డ కిష్టాపూర్‌కు వెళ్లే రోడ్డును కాంట్రాక్టర్ మూసివేస్తున్నాడు. దాంతో ఈ రోడ్డును మూసివేస్తే ఊరికి వెళ్లడం కష్టమౌతోందని.. రోడ్డు మూసివేయోద్దని గ్రామస్తులు కాంట్రాక్టరును అడ్డుకున్నారు. అంతేకాకుండా ఏటిగడ్డ కిష్టాపూర్ వాసులకు పరిహారం చెల్లించకుండానే మల్లన్న సాగర్ కట్ట నిర్మిస్తున్నారని వాపోయారు. పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో గ్రామాన్ని విడిచి వెళ్లేందుకు నిర్వాసితులు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. అయితే గ్రామాన్ని ఎలాగైనా ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్ కట్ట నిర్మిస్తుండడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.