- 28న తెలంగాణ రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయండి మావోయిస్టు రాష్ట్ర కమిటీ పిలుపు
ఈనెల 3, 7, 19, 23 తేదీలలో జరిగిన ఘటనలన్నీ కేసీఆర్ ప్రభుత్వం, పోలీసులు చేసిన బూటకపు ఎన్‌కౌంటర్లనీ ప్రభుత్వ హత్యలేనని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈనెల 28న తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈమేరకు శుక్రవారం మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. చెన్నాపురం, కడంబ పూనుగుప్ప, దేవార్లగూడెంలో జరిగినవన్నీ బూటకపు ఎన్కౌంటర్లేననీ, ఈ ఎన్కౌంటర్లలో కామ్రేడ్ శంకర్, కామ్రేడ్ శ్రీను, కామ్రేడ్ ఐతు గ్రామస్తుడు కామ్రేడ్ చుక్కాలు దళ సభ్యుడు, కామ్రేడ్ బాజీరావు దళ సభ్యుడు, కామ్రేడ్ జోగయ్య, కామ్రేడ్ రాజే, కామ్రేడ్ లలిత అమరులయ్యారని పేర్కొన్నారు.
వీళ్లంతా ఆదివాసీ, పీడిత ప్రజల ముద్దు బిడ్డలనీ, వీళ్లందరినీ పట్టుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులు వాళ్ల చట్ట ప్రకారం జైల్లో పెట్టకుండా బూటకపు ఎన్కెఔంటర్లలో హత్య చేశారని విమర్శించారు. మావోయిస్టు పార్టీ ఎజెండానే తమ ఎజెండా అంటూ ఎన్కౌంటర్లు లేని తెలంగాణనే మా ధ్యేయమంటూ నమ్మబలికిన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అధికారంలోకి రాగానే సామ్రాజ్యవాదం, దళారీ నిరంకుశ బూర్జువా, బడా భూస్వామ్య వర్గాలకు సేవ చేస్తూ నీళ్లు నిధులు, ఉద్యోగాలను పక్కనబెట్టి జల్, జంగల్, జమీన్ సహజ వనరులను దోచుకుంటూ తెలంగాణలో 90 శాతంగా ఉన్న పీడిత, దళిత, ఆదివాసీ ప్రజలకు తీవ్ర అన్యాయాన్ని కలిగిస్తున్నారని ఆరోపించారు. ఈ మధ్య కాలంలో మావోయిస్టు పార్టీ నుంచి పోలీసులపై గానీ, అధికార పార్టీ నాయకులపై గానీ ఎలాంటి భౌతిక దాడులకు పాల్పడనప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నదని ఆరోపించారు. ఈ ఎన్కౌంటర్లను ఖండిస్తూ ఈనెల 28న తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు బంద్‌ను పాటించాలని ఈ సందర్భంగా జగన్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.