Take a fresh look at your lifestyle.

అం‌దరికీ భాగస్వామ్యం కలిగించి… హరితహారాన్ని విజయవంతం చేయండి

నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు మంత్రి ఇంద్రకరణ్‌ ‌లేఖ

ఈనెల 25న ప్రారంభం కానున్న ఆరో విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈమేరకు మంగళవారం సహచర మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లేఖ రాశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ తెలంగాణ అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ దేశానికి ఆదర్శంగా నిలచిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అనేక పథకాలు, కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్రాలు అమలు చేయడం గర్వకారణమని తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు సీఎం కేసీఆర్‌ ‌రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే హరిత యజ్ఞానికి శ్రీకారం చుట్టారనీ, తెలంగాణకు హరితహారం పేరిట ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మానవ ప్రయత్నానికి ఐదేళ్ల కిందటే బీజం వేశారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 24 శాతంగా ఉన్న అటవీ ప్రాంతాన్ని 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో హరితహారం కార్యక్రమానికి రూపకల్పన చేశారనీ, ఈ కార్యక్రమం ద్వారా 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇప్పటి వరకు 182 కోట్ల మొక్కలను నాటడం జరిగిందన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఈనెల 25న సీఎం కేసీఆర్‌ ‌మెదక్‌ ‌జిల్లా నర్సాపూర్‌ అటవీ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ప్రారంభిస్తారని తెలిపారు. ఆరో విడత హరితహారంలో 30 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామనీ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Leave a Reply