కొరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. కేంద్రం తరఫున చేపడుతున్న చర్యలపై దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తున్నది. ఈమేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతి సూదన్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ప్రస్తుతం ఆయా రాష్ట్రాలు కొరోనా నియంత్రణకు ఏయే జాగ్రత్తలు తీసుకుంటున్నారని వివరణ అడుగుతూనే మరికొన్ని జాగ్రత్తలను సూచించారు. ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వి్త••త చర్యలు చేపట్టాలనీ, ఇందులో ముఖ్యంగా యువకులను భాగస్వాములను చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలనీ, ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలను రెగ్యులేట్ చేయాలనీ, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నియంత్రించాలని సూచించింది.
ప్రజలు ఒకే ప్రదేశంలో ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. ప్రైవేట్ సంస్థలు వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యం ఇవ్వాలనీ, ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆదివారం ప్రజలంతా ఇళ్లలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. థియేటర్లు, షాపింగ్ మాల్స్, మ్యూజియంలను మూసి ఉంచాలనీ, క్రీడా కార్యక్రమాలు, మతపరమైన ప్రార్థనలను సాధ్యమైనంత వరకూ ఇళ్ల నుంచే నిర్వహించుకునేలా చూడాలనీ, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలలో ప్రజలు తప్పనిసరిగా దూరం పాటించే విధంగా చూడాలనీ, అందులో పేర్కొన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కొరోనా వైరస్‌కు ప్రస్తుతానికి ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని తెలిపింది. పదేళ్లలోపు వయసున్న పిల్లలంతా తప్పనిసరిగా ఇళ్లలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలనీ, పార్కులు, పిక్నిక్లు వంటి వాటికి దూరంగా ఉండాలని అందులో పేర్కొన్నారు. అలాగే, కొరోనా వైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా బహిరంగ మార్కెట్లో ఫేస్ మాస్కులు, శానిటైజర్ల ధరలను నియంత్రించడంతో పాటు సాధారణ ప్రజానీకానికి సైతం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.