‘‘భారతదేశ సైనిక అవసరాలను తీర్చే సామగ్రిలో సగానికి పైగా రష్యా నుంచి వొస్తాయి. మన ప్రధాన యుద్ధ ట్యాంకుల్లో 96 శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నవి. మన ఏకైక విమాన-వాహక నౌక…అణుశక్తితో నడిచే జలాంతర్గామిని రష్యా అందించింది. మన యుద్ధ విమానాలలో 71 శాతం, ఎయిర్ ట్యాంకర్లలో మొత్తం ఆరు రష్యా నుంచి దిగుమతి అయ్యాయి. ఈ సమాచారం కల్పితం కాదు. భారతీయ సైనిక సామాగ్రికి సంబంధించిన ఈ వివరాలు.. సంఖ్యలు అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నుండి వెలుగులోకి వొచ్చాయి. ఈ మహత్తర పనితీరు గల యంత్రాలతో భారత సైన్యం పనిచేయాలి అంటే యుద్ధ శిక్షణ రష్యా నుంచే మనకి అందాలి. అంతేనా..ఈ సామాగ్రికి సంబంధించిన నాణ్యమైన విడి భాగాలు, సర్వీసింగ్‌లు అవసర పడతాయి. ఇదంతా రష్యానే అందించాలి..’’
’’అలీన విదేశాంగ విధానం’’ భారత్ వైఖరి
నెహ్రూ బాటలో నరేంద్ర మోడి
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, మార్చి 2: అంతర్జాతీయ సమాజం నేడు ఏక ధృవంగా లేదు. దీనితో ప్రతి దేశం తన స్వంత ‘‘వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి’’ కోసం ప్రయత్నిస్తున్నాయి..తిప్పలు పడుతున్నాయి. బహుళ ధ్రువ ప్రపంచంలో ఐక్యరాజ్యసమితిచే నియంత్రించబడే ప్రపంచ నియమాల-ఆధారిత వైఖరులను దేశాలు అమలు చేయటం కష్టం అయిపోతున్నది. ఎందుకంటే ఈ అంతర్జాతీయ సంస్థలకి ఏ దేశం నుంచి ఎక్కువ విరాళాలు అందితే ఆ దేశాల రాగం ఈ సంస్థలు ఆలాపిస్తున్నాయి. వ్లాదిమిర్ పుతిన్ డొనెస్టక్, లుహాన్సక్లు స్వయం పాలితాలు (నిఘాఢంగా రష్యాకు చెందినవని) అని ప్రకటించి ఉక్రెయిన్ మీద దాడికి తెర లేపిన వెంటనే మోడీ హయాంలోని భారత్ ఫారిన్ పాలసీ స్వర్గీయ నెహ్రు ముందు మోకరిల్లింది. అయన ఉద్ఘాటించి..ఆచరించిన ‘‘అలీన విదేశాంగ విధానాన్ని’’ నిరంతరం నెహ్రూని తిట్టిపోసే మోడీ ప్రభుత్వం ఆలింగనం చేసుకుంది. చరిత్ర గమనాన్ని తిప్పికొట్టడానికి కొత్త చరిత్ర లిఖించటానికి నేనున్నాను అని ప్రకటించే ప్రధాని మోడీ భారత తొలి ప్రధాని నెహ్రు విదేశాంగ విధానంను హత్తుకున్నారు. ‘‘హింసను అంతం చేయాలని పిలుపునివ్వడం’’..‘ ‘అంతర్జాతీయ చట్ట సూత్రాలకు కట్టుబడి ఉండాలని’’ సభ్య దేశాలను కోరడం చుస్తే నెహ్రు ఆత్మ మోడీలో చేరిపోయిందా అనిపించకమానదు. అంతేనా కీలకమైన వోటింగ్‌కు భారత్ దూరంగా ఉండే చర్యలు ప్రధాని మోడీ చేపట్టారు. మోడీ ఇలా ప్రవర్తించటానికి బలమైన కారణాలు ఉన్నాయా…?
ఖచ్చితంగా వున్నాయి. వాషింగ్టన్ డిసిలో క్వాడ్ నాయకుల సమావేశానికి ఒక వారం ముందు, 2021 సెప్టెంబర్ 15న ఇండో-పసిఫిక్ కోసం అని చెబుతూ(నిజానికి చైనాకి చెక్ పెట్టడానికి) ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్లు కలిసి ఆకుస్(ఏయుకెయుఎస్) అనే కొత్త త్రైపాక్షిక భద్రతా భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ చర్య వెనుక అమెరికా బైడన్ ప్రభుత్వం వుంది. తన గ్లోబల్ కాంపిటీటర్ చైనాను అమెరికా ఇలా చెక్ పెట్టింది. ఆకుస్లో భరత్ భాగంగా రావాలి అని అమెరికా భారత్‌పై ఒత్తిడి చేస్తున్నది. ఇది గమనించిన భారత్ పొరుగు దేశం చైనా, పాకిస్తాన్‌తో దోస్తీ పెంచింది. అలాగే పాకిస్తాన్ కూడా చైనాతో పాటుగా చైనాకి మంచి దోస్తుగా వున్నా రష్యాతో సత్సంబంధాలు పెట్టుకుంటున్నది. ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుండగా మాస్కోకు పోయి పుతిన్‌తో ఇమ్రాన్ ఖాన్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ఉక్రెయిన్ కోరినట్టు, అమెరికా ఆశించినట్టు, రష్యాకి వ్యతిరేకంగా పోవటానికి సిద్దపడలేకపోయింది. యెంతగా నెహ్రూని అసహ్యించుకున్నా అయన అడుగుజాడల్లో నడవటం మోడీకి సేఫ్ అనిపించింది. మరో విధంగా చెప్పాలి అంటే మోడీకి తప్పలేదు. పొరుగు దేశాల నుంచి వొస్తున్న ఒత్తిడి ఒక్కటే మోడీని నెహ్రూని అనుసరించేలా చేయలేదు. మరో బలమైన కారణం కూడా వుంది.
అదేమిటంటే, భారతదేశ సైనిక అవసరాలను తీర్చే సామగ్రిలో సగానికి పైగా రష్యా నుంచి వొస్తాయి. మన ప్రధాన యుద్ధ ట్యాంకుల్లో 96 శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నవి. మన ఏకైక విమాన-వాహక నౌక…అణుశక్తితో నడిచే జలాంతర్గామిని రష్యా అందించింది. మన యుద్ధ విమానాలలో 71 శాతం, ఎయిర్ ట్యాంకర్లలో మొత్తం ఆరు రష్యా నుంచి దిగుమతి అయ్యాయి. ఈ సమాచారం కల్పితం కాదు. భారతీయ సైనిక సామాగ్రికి సంబంధించిన ఈ వివరాలు.. సంఖ్యలు అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ నుండి వెలుగులోకి వొచ్చాయి. ఈ మహత్తర పనితీరు గల యంత్రాలతో భారత సైన్యం పనిచేయాలి అంటే యుద్ధ శిక్షణ రష్యానుంచే మనకి అందాలి. అంతేనా…ఈ సామాగ్రికి సంబంధించిన నాణ్యమైన విడి భాగాలు, సర్వీసింగ్‌లు అవసర పడతాయి. ఇదంతా రష్యానే అందించాలి. ఈ కారణాల వలన భారతదేశం తప్పనిసరిగా రష్యన్ సరఫరాదారులతో అనుసంధానించబడి ఉండాలి. ఈ కారణాలే కాకుండా లడఖ్ సమస్యపై మనకి..చైనాకి మధ్యనున్న రగడకు శాంతింపజేసే దేశంగా రష్యాను కీలక దేశంగా నిపుణులు పరిగణిస్తున్నారు. ఇన్ని కారణాలు ఉండటం వలన ప్రధాని మోడీ, నెహ్రు చెప్పులను తొడుక్కుని మిస్టర్ పుతిన్‌ను అసంతృప్తికి గురి చేయటం లేదు.
నిరంతరాయంగా విమర్శించే నెహ్రు విదేశాంగ విధానాన్ని అనుసరించాల్సిన ఖర్మ పెట్టిందే అనే పట్టింపు ప్రస్తుతం మోడీకి వుండే అవకాశం లేదు. ఇవన్నీ కాకుండా పుండు మీద పుట్రలాగా రష్యా శాశ్వత యుఎన్ఎస్సి సభ్యత్వం కలిగి వీటో అధికారం కూడా కలిగి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో రష్యా, ఉక్రేన్ మీద చేస్తున్న ఆక్రమణకు వ్యతిరేకంగా భారత్ చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ తటస్థ వైఖరి ప్రదర్శించింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, భారత్‌తో పాటుగా చైనా కూడా పైకి తటస్థ వైఖరినే ప్రదర్శిస్తున్నది.