Take a fresh look at your lifestyle.

బిహార్‌లో మజ్లిస్‌ ‌పార్టీకి భారీ షాక్‌

  • ఎంఐఎం‌కు చెందిన నలుగురు జంప్‌
  • ఆర్జెడిలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు

పాట్నా,జూన్‌29 : ‌బిహార్‌లో మజ్లిస్‌ ‌పార్టీకి భారీ షాక్‌ ‌తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.2020లో జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకొని సంచలనం సృష్టించిన మజ్లిస్‌ ‌పార్టీకి భారీ షాక్‌ ‌తగిలింది. ఆ పార్టీ తరఫున ఎన్నికైన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీ తీర్థం పుచ్చుకున్నారు. మజ్లిస్‌ ‌బిహార్‌ ‌విభాగం అధ్యక్షుడు అఖ్తారుల్‌ ఇమాన్‌ ‌తప్ప మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీ పార్టీలో చేరారు. ఆర్జేడీ నేత, బిహార్‌ అసెంబ్లీలో విపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్‌ను కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. షానవాజ్‌, ఇజార్‌ అస్ఫీ, అంజార్‌ ‌నై, సయ్యద్‌ ‌రుక్నుద్దీన్‌ ఆర్జేడీ కండువా కప్పుకున్న వారిలో ఉన్నారు.

వీరందరినీ తన కారులో ఎక్కించుకొని స్వయంగా అసెంబ్లీకి తీసుకెళ్లారు తేజస్వీ యాదవ్‌. ‌తేజస్వీ యాదవ్‌తో ఎమ్మెల్యేలుపార్టీ మార్పుపై గతంలోనే పలు ఊహాగానాలు వచ్చాయి. కులాల ప్రకారం జనగణన చేపట్టాలని డిమాండ్‌ ‌చేస్తూ తేజస్వీ యాదవ్‌ ‌నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మజ్లిస్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు అఖ్తారుల్‌ ఇమాన్‌ ‌సైతం హాజరయ్యారు. ఆర్జేడీతో కలిసి ఓ వేదికను పంచుకోవడం మజ్లిస్‌ ఎమ్మెల్యేలకు అదే తొలిసారి. కాగా, 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ప్రదర్శన చేస్తూ ఐదు సీట్లను మజ్లిస్‌ ‌గెలుపొందింది. ముస్లిం మెజారిటీ ఉన్న స్థానాలపై దృష్టిసారిస్తూ 32 మంది అభ్యర్థులను బరిలోకి దించింది.

2019లో ఓ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోవడం మినహా బిహార్‌లో పెద్దగా ప్రభావం చూపని ఎంఐఎం.. ఆ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలే రాబట్టింది. అమౌర్‌, ‌కొచాధామ్‌, ‌జోకిహాట్‌, ‌బహదుర్‌గంజ్‌ అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అయితే, గెలిచిన ఐదు సీట్లలో నాలుగింటిని ఇప్పుడు కోల్పోయింది. తాజా చేరికలతో ఆర్జేడీ ఎమ్మెల్యేల సంఖ్య 80కి పెరిగింది. తద్వారా అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల్లో ఆర్జేడీ 75 స్థానాలు గెలు చుకుంది. ఉపఎన్నికల్లో మరో స్థానం తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు చేరిన ఆర్జేడీ ఎమ్మెల్యేలతో ఈ సంఖ్య 80కి చేరుకుంది.

Leave a Reply