- ఎమ్యెల్యేల వైఖరిని ఖండిద్దాం
- మహిపాల్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే
- పటాన్ చెరువులో టీయూడబ్ల్యూజే ఆందోళన
వీధి గుండాల్లా జర్నలిస్టుల పట్ల వారు అనుసరిస్తున్న ప్రవర్తనతో సభ్యసమాజం సిగ్గు పడుతుందన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నామనే విషయాన్ని మరచి వాస్తవాలు వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టుల పట్ల అసహనాన్ని ప్రదర్శించడం విచారకరమన్నారు. నారాయణ్ ఖేడ్ ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి, దుబ్బాక ఎమ్యెల్యే రఘునందన్ రావు, మల్కాజిగిరి ఎమ్యెల్యే మైనంపల్లి హన్మంతరావు, తాజాగా పటాన్ చెరువు ఎమ్యెల్యే మహిపాల్ రెడ్డిలు జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలు, హెచ్చరికలు రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా ఉన్నాయని విరాహత్ అలీ ధ్వజమెత్తారు. రాజ్యాంగేతర శక్తులు ఏ స్థాయిలో వున్నా వారికి తగినరీతిలో గుణపాఠం చెప్పిన చరిత్ర తెలంగాణ జర్నలిస్టులకు ఉందనే సత్యాన్ని రాజకీయులు మరచిపోరాదని ఆయన సూచించారు. జర్నలిస్టులు అవస్తవాలు రాస్తే వాటిని ఖండించుకునే హక్కు ఉంటుంది తప్పా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దౌర్జన్యంగా ప్రవర్తించే హక్కు ఎవరికి లేదన్నారు. 2001లో పటాన్ చెరువు ఎంపిపి అధ్యక్షుడిగా కొనసాగిన మహిపాల్ రెడ్డి తన సోదరుడు మధుసూదన్ రెడ్డి ద్వారా అప్పటి వార్త విలేకరి శంకర్ రావుపై దాడి చేయించగా నాటి ఏపీయూడబ్ల్యూజే అతనికి తగిన బుద్ధి చెప్పిందని విరాహత్ గుర్తుచేశారు. తన వ్యాఖ్యలతో జర్నలిస్టు లోకాన్ని అవమానపర్చిన మహిపాల్ రెడ్డి బేషరత్తుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
