- జూన్ 30 తరువాత చేపట్టాల్సిన చర్యలపై సూచనలివ్వండి
- సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
- నేడు 15 రాష్ట్రాల సీఎం)తో సమావేశం
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్ కొరోనా మహమ్మారిపై మెరుగ్గా పోరాడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కొరోనా వైరస్‌పై పోరాటానికి సహకరిస్తున్నాయనీ, దీంతో భారత్‌లో వైరస్ ప్రభావాన్ని తగ్గించగలిగామని పేర్కొన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో దేశంలో ప్రస్తుతం కొరోనా వైరస్ పరిస్థితి, లాక్డౌన్ నిబంధనల అమలుపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 30తో లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో ఆ తరువాత చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని సీఎంలతో చర్చించారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న సీఎంల వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా మంగళవారం పంజాబ్, కేరళ, గోవా, ఉత్తరాఖండ్, జార్ఘండ్ సహా పలు ఈశాన్య రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. దేశంలో కోవిడ్ 10 బారిన పడి కోలుకునే వారి సంఖ్య 50 శాతం దాటిందని వెల్లడించారు. కొరోనా వైరస్‌పై పోరు మన దేశ సహకార సమాఖ్య, విధాన స్ఫూర్తిని చాటిందని చెప్పారు.
లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో గత కొద్దివారాలుగా పలు దేశాల నుంచి పెద్ద సంఖ్యలో భారతీయులు, వలస కార్మికులు తిరిగి స్వదేశానికి చేరుకున్నారని చెప్పారు. సుదీర్ఘ లాక్డౌన్ అనంతరం కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయని చెప్పారు. మార్కెటింగ్ విధానంలో కేంద్రం చేపట్టిన చర్యల ఫలితంగా రైతుల ఆదాయం మెరుగుపడటమే కాకుండా వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా తోడ్పాటు లభించిందని తెలిపారు. ప్రతీ వ్యక్తి మాస్కులు దరించడంతో పాటు భౌతిక దూరం పాటించడం ద్వారా దేశంలో కొరోనాను చాలా వరకు కట్టడి చేయవచ్చని ఈ సందర్భంగా ప్రధాని అభిప్రాయపడ్డారు. కాగా, ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయా రాష్ట్రాల సీఎంలు తమ రాష్ట్రాలలో కొరోనా కట్టడికి అమలు చేస్తున్న చర్యలను వివరించారు. తమ రాష్ట్రాలలో వైరస్ ప్రభావం అంతగా లేదనీ, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు వివరించారు.
నేడు 15 రాష్ట్రాల సీఎంలతో సమావేశం
దేశంలో కొరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, ఆయా రాష్ట్రాలలో పరిస్థితిపై సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా ప్రధాని మోదీ బుధవారం 15 రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించనున్నారు. కొరోనా కేసులు అత్యధికంగా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్‌తో పాటు తెలంగాణ, ఏపీ, కర్నాటక రాష్ట్రాల సీఎంలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.