Take a fresh look at your lifestyle.

శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు

  • శైవాలయాలకు పోటెత్తిన భక్తులు
  • నదీతీరాల్లో పుణ్యస్నానాలు..ఆలయాల్లో అభిషేకాలు
  • వేములవాడలో పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి
  • ఏడుపాయల వనదుర్గా మాతకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీష్‌
  • ‌వేయిస్తంభాల గుడిలో అభిషేక సేవలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం తెల్లవారు జామునుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శివనామస్వరంతో ఆలయాలన్నీ మార్మోగాయి. వేములవాడ, కాళేశ్వరం, వేయిస్తంభాల గుడి, రామప్ప,శ్రీశైలం, వేములవాడ, కీసర ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఓం నమశ్సివాయా అనే మంత్రాక్షరితో కీసరగుట్ట దేదీప్యమానంగా వెలిగిపోతోంది. భక్తులు ఓం నమశ్సివాయా అంటూ శివుడిని దర్శించు కుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. భక్తులు ఉదయం నుంచే శివాలయాలకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రధాన ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మంత్రులు ఆయా ఆలయాల్లో పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మాజీ ఎంపి బోయినపల్లి వినోద్‌ ‌కుమార్‌ ‌తదితరులు స్వామిని దర్శించుకున్నారు. శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఓం నమఃశివాయ నామ స్వరణతో భక్తులు శివయ్యను దర్శించుకున్నారు.రాజరాజేశ్వర స్వామివారి దర్శనం కోసం అర్థరాత్రి నుంచి భక్తులు బారులు తీరారు.

ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసి భక్తులకు మహాలఘుదర్శనం కల్పిస్తున్నారు. రాజరాజేశ్వర స్వామి వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఏడుపాయల వనదుర్గామాతకు మంత్రి హరీష్‌ ‌రావు పట్టువస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ ‌రెడ్డి కూడా వెంట ఉన్నారు. హన్మకొండ వేయిస్తంభాల గుడిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో శివరాత్రి శోభ సంతరించుకుంది. శైవక్షుత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేయిస్తంభాల దేవాలయం, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, కురవి వీరభద్రస్వామి, పాలకుర్తి సోమేశ్వర ఆలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. నల్లగొండ జిల్లాలోని శైవక్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. చెర్వుగట్టు, పానగల్‌, ‌వాడపల్లి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. నిజామాబాద్‌ ‌జిల్లాలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని నీలకంఠేశ్వరాలయం, శంభునిగుడి, బోధన్‌ ఏకచక్రేశ్వరాలయం, ఆర్మూర్‌ ‌సిద్ధులగుట్ట ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో శైవక్షేత్రాలు మార్మోగు తున్నాయి.

తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో మహా శివరాత్రి సందర్భంగా చెన్నూరు, గూడెం, లక్షెట్టిపేట, మంచిర్యాల, వేలాల గోదావరి ఘాట్ల వద్ద వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ధర్మపురి, బాసరలో గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచారించి ఆలయాల్లో దర్వనం చేసుకున్నారు. వేలాల మల్లిఖార్జునస్వామి ఆలయం, కత్తెరశాల మల్లన్న, బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. నిర్మల్‌ ‌జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాల్లో శివరాత్రి శోభ సంతరించుకుంది. బాసర, సోన్‌, ‌బ్రహ్మపురి వద్ద గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. శైవ క్షేత్రాల్లో భక్తుల పూజలు కొనసాగుతున్నాయి. కదిలి పాపహరేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొమురం భీం జిల్లాలో మహా శివరాత్రి సందర్భంగా వాంకిడి శివకేశవ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఈజ్‌ ‌గాం శివమల్లన్న జాతరకు భక్తులు భారీగా తరలి వచ్చారు. సూర్యాపేట జిల్లాలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పిల్లలమర్రి, నాగులపాటి అన్నారంలోని ప్రాచీన శివాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

మేళ్లచెరువు శ్రీస్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. గద్వాల జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా అలంపూర్‌ ఆలయాలు భక్తులతో కిటకిట లాడాయి. కీసర గుట్టలో శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం తరపున మంత్రి మల్లారెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భదాద్రిలో మహాశివరాత్రిని పురస్కరించుకుని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. అన్నపురెడ్డిపల్లి, మోతె వీరభద్ర స్వామి, పాల్వంచ రామలింగేశ్వర ఆలయాల్లో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తులతో పోటెత్తాయి. తీర్దాల సంగమేశ్వరాలయం, కూసుమంచి గణపేశ్వరాలయం, పెనుబల్లి నీలాద్రీశ్వరాలయం, బేతుపల్లి గౌతమేశ్వరాలయాల్లో భక్తుల రద్దీ కొనసా గుతోంది. సంగారెడ్డి జిల్లాలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు శైవక్షేత్రాలకు తరలివెళ్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే ఆ మహాదేవున్ని తనివితీరా దర్శించుకున్నారు. జిల్లాలో ప్రముఖ ఆలయమైన కేతకీ సంగమేశ్వరా లయంలో భక్తుల రద్దీ పెరిగింది.

Leave a Reply