సిద్ధిపేట, మార్చి 10 (ప్రజాతంత్ర బ్యూరో): మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం సిద్ధిపేట రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో ‘శివోహం’ క్యాన్వాస్ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారుడు రుస్తుం ఆవిష్కరించారు. పండుగలు సంస్కృతిని కళావంతం చేస్తాయని మహాశివరాత్రి అభద్రతా భావాలను అధిగమిస్తూ, ఆధ్యాత్మిక భక్తి భావనలో పునీతులై భక్తులు ప్రతి జీవిలో ఈశ్వరతత్వాన్ని దర్శించుకుని సోదర భావంతో ఐకమత్యంతో మెదలుతారన్నారు.
తద్వారా సమాజం వాసుధైక కుటుంబంగా ప్రపంచ నలుమూలల సకలజనులు సుఖ సంతోషాలతో, శాంతిభద్రతలతో ఐక్యంగా ఉండాలని, ఆధ్యాత్మిక సజ్జనులు కోరుకుంటారని రుస్తుం ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, నైరుప్య చిత్రకారుడు నహీంరుస్తుం, నేచర్ ఆర్టిస్ట్ రూబీనారుస్తుం తదితరులు పాల్గొన్నారు.