Take a fresh look at your lifestyle.

‘‌చెయ్యి’ జారిన మధ్యప్రదేశ్‌

మరో రాష్ట్రం కాంగ్రెస్‌ ‌చెయ్యిజారిపోయింది. కాంగ్రెస్‌ ‌పార్టీలోఉన్న అంతర్గత కలహాలే ఈ చెయ్యిజార్చుకోవడానికి కారణంగామారింది. కాంగ్రెస్‌ అం‌టేనే గ్రూపు రాజకీయాలకు పెట్టిందిపేరు. అలాగే మధ్యప్రదేశ్‌లో కూడా మూడు గ్రూపులమధ్య వో తగాదా చివరకు అధికారాన్ని వదులుకోవడానికి కారణమైంది. గత కొంతకాలంగా మధ్యప్రదేశ్‌ ‌రాజకీయాల్లో విస్ఫోటనం మొదలైంది. ఆ పార్టీకి చెందిన కీలక యువ నేత జ్యోతిరాధిత్య సింథియా పార్టీ మారడంతో కాంగ్రెస్‌కు కష్టకాలం మొదలైంది. ఆయనతోపాటు మరో ఇరవై రెండుమంది కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలుకూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పడంతో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కమల్‌నాథ్‌ ‌పదవికి ఎసరొచ్చింది. శాసనసభలో కాంగ్రెస్‌కు బలంలేదని కొందరు సుప్రీమ్‌కోర్టుకు వెళ్ళడంతో సిఎం కమలనాథ్‌, ‌మాజీ సింఎం దిగ్విజయ్‌సింగ్‌తోపాటు కాంగ్రెస్‌ ‌పెద్దలంతా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి విఫలమైనారు. చివరకు శుక్రవారం సాయంత్రం అయిదుగంటలలోపు శాసనసభలో బలనిరూపణ చేసుకోవాలన్న సుప్రీమ్‌కోర్టు ఆదేశాలతో చేసేదేమీలేక, బల నిరూపణకు ముందే కమల్‌నాథ్‌ ‌తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల జాబితానుండి మరో రాష్ట్రం చెయ్యిజారిపోయింది. కిందామీదపడి మధ్యప్రదేశ్‌లో తమ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్‌ ‌నేతలంతా ఎంతో శ్రమించారు. అందులో యువనాయకుడైన జ్యోతిరాధిత్య సింధియా కీలకపాత్ర పోషించాడు. రాహుల్‌గాంధీ అభయంతో ఆయన ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజృంభించి అత్యధిక స్థానాలు కాంగ్రెస్‌కు దక్కేట్లుగా కృషిచేశాడు. కాని, ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించేవిషయంలో ఆయననుకాదని, పార్టీలో సీనియర్‌నేత కమల్‌నాథ్‌కే అధిష్టానం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇవ్వడంతో జ్యోతిరాధిత్య అసహనానికిగురై పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూవస్తున్నాడు. తనకు జరిగిన అన్యాయం విషయంలో ఒకటిరెండు సార్లు సోనియాగాంధీని కలిసేందుకు చేసిన ప్రయత్నాలుకూడా ఫలించకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయంతీసుకున్నాడు.

కాంగ్రెస్‌కు బద్ద శత్రువుగా భావించే భారతీయ జనతాపార్టీ తీర్థం తీసుకునేముందు ప్రధాని మోదీతోపాటు, ఆ పార్టీకి చెందిన బడానాయకులందరినీ కలిసి, తన రాజకీయ భవిష్యత్‌కు సంబంధించిన హామీ పొందాడు. అదే బాటపట్టేందుకు కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఇరవై రెండు మంది ఎంఎల్‌ఏలు సిద్దమైనారు. అందరూ ఉమ్మడిగా పార్టీకి రాజీనామాలు సమర్పించడంతో పదిహేను నెలల కమలనాథ్‌ ‌ప్రభుత్వం పడిపోయింది. చేతులుకాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు, జరుగాల్సినంత నష్టం జరిగిపోయినతర్వాత రంగంలోకి దిగి తమ ఎంఎల్‌ఏలను బుదగరించేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. వారితో బేరసారాలో, మంత్రాంగమో చేసేందుకు సమయంకూడా లేకుండా సుప్రీమ్‌కోర్టు శుక్రవారమే బలనిరూపణ చేయాల్సిందేనని ఆదేశించడం, మరోవైపు గవర్నర్‌ ‌లాల్జీ టాండన్‌ ‌వొత్తిడితో కమనాథ్‌కు రాజీనామా చేయక తప్పనిపరిస్థితి ఏర్పడింది. 22 మంది ఎంఎల్‌ఏల రాజినామాతో శాసనసభలో కాంగ్రెస్‌ ‌బలం 92కు పడిపోయింది. అప్పటికే• బిజెపి 107 మంది ఎమ్మేల్యేలున్నారు.

22మంది రాజీనామాతో ప్రస్తుతం శాసనసభలో బలనిరూపణకు కావాల్సిన మ్యాజిక్‌ఫిగర్‌ 104 ‌మాత్రమే. దీంతో బిజెపికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఏర్పడనుంది. దీనికితోడు నిన్నటివరకు కమల్‌నాథ్‌ ‌ప్రభుత్వానికి మద్దతు పలికిన నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు బిఎస్పీ, ఒక ఎస్పీ ఎంఎల్‌ఏలు ఇప్పుడు బిజెపి మద్దతు పలకడంతో కాంగ్రెస్‌కు పట్టులేకుండాపోయింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చినప్పటినుండీ ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు పడగొట్టాలా అన్న ప్రయత్నంలోనే బిజెపి ఉన్నట్లుగా అక్కడి రాజకీయ పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించేముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఎం కమల్‌నాథ్‌ ఇదే విషయాన్ని చెప్పారు. దీని వెనుక బిజెపి కుట్ర ఉన్నదని తీవ్రంగా విమర్శించారు. అయిదేళ్ళపాటు ప్రభుత్వాన్ని నిర్వహించేందుకు ప్రజలు తమకు అధికారాన్ని కల్పించారని, ఆ ప్రజాతీర్పును బిజెపి• అపహాస్యంచేస్తూ, తమ పార్టీకి చెందిన శాసనసభ్యులను ప్రలోభపెట్టి కర్నాటకలో బంధించిపెట్టడం ఎక్కడిన్యాయమని ఆయన ప్రశ్నించారు. ఈ మొత్తం ఎపిసోడ్‌కు ప్రధానకారణం కాంగ్రెస్‌లో ఇంకా వృద్ద నాయకత్వమే చలామణి అవుతూ యువతకు అవకాశాలు లేకుండా చేయడమేనన్నది స్పష్టమవుతున్నది. ఇప్పటికైనా కాంగ్రెస్‌ ఆ ‌దిశగా ఆలోచిస్తుందోలేదో కాని, అధికారాన్ని కోల్పోవడానికి కారణంమాత్రం అదే అన్నది స్పష్టం. ఇదిలాఉంటే బిజెపి పార్టీకి చెందిన మాజీ సిఎం శివరాజ్‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌నేతృత్వంలో ఆ పార్టీ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!