Take a fresh look at your lifestyle.

రాజకీయ మేధావి మధు లిమాయె

నేడు మధు లిమాయె వర్ధంతి

మధు లిమాయె పూణే పట్టణంలో 1922 మే 1వ తేదీన జన్మించారు. ఆయన పూర్తి పేరు మధుకర్‌ ‌రామచంద్ర లిమాయే. మధులి మాయె స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న, కాంగ్రెస్‌ ‌ను ముఖ్యంగా ఇందిరా గాంధీని వ్యతిరేకించిన ప్రముఖ వ్యక్తులలో ఒకరు. ఆయన సోషలిస్ట్ ‌వ్యాసకర్త, సామాజిక కార్యకర్త. పూణే లోని ఫెర్గుసన్‌ ‌కళాశాల నుండి విద్యను పూర్తి చేసారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనడం వల్ల చదువుకు అంత రాయం ఏర్పడింది. 1940 నుండి 1945 మధ్య కాలంలో నాలుగు సంవత్సరాల జైలు జీవితం కూడా గడిపారు. గోవా విముక్తి ఉద్యమం లో పాల్గొని చాలాకాలం జైలు జీవితం అనుభవించారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో 1938-1939 లలో సభ్యునిగా ఉన్నారు. తర్వాత రాం మనోహర్‌ ‌లోహియా సోషలిష్ట్ ‌పార్టీలో ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. సోషలిస్టు నేత రామ్‌ ‌మనోహర్‌ ‌లోహియా అనుయాయు లైన జార్జ్ ‌ఫెర్నాండెజ్‌, ‌మధు లిమాయే, రాజ్‌ ‌నారాయణ్‌లు ఎప్పుడూ కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూ వచ్చారు. సోషలిస్టు ఉద్యమంలో అంబేడ్కర్‌ ఆవశ్యకతని గుర్తించిన మొదటి వ్యక్తి బహుశ మధు లిమాయే నేమో. ‘కమ్యూనిస్టు మానిఫెస్టో’ ఎంత ముఖ్యమో అంబేడ్కర్‌ ‘‌కుల నిర్మూలన’ కూడా అంతే ముఖ్యమని లిమాయే ప్రకటించారు. అంబేడ్కర్‌ ‌కుల నిర్మూలన కోరుకున్నారు. ఎందుకంటే కుల నిర్మూలన జరగకుండా దేశంలో వర్గాలు ఏర్పడవని, వర్గ పోరాటమూ సంభవించదని భావించారు. గోవా విముక్తి ఉద్యమంలో పాల్గొని చాలాకాలం జైలు జీవితం అనుభవించారు. మధు లిమాయే బీహార్‌ ‌లోని బంక లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. మధులిమాయే 1964-1979 తన లోక్‌ ‌సభ పదవి కాలంలో ఉత్తమమైన వక్తగా ప్రజా సమస్యలు తెలుపడంలో చురుకైన పార్లమెంటేరియేన్‌ ‌గా పేరు గడించారు. అత్యవసర పరిస్థితి సమయంలో 1975 నుంచి 1977 వరకు జైలులో వున్నారు. తర్వాత జయప్రకాశ్‌ ‌నారాయణ నాయ కత్వంలో ప్రతిపక్ష పార్టీలను సమైక్య పరిచే ప్రయత్నంలో ప్రముఖ పాత్ర పోషించారు. జార్జ్ ‌ఫెర్నాండెజ్‌ ‌తో పాటు వివిధ అంశాలపై పని చేసేవారు. అత్యవసర పరిస్థితి తర్వాత కేంద్రంలో అధికారం చేజిక్కించుకున్న జనతా ప్రభుత్వంలో ముఖ్య పాత్రలు పోషించాడు.

మొరార్జీ దేశాయ్‌ ‌నేతృత్వంలో ఏర్పడిన జనతా ప్రభుత్వం 1979 సంవత్సరంలో కూలి పోవడానికి, జనతా పార్టీలో చీలిక రావటంలో …జనసంఘ్‌ – ‌రాస్ట్రీయ స్వయం సేవక్‌ ‌పార్టీ ద్వంద సభ్యత్వాల కారణాలలో మధులిమాయే పాత్ర ప్రధానమైనది.. జనతా పార్టీలో భాగమైన వారు ఇతర పార్టీలలో గాని, రాజకీయ సంస్థలతో గాని భాగస్వామ్యంలో ఉండరాదని, మురార్జీ దేశాయ్‌ ‌నేతృత్వంలో ఏర్పడిన జనతా సంకీర్ణ ప్రభుత్వం అధికారం నుండి దింపడంలో రాజ నారాయణ్‌ ‌కృష్ణ కాంత్‌ ‌తదితర సహచరులతో కలిసి ప్రణాళికలు రూపొందించి సఫలమయ్యారు. జనతా పార్టీలో భాగస్వాములైన జనసంఘ్‌ ‌నాయకులు రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌ ((ఆరెస్సెస్‌) ‌సభ్యులుగా ఉండడంతో ద్వంద్వ సభ్యత్వంపై మధులిమాయే లాంటి నేతల అభ్యంతరాలు 1979 లో జనతా ప్రభుత్వం పతనానికి, జనతా కూటమి పతనానికి దారితీసింది.

ఇందిరా గాంధీని ఓడించే ఏకైక లక్ష్యంతో, భిన్న భావజాలాలు కలిగిన పార్టీల కలయికతో ఏర్పడిన జనతా పార్టీ కిచిడీలాంటిదేనని ఆయన నొక్కి చెప్పారు. ఇందిర ఓడి పోవడంతో జనతా పార్టీ చీలిపోవడం ప్రారంభమయింది. వాస్తవానికి లోక్‌సభలో మొరార్జీ దేశాయి ప్రభుత్వానికి మద్దతు నివ్వమని జార్జి ఫెర్నాండెజ్‌కు సలహా ఇచ్చింది మధు లిమాయే. అయితే ఇది జరిగిన కొద్ది గంటలకే సోషలిస్టు నాయకులు మొరార్జీ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించు కున్నారు. మధు లిమాయే రాజకీయ సిద్ధాంతం, లౌకిక జాతీయవాదం, భారత దేశం యొక్క లౌకిక ఆధారాలపై ఆయనది రాజీలేని వైఖరి. ఆయన రాజ్యాంగంలోని లౌకిక పునాదుల పరిరక్షణకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. కుల వ్యవస్థకు తన లాంటి సోషలిస్టు ప్రధాన శత్రువని ప్రకటించారు. కుల వ్యవస్థ, దాని ఆధారంగా ఉన్న అసమానతలను కూల్చివేసే వరకు భారత దేశంలో ఆర్థిక మరియు సామాజిక సమానత్వం ఉండదని దృఢమైన అభిప్రాయమని నొక్కి చెప్పారు. మధు లిమాయే తన జీవితమంతా పౌర స్వేచ్ఛ కోసం పోరాడేవారు. పౌరుల స్వేచ్ఛ కోసం దిగువ కోర్టుల నుండి హై కోర్టులలో, సుప్రీం కోర్టులో తన కేసులను వాదించారు. విజయం సాధించారు. మధు లిమాయే విదేశీ విధానంలో… అలీన దేశాల సూత్రములపై ఆధారం, వలసవాద వ్యతిరేకత, ప్రజలందరికీ స్వేచ్ఛ, నిరాయుధీకరణ, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక ప్రయోజనాల రక్షణ, ప్రపంచ శాంతి మున్నగు వాటిలో గట్టి నమ్మకం ఉండేది. రాజకీయ – ఆర్థిక సామ్రా జ్య వాదానికి వ్యతిరేకంగా వలస రాజ్యాల ప్రజల పోరాటం యొక్క పొడిగింపు అయినందున, భారత దేశం తమ విదేశాంగ విధానములో దృఢ వైఖరిని తీసుకోవాలి అని ఆయన పేర్కొనే వారు. మధులిమాయె రాజకీయ నాయకు నిగా కాక రచయితగా ఆంగ్లము, హిందీ, మరాఠి భాషలలో పుస్తకా లను రచించారు. 1997లో భారత ప్రభుత్వం లిమాయే జ్ఞాపకార్థం పోస్టల్‌ ‌స్టాంపు విడుదల చేసింది. మధు లిమాయే 1995 జనవరి 8 న్యూఢిల్లీలో మరణించారు.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply