Take a fresh look at your lifestyle.

మద్దతు ధరను చట్టంలో చేరిస్తే ఇబ్బందులేమిటో చెప్పాలి

సాగుచట్టాలపై కాంగ్రెస్‌ ‌యూ-టర్న్ ‌తీసుకున్నదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌పదే పదే చేస్తున్న ఆరోపణకు పార్టీ సీనియర్‌ ‌నాయకుడు జైరామ్‌ ‌రమేష్‌ ‌ఘాటైన సమాధానమిచ్చారు. రైతులకు, వర్తకులకూ మధ్య జరిగే లావాదేవీలు మద్దతు ధరకు దిగువగా ఉండకుండా రైతుల ప్రయోజనాలు కాపాడాలంటూ నరేంద్రమోడీ గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వినియోగదారుల వ్యవహారాల కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసిన అంశాన్ని జైరామ్‌ ‌రమేష్‌ ‌గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల హక్కులను కాపాడిన వ్యక్తిగా చెప్పుకుంటున్న మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత కనీస మద్దతుధరను చట్టాల్లో చేర్చడానికి వీలు లేకుండా చట్టాలను తెచ్చి యూ టర్న్ ‌తీసుకున్నారంటూ జైరామ్‌ ‌రమేష్‌ ఎద్దేవా చేశారు. మోడీ మంచి వక్త, ఏ విషయంపైనైనా హావభావాలతో ప్రజలకు హత్తుకునేట్టు చెప్పగలరు. అంతమాత్రాన అబద్ధాన్ని పదే పదే చెబితే అది నిజం అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. సాగు చట్టాల్లో మద్దతు ధర అంశమే లేదు.

మద్దతు ధర అనేది రైతులకు కనీస హామీ వంటిది. వ్యవసాయ శాస్త్ర నిపుణుడైన డాక్టర్‌ ‌స్వామినాథన్‌ ‌పంట వేయడానికి ముందే మద్దతు ధరను నిర్ధారించాలని సూచించారు. మద్దతు ధరకు ఆయన ఎంత ప్రాధాన్యం ఇచ్చారో దీనిని బట్టే తెలుస్తుంది. రైతులు సాగిస్తున్న ఆందోళనను తీవ్రవాదుల మద్దతుతో చేస్తున్నదిగా ముద్రవేయడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం మద్దతు ధర కోసం ఇంతవరకూ ముఖ్యమంత్రులూ, ప్రధానమంత్రులు చేసిన ప్రకటనలనూ, సూచనలను సింహవలోకనం చేసుకుంటే ఈ పరిస్థితి వొచ్చి ఉండేది కాదు. రైతుల కోసం కాంగ్రెస్‌ ఏమీ చేయలేదంటూ నిర్మలా సీతారామన్‌ ‌చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను పక్కన బెడితే, బీజేపీ చేస్తున్నది కూడా ఏమీ లేదు. ప్రధానమంత్రి సమ్మాన్‌ ‌పథకాన్ని 2019 ఎన్నికల ముందు ప్రవేశపెట్టారు.ఆ పథకం చాలా రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో అమలులో ఉంది. అందుకే పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ తమ రాష్ట్రంలో ఏనాడో దీనిని అమలు జేశామంటూ ప్రధానమంత్రి సమ్మాన్‌ ‌యోజనను పక్కన పెట్టారు. మోడీ ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళి కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సమ్మాన్‌ని దీదీ అమలు జరపలేదనీ, రైతులపట్ల ఆమెకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతున్నది అని అన్నారు.

- Advertisement -

వివిద రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రధానమంత్రికి సమగ్రమైన అవగాహన లేదనడానికి ఇది నిదర్శనం. అలాగే, తెలంగాణలో పెట్టుబడి సాయం పథకం అమలులో ఉంది. అందువల్ల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎదుటివారిపై నిందలు వేసే ముందు వాస్తవ పరిస్థితులను గురించి కూడా తెలుసుకోవాలని జై రామ్‌ ‌రమేష్‌ అన్న మాటల్లో అసత్యం లేదు. రైతు సంక్షేమ పథకాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా అమలు జేస్తున్న మాట నిజమే. రుణ మాఫీ గురించి నిర్మల ప్రస్తావిస్తూ రాజస్థాన్‌, ‌మధ్యప్రదేశ్‌లలో అమలు జేయలేదన్నప్పుడు రాహుల్‌ ‌గాంధీ నోరెళ్ళబెట్టారంటూ విమర్శించారు. రుణమాఫీ రైతులకు హాని చేసేది అంటూనే దానిని అమలు జేయలేదని నిర్మలాసీతారామన్‌ ఎద్దేవా చేయడం బీజేపీ ద్వంద్వ విధానానికి నిదర్శనం. ఆ మాటకొస్తే ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సమ్మాన్‌ ‌యోజన బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏమేరకు నిజాయితీగా అమలు జేస్తున్నాయో సభా ముఖంగా ఆమె చెప్పి ఉంటే కేంద్రం నిజాయితీ వెల్లడయ్యేది. ఎదుటివారి మీద దాడి చేయడమే నేటి రాజకీయాల్లో ప్రధాన అంశంగా కనిపిస్తోంది. పార్టీ ఏదైనా అధికారంలో ఉన్నవారు ఎంచుకునే మార్గమిదేనని స్పష్టమవుతోంది.

గతంలో కాంగ్రెస్‌ ‌కూడా ఇదే చేసింది. ప్రాంతీయ పార్టీలు కూడా ఇదే ఎత్తుగడను అనుసరిస్తున్నాయి. అంతిమంగా రైతులు, శ్రామికులు నష్టపోతున్నారు. ప్రధానమంత్రి ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయడంలో సిద్ధ హస్తులు. ఆయన చెప్పింది చెప్పకుండా ఎన్ని విషయాలనైనా సభా ముఖంగా తెలియజేయగలరు. రైతులు సూచించిన మార్పులను అమలు జేస్తామని అంటున్న మోడీ మద్దతు ధరను చట్టంలో చేర్చేందుకు ఇబ్బందులంటున్నారు, అవేమిటో తెలియజేస్తే ఆయన మాట మీద నమ్మకం ఉంటుంది. మన చట్టం మన ఇష్ట ప్రకారం చేర్పులు, మార్పులు చేసుకుంటాం. ఎవరో ఏదో అంటారని భయపడాల్సిన అవసరం లేదు. సాగు చట్టాలను రైతుల కోసం రూపొందించారు కానీ, మరి ఎవరికోసమో కాదు కదా, రైతులు చేయమంటున్న మార్పులను చేయడానికి ఇబ్బందులంటూ సాగదీయడం ఎంతవరకు సమంజసం. అంటే ఈ చట్టాలను ఆమోదించే వర్గం మరొకటి ఉందన్న విషయం అన్యాపదేశంగా స్పష్టం చేస్తున్నట్టయింది. రాహుల్‌ ‌గాంధీ ఆరోపిస్తున్నట్టు ఇద్దరు ముగ్గురి కోసం ఈ చట్టాలను తెచ్చారా అని జనం అనుమానిస్తే తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కేంద్రం వాదనలోని డొల్లతనం ఇక్కడే బహిర్గతం అవుతోంది. ఎంఎస్‌పీ కోసమే రైతులు పట్టుబడుతున్నారు. దానిని చట్టంలో చేరిస్తే సమస్య పరిష్కారం అయినట్టే. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇరువర్గాలు ఈ సమస్యపై మరింత విస్తృతంగా, అరమరికలు లేకుండా చర్చలు జరపాలని సూచించారు. ప్రతిష్ఠంభన ఎల్లకాలం కొనసాగడం మంచిది కాదని అన్నారు. దేశ ప్రజల అభిప్రాయం కూడా అదే.

Leave a Reply