Take a fresh look at your lifestyle.

‘‘మాట’’

“తెలంగాణ లేకుంటె కే.సి.ఆర్‌ ‌లేడు, కే.సి.ఆర్‌.‌లేకుంటె తెలంగాణ లేదు’’ సిద్దిపేటల జెప్పిన మాట చిన్నమాటనా! సబ్బండవర్ణాల మడిమతిప్పనిపోరు జేశి, వేలల్ల జీవిడిశిన అమరుల త్యాగం యేమయిందనే సోయి మరిశిన మాట.
యవుసాయాన్ని బొంద బెట్టే చట్టాలద్దని డిల్లీ జేరిన రైతులెనుక పతిపచ్చాలున్నయనే మాట రైతుల ఉసురు తీశే మాట ! యవుసాయాన్ని బతికియ్యి మని నిమ్మలంగా  నిరసన జేశే రైతులు ఖలిస్తాన్‌ ‌తీవ్రవాదులోలిగె కానత్తాండ్లనే మాట కాషాయం రంగు బూసుకున్న మాట. మనుసుల మాట, మర్మమున్నమాట, నివురు గప్పిన మాట, పూటకొక మాట రాజకీయాలల్ల చెల్లుబాటయ్యేటి మాట.”

మనిషి తొవ్వ తప్పుతెనే మాట సోయి తప్పుతది. సోయి  తప్పిన మాట శిల్వలు పల్వలై శిత్రకతలు పడుతది, తిప్పలనేకం తెత్తది, ‘‘మాట’’ యెసొంటిదైనా యెవలన్నరు! యేడన్నరు? గా మాట జెప్పినోళ్ళ నోట్లె నాలికెనా వున్నదా! పుసుక్కున తాటిమట్ట గిట్లన్నదా! అనేటి పంజనామలయితాంటయి.! పంచాయితులైతాంటయి.మాట తీరుగుంటె మనిషి బాగుంటడు. మాటలు తీరొక్కకతలువడితె ఈపు దెబ్బలకేడుసుడుంటది. తీ రొక్క మాటలుంటయి.తీపి మాటలుంటయి.తీట మాటలుంటయి. తిట్లోలిగుంటయి. తీశిపారేశేటియుంటయి. కొందరైతె బూమ్మీద నిల్సుండుడుగాకుంట మాట మీదనే నిల్సుంటరు. కొందరు మాట తప్పమంటరు.యాదికుంటె గదా తప్పటానికి!? ఛల్‌! ‌గట్లిట్ల గాదు! మాట తప్పుతె కాళ్ళేళ్ళు,తలకాయ సుత నరుక్కుంటమంటరు. యేపాటి నరుక్కుంటరో యెరుకున్నోళ్ళందరికి యెరుకే వుంటది. ‘కుక్క నాకిందని నాలుక్కిలోల బంగారం నడి బజాట్నేశిన!మారాజ! మారాజ!’’అని జెప్పే తుపాకి రాముల మాటలు సుతుంటయి.మాపటిపూట మాటలైతె మస్తు సొలుగుతాంటయి,మబ్బుల లేశిసూడు! అసలా మాట కానత్తె ఒట్టుపో! మందిలచ్చే మాట బలిశి దొడ్డుగ్గానత్తది.

 

ఓడిపోయినకాడ ఓటుబోయిన కుండ సప్పుడొలిగె సన్నగుంటది మాట. కరోనా బీమారికి గజ్జుమని మాట పడిపోయి ఫామావుజు కాడ నక్కి నీల్గుతది.బయటికెళ్ళుడుతోనె సావు నోట్లె తలకాయబెట్టిన వస్తాదునంటది. మాట నాలికె మీంకేలి జారుడెంతశేపుల్లా! జారిన మాట కిందబడ్డ కండువగాదు.దులిపి మీదేసుకునెటందుకు! మాట మనిషి ని నిలబెట్టి సూపెడుతది. నాలికె గాకుంట తాటి మట్టగనుకైతె మనిషి ఇజ్జత్లేకుంటయితది!ఆడోళ్ళ మాటలకర్దాలు యెరుగుంటయని అన్నదెవలెవలో వుండె!ఆడోళ్ళను గట్ల తీశేశే తీర్గ పాట రాసుడేందుల్లాగందుకే మళ్ళ గిట్ల కానత్తె జేల్‌ ‌కాన్లేయాలె!తిత్తి తీత్త నన్నోళ్ళ మాట పుచ్చుపట్టిన ఇత్తాయె!రొచ్చుల వడె గద!మాట మళ్ళో పాలి జారుడుంటదేమొ!
రొండో కోటరైనంక యెవలి మాటలు గాల్లకే యాదుండయంటరు. ఎలచ్చన్ల మాట్లేడి మాటలైతె ‘నాలుక్కోటర్లయి’నంక అచ్చేటియా యేంది!.గయి జెప్పినోళ్ళకు అటెంక అస్సలుకే యాదుండకుంట బోతయి! కార్యకర్తలు లారీలెక్కిచ్చి తీస్కచ్చిన కోటర్కర్తలు జేయ్‌ ‌లు గొడ్తాంటె మైకు ముందటి మాట బల్దియా మోరినీళ్ళ తీర్గుంటది.చెవులే గాదుల్లా!ముక్కుసుత మూస్కోవాలె! ఆడి తప్పనిమాట యేడనైనా తొడగొడ్తది!లేని మీసాన్ని సుత మెలేశి దిప్పుతది! తప్పిన మాటైతె తిప్పలనేకం బెడుతది.ఆడితప్పిన మాట దుబ్బాక ఓటయితది.బల్ధియా బురద నీళ్ళల్ల జారి కాల్రెక్కలిరిగి అగమయితది.కడుపుకింత మెతుకు తిని బతికెటోళ్ళుంటరు. మన దొర మాత్రం నోటిమాటలతోనే బతుకుతడు.

 

ఆరేండ్ల సంది అనేకమిన్నం! బక్కపానంలున్న పిశికెడు గుండె కోశి యెదురుంగ బల్ల మీద బెట్టినట్టుంటది దొర మాట!మాట ఇన్నోడు యెసొంటి తురూంకాన్‌ అయినసరె!బేవోశ్‌ అయ్యే కతే!దళితులకు మూడెకరాల బూమి ఇత్తనన్న మాట!దళితున్నే ముక్కెమంత్రిని జేత్తనన్నమాట! లచ్చ నౌకర్లిత్తనన్నమాట! ఒక్కటి గాదు !లచ్చ మాటలు ! దొర జెప్పని మాటేమన్నన్నున్నదా! మాటమీద నిలవడే దొర మాట నికార్సైన బట్టీ సార లాంటి కడక్‌ ‌మాట!సురుక్కు మనాలె! దొర పానం బొయినా మాట తప్పనన్నడా! మాట తప్పుతె తలకాయ నరుక్కుంట నన్నడా!తలకాయ నరుక్కోలేదంటె యేందన్నట్టు! ఆరేండ్ల సంది జెప్పిన మాటలన్ని చేశేటియి గాదు.

గీ గీ పనులు అర్కీస్‌ ‌జేయనుల్లా! అని జెప్పినయని సమజ్గావాలె! చెప్పిన మాట ఒక్కటంటె ఒక్కటి సుత చేశిండా! లేదుగద! మాట మీద నిల్సుండే మనిషా కాదా! చెప్పిన మాటలిడిశి మిగితాయి జేయబట్టిండా లేదా! గదే! మరి! దొర ఇచ్ఛంత్రం!
రొచ్చుల బుట్టుకచ్చేటి మాటలైతె మాగనే చిచ్చు బెడ్తానయి. బాగ్గలచ్చింగుడి తాన తొడ గొట్టిన మాట నిలవడ్డది గని. నిలవెట్టింది జనవైతె నిలవడ్డది వాపేగని, బలమెట్లయితన్న అనుమానం గొడ్తాంది.బల్దియా వరదల ‘‘మాటలు’’కార్ల కన్నజోరుగ పడువలెక్కి షికారు జేశినై. వరద సాయం అర్రాజు పాటైంది. ఒకలేమొ పదేంది, దానికింకో పదిమీద ఐదంటిరి.ఛలో! మా పాట యాబయని కరారు జేశి చేతిలచేయేసిన మాట కు దేవులాడిన సుత జిపాడిట్‌ ‌కాన్రాకపాయె!జారుడు బండ మీది ఆట తీర్గె కొత్తలిత్తనన్న మాట ఇన్సురెన్సుల ఇప్పిచ్చేటిదని తేలింది. గిదంత గాదు బయి.కుర్సి మీద కూకుంటనే ఇచ్చుడో ఇప్పిచ్చుడో గని కుర్సిలేకుంట గల్మ కాడ నిలవెడ్తె ఇచ్చుడేడిది! అంత ఒల్లెక్కాల మాట! అని కుల్లం కుల్గ జెప్పబట్టె! బట్టలిప్పిన మాటలు! బాతకాని మాటలు, బట్టెబాజి మాటలు, బలిశిన మాటలు, శాతగాని మాటలు, సుర్మా బెట్టిన మాటలు, సురుక్కుమనే మాటలు జార్దారుగ కలవడి తన్నుకుంటె సుత బల్దియా బద్దిల బలమో రేవుకు రాకపాయె! ఉసురు తీశే మాటలు, ఉలిక్కి పడే మాటలు, ఉరిమేటి మాటలు ఈ మద్దెన ఆగం జేయబట్టినయి. తెలంగాణ లేకుంటె కే.సి.ఆర్‌ ‌లేడు, కే.సి.ఆర్‌.‌లేకుంటె తెలంగాణ లేదు’’ సిద్దిపేటల జెప్పిన మాట చిన్నమాటనా! సబ్బండవర్ణాల మడిమతిప్పనిపోరు జేశి, వేలల్ల జీవిడిశిన అమరుల త్యాగం యేమయిందనే సోయి మరిశిన మాట.

యవుసాయాన్ని బొంద బెట్టే చట్టాలద్దని డిల్లీ జేరిన రైతులెనుక పతిపచ్చాలున్నయనే మాట రైతుల ఉసురు తీశే మాట ! యవుసాయాన్ని బతికియ్యి మని నిమ్మలంగా  నిరసన జేశే రైతులు ఖలిస్తాన్‌ ‌తీవ్రవాదులోలిగె కానత్తాండ్లనే మాట కాషాయం రంగు బూసుకున్న మాట. మనుసుల మాట, మర్మమున్నమాట, నివురు గప్పిన మాట, పూటకొక మాట రాజకీయాలల్ల చెల్లుబాటయ్యేటి మాట.

‘‘సూడ్రా !బయ్‌!ఇ‌క్రమార్క్’’! ‘‘ఇప్పటిదాంక యింటివి గదా! మాట  పోద్దాడోలిగె వడితిరుగ బట్టె! మాట కడుపులున్న ఇషం కాన్రాకుంట కక్కబట్టె! గిసొంటి తీరొక్క మాట యెనుక ఇగురం యేంది గావచ్చు!?  నా పశ్నకు జవాబు జెప్పకుంటె నీకు ఖలిస్తాన్‌ ‌లింకులున్నయని పేస్‌ ‌బుక్‌ ‌ల పోస్ట్ ‌పెడుత! అని యెప్పటి తీర్గనే బెదిరిచ్చేటి బేతాళుని శవాన్ని బుజాన్నేసుకొని ‘‘ఇను బేతాళ్‌! అధికారం దొరికి చ్చుకునుడు,అటెంక పజాసామ్యం ఇలువల ఇజ్జత్‌ ‌తీశేటి లీడల్ల నోట్లె నాలికెలుతాటిమట్టలయినంక మాటలు గిసొంటియే వుంటయి.జనం సోయి పెంచుకుంటెనే ముందు ముందు  లీడర్ల మాటల మర్మాలు సమజయితయి’’.అని జెప్పుకుంట నడ్వ బట్టిండు..నడ్వ బట్టిండు…
– ఎలమంద – తెలంగాణ  

Leave a Reply