Take a fresh look at your lifestyle.

టిడిపికి ఎల్‌ ‌రమణ రాజీనామా

  • టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటన
  • కెసిఆర్‌తో భేటీ అయిన వెంటనే టిడిపికి రాజీనామా
  • కెసిఆర్‌ అభివృద్ధి నమూనాకు ఫిదా అయినట్లు వెల్లడి

రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు రమణ టిడిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన చంద్రబాబుకు పంపారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమికరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా, రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో తాను టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని రమణ తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని, గత 30 సంవత్సరాలుగా తన ఎదుగుదలకు తోడ్పాటునందించిన చంద్రబాబుకు రమణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో ఎల్‌ ‌రమణ గురువారం రాత్రి భేటీ అయిన సందర్భంగా కలసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈటల రాజేందర్‌ ‌రాజీనామాతో కరీంనగర్‌లో ఏర్పడ్డ ఖాళీని రమణతో భర్తీ చేయాలని టిఆర్‌ఎస్‌ ‌భావిస్తుంది. ఇవన్నీ బేరీజు వేసుకున్నాకే రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ఆయన ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా వీరి మధ్య దాదాపు గంటన్నరకుపైగా చర్చలు జరిగాయి.

అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ఎల్‌ ‌రమణ మిడియాతో మాట్లాడుతూ.. తాను సీఎం కేసీఆర్‌ను కలిసి, జగిత్యాలకు వైద్య కళాశాల ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపినట్టు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ప్రస్థానం, గత ఏడేండ్లలో స్వరాష్ట్రంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించినట్టు వివరించారు. దేశంలో వివిధ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు.. తెలంగాణలో జరుగుతున్న ప్రగతిపై సీఎం కేసీఆర్‌ ‌విడమరచి చెప్పారని ఆయన తెలిపారు. సామాజిక తెలంగాణ సాధించాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ‌రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్‌ ‌చేపట్టిన పాలనా సంస్కరణలు అద్భుత ఫలితాలిస్తున్నాయని ప్రశంసించారు. కొవిడ్‌ ‌విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించిందని కితాబిచ్చారు. ఈ పరిణామ క్రమంలో శుక్రవారం రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. ‌రమణ ఆ పార్టీకి రాజీనామా చేశారు.

మూడంటే మూడే వాఖ్యలతో తన రాజీనామా లేఖను ముగించారు. 30 ఏళ్లుగా తోడ్పాటు అందించిన చంద్రబాబుకు ధన్యవాదాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు రమణ అధికారికంగా ప్రకటించారు. రమణకు ఎమ్మెల్సీగా చాన్స్ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతుంది. సామాజిక తెలంగాణ కోసం కలిసి ముందుకు వెళ్దామని కేసీఆర్‌ ఆహ్వానించారని ఎల్‌ ‌రమణ కూడా మిడియా ముందు తెలిపారు. సీఎంతో భేటీ అనంతరం రమణ మాట్లాడుతూ ‘మిరు పార్టీలోకి రండి, తగిన గౌరవమిస్తాం..నాకు వదలిపెట్టు, నేను చూసుకుంటా’ అని కేసీఆర్‌ ‌స్పష్టమైన హామి ఇచ్చినట్లు కూడా చెప్పారు. ‘మనం రమణను వాడుకోవాలి.. అన్ని సామాజికవర్గాలకు ఎంతో కొంత న్యాయం చేశాం. పద్మశాలి సామాజికవర్గానికి పార్టీలో రాష్ట్రస్థాయి నాయకుడు లేరు. ఆ లోటును రమణతో భర్తీ చేసుకుందాం. ఆయన్ను బాగా వాడుకోవాలి’ అని కేసీఆర్‌ ‌నేతలతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది. అయితే తన పాత మిత్రుడు రమణను కారెక్కించడంలో మంత్రి ఎర్రబెల్లి బాగానే వర్కవుట్‌ ‌చేశారని అంటున్నారు.

Leave a Reply