Take a fresh look at your lifestyle.

బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 : ‌బంగాళాఖాలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది మరింతగా బలపడి.. వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని అనుకొని కొనసాగుతుంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుంది. దీని ప్రభావంతో దక్షిణ ఒరిస్సా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమ గోదావరిలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టుకు ఎగువ, పరీవాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం జలాశయానికి 45వేల క్యూసెక్కుల ఇన్‌ ‌ఫ్లో వొస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఏడుగేట్ల ఎత్తి 45 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వొదులుతున్నారు. ఇప్పటికే జలాశయం నిండుకుండను తలపిస్తున్నది. ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు వొచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండింది. డ్యామ్‌ ‌పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు, ప్రస్తుతం 1,088 అడుగుల మేర నీరున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. జలాశయంలో 77 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

 

ఖమ్మం జిల్లాలోని పాలేరు ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. ఎగువన భారీ వర్షాలకు జలాశయానికి 25 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 24 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌, ‌నల్లగొండ జిల్లాల్లో వర్షాలతో పాలేరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ‌జిల్లాలోని సిర్పూర్‌లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. నియోజకవర్గం వ్యాప్తంగా వ•తీ•వ•స్త్ర రాత్రి నుంచి ఆగకుండా వానపడుతున్నది. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షానికి చింతలమానేపల్లి మండలంలోని దింద వాగు ఉప్పొంగింది. దీంతో దింద, రన్‌వెల్లి, నాయకపుగూడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బెజ్జూరు మండలం సలుగుపల్లిలో తీగలఒర్రె వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. బెజ్జూరు, పెంచికలపేట మండలాల మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ‌జారీ చేసింది. ఆదిలాబాద్‌, ‌కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌జగిత్యాల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌జగిత్యాల, కరీంనగర్‌, ‌పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అత్యంత భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. నిజామాబాద్‌, ‌సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఆరెంజ్‌ అలర్ట్ ‌కొనసాగుతుందని పేర్కొంది.

 

ఎల్లో అలర్ట్‌లో ఉన్న నల్గొండ, సూర్యాపేట, జనగామ, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌మహబూబ్‌ ‌నగర్‌, ‌నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. మహబూబాబాద్‌ ‌లో రెండు రోజులుగా కురుస్తన్న వర్షాలకు వాగులు, చెరువులు ఉధృతంగా ప్రవహి స్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కుండపోత వర్షాలు.. రోడ్లన్నీ జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. కొత్తగూడ మండలం వేలుబెల్లి గ్రామ శివారులో కత్తెర వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్కూల్‌కు వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ల లోతు నీళ్లు వచ్చి వాగు దాటడం కష్టంగా ఉందంటున్నారు. అత్యవసర పనులకు వెళ్లే వారిని ట్రాక్టర్‌ ‌సహాయంతో వాగు దాటిస్తున్నారు. ఇకపోతే ములుగుజిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వర్షాలకు ఇల్లు కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన  మంగపేట మండలం కొత్త మల్లూరు(బెస్తగూడెం)లో చోటు చేసుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సోయం మంగమ్మ(60)కు చెందిన ఇల్లు ఆదివారం అర్ధరాత్రి కూలిపోయింది. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం గమనించిన స్థానికులు మంగమ్మ మృత దేహాన్ని బయటకు తీశారు. మంగమ్మకు ఓ కుమారుడు ఉండగా భదాద్రి కొత్తగూడెం లో ఉంటున్నాడు. రెవెన్యూ అధికారులు కూలిన ఇంటిని పరిశీలించి పంచనామా పక్రియ నిర్వహించి, కలెక్టర్‌ ‌కు నివేదించారు.

Leave a Reply