Take a fresh look at your lifestyle.

జోరుగా అక్రమ నిర్మాణాలు…అడ్డుకునే నాథుడే లేడు

  • పంచవటి కాలనీలో రెచ్చిపోతున్న బిల్డర్లు
  • పరోక్షంగా ప్రభుత్వ మద్దతు…పనిచేయని డిటిఎఫ్‌
  • ‌ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

ఖజానాకు వొచ్చే ఆదాయాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే దానిని గాలికి వొదిలేసింది. తమ హయాంలో అక్రమ నిర్మాణాలను సహించేది లేదంటూ ప్రభుత్వ పెద్దలు పదేపదే ప్రకటనలు చేశారు. ఇందుకోసం రకరకాల చట్టాలు తీసుకు వొస్తున్నారు. కానీ ప్రయోజనం మాత్రం శూన్యం. ప్రభుత్వ చట్టాలు, ప్రకటనలు పేపర్లకే పరిమితం అవుతున్నాయి. చర్యలు తీసుకోవడంలో మాత్రం ప్రభుత్వ పెద్దలు వెనుకాడుతున్నారు. ఇదే అక్రమ నిర్మాణదారులకు వరంగా మారింది. మణికొండ మున్సిపల్‌ ‌పరిధి పంచవటి కాలనీలో అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి.

వీటికి అధికారులను బాధ్యులుగా చేస్తూ వారిపై చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా అక్రమ నిర్మాణం పై ఇప్పటివరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీనిని బట్టి ప్రభుత్వం పరోక్షంగా అక్రమ నిర్మాణదారులకు మద్దతుగా నిలుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ నిర్మిస్తున్న ఏ ఒక్క భవనం కూడా అనుమతులకు లోబడి జరగడం లేదు. ఈ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన సిబ్బంది ఒక్కరు కూడా లేరు. ప్రభుత్వం ఇలాంటి పరిస్థితిని కల్పించడంతో అక్రమ నిర్మాణదారుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి తీరని గండి పడుతుంది. ఈ మొత్తం వ్యవహారం పరిశీలిస్తే కంచే చేను మేసిన తీరుగా ప్రభుత్వ వ్యవహారం ఉంది.

కొందరు ప్రభుత్వంలోని పెద్దల పేర్లు చెప్పుకొని మరి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. మణికొండ మున్సిపాలిటీలో ఒక కమిషనర్‌ ‌తప్ప ఇతర ఏ అధికారి కూడా లేరు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప కమిషనర్‌ ‌వాటిపై చర్య తీసుకునే అవకాశం లేదు. అప్పటికి కూడా అవుట్‌ ‌సోర్సింగ్‌ ‌సిబ్బంది అయినా బిల్‌ ‌కలెక్టర్లతో కొంతమేరకు అక్రమ నిర్మాణాలపై అక్కడక్కడ చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలంటూ పాక్షికంగా కూల్చివేసి వొదిలేస్తున్నారు. తదనంతరం తిరిగి వారి పనులు వారు చేస్తున్నారు. అదేవిధంగా బిల్డర్లు కూడా వారి పని వారు చేసుకుంటూ వెళుతున్నారు. వెరసి అక్రమ నిర్మాణాలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు.

ఈ విషయం అధికారులకు, స్థానిక పాలకమండలికి, ఉన్నతాధికారులకు అందరికీ తెలుసు. ఎవరు కూడా వీటిని అడ్డుకునే సాహసం చేయడం లేదు. ప్రభుత్వమే వొదిలేసిన తర్వాత వీరు మాత్రం ఏం చేయగలరు.  ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా ఇక్కడ పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి అక్రమ నిర్మాణాలను అడ్డుకునే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

డిటిఎఫ్‌ ఏం ‌చేస్తున్నట్లు..
మున్సిపాలిటీలలో అక్రమ నిర్మాణాలను నివారించేందుకు, జరుగుతున్న వాటిపై చర్యలు తీసుకునేందుకు జిల్లా టాస్క్ ‌ఫోర్స్ (‌డిటిఎఫ్‌)‌ను ప్రభుత్వం నియమించింది. ఇందులో మణికొండ మున్సిపాలిటీకి పనిచేయాల్సిన టాస్క్ ‌ఫోర్స్ ‌టీంకు స్థానిక ఆర్డిఓ ఇంచార్జిగా వ్యవహరిస్తారు. సభ్యులుగా ఇరిగేషన్‌ అసిస్టెంట్‌ ఇం‌జనీర్‌, ‌ఫైర్‌ ఆఫీసర్‌, ‌నార్సింగి సిఐ, స్థానిక టౌన్‌ ‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ ఉం‌టారు. వీరంతా కూడా అక్రమ నిర్మాణాల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. వీళ్ళు నిర్లక్ష్యం వహించడం వెనుక ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కనీసం టాస్క్ ‌ఫోర్స్ అయినా వీటిపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply