Take a fresh look at your lifestyle.

సడలుతున్న లాక్‌డౌన్‌ ..‌పెరుగుతున్న కేసులు

కొరోనా పాజిటివ్‌ ‌కేపులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ ఏడవ స్థానానికి చేరుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. గడచిన రెండు రోజుల్లోనే ఎనిమిది వేలకు పైగా పాజిటివ్‌ ‌కేసులు నమోదు కావడం వైరస్‌ ఉ‌గ్రరూపం దాలుస్తుందనడంలో ఏమాత్రం సందేహంలేదు. దీంతో సోమవారం నాటికి దేశంలో పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య లక్షా 90వేలకు పైగానే నమోదు కాగా, మరణాల సంఖ్య కూడా అయిదువేలపై చిలుకుగానే ఉంది. ఈ సంఖ్య ప్రపంచదేశాల మరణాలతో పోలిస్తే 13వ స్థానంలో ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా మృతుల్లో దాదాపు నలభైశాతం మంది మహారాష్ట్రకు చెందినవారే కావడం గమనార్హం. మహారాష్ట్రలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య సుమారు రెండు వేల మూడు వందలకు చేరుకుంది. దేశంలో అత్యధికంగా గుజరాత్‌లో మరణాలు సంభవించాయి. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు వెయ్యికి పైగానే మృత్యువాత పడ్డారు.అయితే మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం లాక్‌డౌన్‌ను మరికొంత కాలం అంటే జూన్‌ 30 ‌వరకు పొడిగిస్తున్నట్లు ముందుగానే తెలిపింది.

కాగా కేంద్రం కూడా జూన్‌ 30‌వరకు అయిదవ విడుత లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించినా, గతంలోకన్నా ఎక్కువ సడలింపులు చేస్తున్నది . రాష్ట్రాల విషయాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలేసిన కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజులు అనగా జూన్‌ ఎనిమిదవ తేదీ తర్వాత కొన్ని షరుతులతో వ్యాపార సంస్థలను తెరుచుకునేందుకు అనుమతివ్వాలని నిర్ణయం తీసుకుంది. గత రెండు నెలల కాలంగా ఢిల్లీలో మూతపడిన హోటళ్ళు, షాపింగ్‌ ‌మాల్స్ , ‌రెస్టారెంట్లు వారం రోజుల తర్వాత దుమ్ముదులపబోతున్నాయన్నమాట. జూన్‌ 30‌లోగా ఇతర సంస్థలపై దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసే ఆలోచనలో కేంద్రముంది.కాగా ఇంత కాలంగా స్థంబించిపోయిన ప్రజా రవాణా వ్యవస్థను పునరుద్దరించడంలో భాగంగా దాదాపు రెండు వందల ప్రత్యేక రైళ్ళను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్దంచేస్తున్నది. జూన్‌ 30‌నాటివరకు దాదాపు 25 లక్షల మంది ఇప్పటికే తమ సీట్లను రిజర్వు చేసుకున్నట్లు సంబందిత శాఖ అధికారులు ప్రకటించారు.. మే రెండవ వారం నుండి వలస కార్మికుల కోసం ముప్పై శ్రామిక రైళ్ళను ఇప్పటికే నడిపిస్తున్నారు. ఒక పక్క కొరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఇలా రైళ్ళను ప్రవేశపెట్టడాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి కూడా. వాస్తవానికి దాదాపు రెండు నెలల కాలం లాక్‌డౌన్‌ ‌కొనసాగుతున్నప్పటికీ కొరోనా పాజిటివ్‌ ‌కేసులు పెరుగుతూనే వచ్చాయి. పైగా పోనుపోను అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను దశలవారీ గా సడలిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

సడలింపుల కారణంగానే పాజిటివ్‌ ‌కేసులు పెరుగుతున్నట్లు అర్థమవుతున్నది. ప్రజల, దేశ, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సడలింపులు జరుపుతున్నా, కనీస జాగ్రత్తలను తీసుకోవాలన్న విషయాన్ని మాత్రం ప్రజలు మరిచిపోతున్నారు. పూర్వంలాగా ఒకరినొకరు రాచుకుంటూ తిరుగడం, ఒకేచోట అనేక మంది గుమిగూడడమన్నది మానడంలేదు. మొదట్లో పోలీసు సిబ్బంది ఎంత పకడ్బందీగా దూరాన్ని పాటించేవిషయంలో, మాస్క్‌లను ధరించే విషయంలో కట్టడిచేసిందో ఇప్పుడది లేకుండాపోయింది. డాక్టర్‌ ‌క్లినిక్‌లలోనైతే కొన్నిచోట్ల ఒకరికొకరు గాలి ఆడనంత దగ్గరగా నిలుచుంటున్నతీరును చూస్తుంటే కొరోనాను ఇక కట్టడిచేయడం కష్టమేనేమో అనిపిస్తున్నది. దానికి తగినట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్‌డౌన్‌ ‌నిబంధనలను దశలవారీగా సడలించడం వెనుక అదే అర్ధాన్నిస్తున్నది. దీన్ని ఇప్పట్లో తరిమికొట్టడం సాధ్యంకాదని, దానితోనే సహజీవనం సాగించాల్సిందేనని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అరవై ఏండ్లు పైపడినవారు, చిన్నపిల్లలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నా, ఎవరూ పట్టించుకోవడంలేదు. లాక్‌డౌన్‌ ‌సడలింపు అంటే మన భద్రతను పక్కకు పెట్టడంకాదని చెబుతున్నారు మన రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళసై సౌందర రాజన్‌…! ‌రాష్ట్రంలో ఆదివారం ఒక్క రోజున్నే 199 పాజిటివ్‌ ‌కేసులు వచ్చాయంటేనే ఎంత జాగ్రత్త తీసుకోవాలన్నది అర్థమవుతున్నది. ఈసారి ఇద్దరు వైద్య విద్యార్ధులతో పాటు పోలీసులుకూడా కోవిడ్‌ ‌బారిన పడడం ఆందోళన కలిగిస్తున్న అంశం . అందుకు కొరోనాపై మరింత ఉదృతంగా పోరాటం సాగించాల్సిఉందన్న గవర్నర్‌ ‌మాటలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఎంత్తైనా ఉంది.

Leave a Reply