Take a fresh look at your lifestyle.

రైతుకి..పర్యావరణానికి తూట్లు పొడిచే చట్టాలు

“అత్యవసర వస్తువుల జాబితా చట్టం ఇక లేదు. అంటే బియ్యం, గోధుమలు, ఆలుగడ్డలు, ఉల్లి, నూనె గింజలు ఈ జాబితాలో లేకపోవటం వలన ఎవరైనా వీటిని కొని స్టాక్‌ ‌చేసుకోవచ్చు. ఫుడ్‌ ‌చైన్‌ ‌రిటైల్‌ ‌బడా వ్యాపారులయిన రిలయన్స్ ‌వంటి సంస్థలు భారీగా పంటలు కొని, స్టాక్‌ ‌చేసి, కృత్రిమ కరువు సృష్టించి, ఎక్కువ ధరకి కనీస అవసరాలయిన ఆహారపదార్థాలు అమ్ముకోవచ్చు. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రజల ఆకలి తీర్చే ఓ అన్నపూర్ణ రంగంగా పరిగణించటం లేదు. ప్రభుత్వం దృష్టిలో వ్యవసాయ రంగం కూడా లాభాలు ఆర్జించగలిగే ఓ వ్యాపార రంగంగా ప్రభుత్వం పరిగణిస్తున్నది. ఈ విషయం రైతులకి కూడా తెలుసు. ఇలా పరిగణించటంపై పెద్ద పెద్ద పొలాలు వున్న వారికి అభ్యంతరం కూడా లేదు. అయితే చిన్న రైతులు కౌలు, రైతులు మాత్రం గుడ్డిలో మెల్ల అన్నట్టు పొలం పనిలో బతుకుతున్న ఈ చిన్న బతుకు కూడా ప్రైవేటు చేతికి పొతే ఎలా బతికేది అని ఆందోళనకి దిగుతున్నారు.”

Aruna journalist new delhi
అరుణ, జర్నలిస్ట్, ‌న్యూ దిల్లీ

రైతులకి సంబంధించిన మూడు చట్టాలకు దేశవ్యాపితంగా రైతులనుండి వ్యతిరేకత వస్తున్నా కూడా మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి  మూడు చట్టాలు అమలులోకి తెస్తున్నది. దీనికి వన్‌ ఇం‌డియా వన్‌ అ‌గ్రికల్చర్‌ అని మోడీ అభిమానులు సంబరాలు చేస్తుంటే..పంజాబ్‌, ‌హర్యానా రైతులు వీధుల్లోకి వచ్చి వ్యతిరేకిస్తున్నారు. అసలు వ్యవసాయ ప్రాధాన్యత ఉన్న భారత దేశంలో వ్యసాయంపై వున్న చట్టాలు ఏంటో చూద్దాం..

ఎన్‌డిఏ ప్రభుత్వం జూలై 28, 2000న జాతీయ వ్యవసాయ విధానాన్ని ప్రకటించింది. ఈ పాలసీని ప్రకటించినప్పుడు ఈ పాలసీ ద్వారా సాధిస్తామని చెప్పిన లక్ష్యాలు ఇలా వున్నాయి..
1. వ్యవసాయ రంగంలో సంవత్సరానికి 4% కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధిస్తాం. 2. నేల, నీరు జీవవైవిధ్య పరిరక్షణపై ఆధారపడిన వృద్ధి సాధిస్తాం 3. సమానత్వంతో కూడిన అభివృద్ధి వ్యవసాయ రంగంలో సాధిస్తాం. 4. డిమాండ్‌కి తగ్గట్టు పంటలు పండించి రైతుల అభివృద్ధి, ఆర్థిక సరళీకరణ వలన ప్రపంచీకరణ వలన ఉత్పన్నమయ్యే సమస్యలు వచ్చేటప్పుడు వ్యవసాయ ఉత్పత్తులకు  ఎగుమతుల నుండి లాభాలను పెంచటం. 5. సాంకేతికంగా, పర్యావరణపరంగా, ఆర్థికంగా స్థిరమైన అభివృద్ధి సాధించటం.
ఈ లక్ష్యాలు సాధించటానికి ఈ పాలసీ ముఖ్యమైన లక్షణ లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి:
1.  వ్యవసాయ రంగం ప్రైవేటీకరణ చేస్తాం. రైతులకి నష్టం వాటిల్లకుండా రైతులకు అందే ధరల రక్షణ చేపడుతూనే వ్యవసాయ వృద్ధిని సమన్వయం చేసే విధంగా ప్రభుత్వం చూస్తుంది. ప్రైవేటీకరణ ఎందుకంటే వనరులను చక్కగా వాడుకునేందుకు, సాంకేతిక పరిజ్ఞానం పెంచటం కోసం, రైతులకు రుణాలు ఇవ్వడం, రైతులను ధరల హెచ్చుతగ్గుల భాధలనుంచి రక్షించడం.
2. ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని వ్యవసాయరంగంలో ప్రోత్సహించడానికి ముఖ్య కారణం వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచేందుకు, ఈ రంగంలో పెట్టుబడుల ప్రవాహం పెంచేందుకు, పంట ఉత్పత్తికి భరోసా మార్కెట్లు ఏర్పాటు చేయటం, ముఖ్యంగా నూనెగింజలు, పత్తి అలాగే  ఉద్యాన పంటలను అనుమతించడానికి కాంట్రాక్ట్ ‌వ్యవసాయం అమలులోకి తేవటం అలాగే భూ లీజింగ్‌కి అవకాశం ఇవ్వటం.
3. వ్యవసాయంలో ప్రైవేట్‌ ‌రంగ పెట్టుబడులు ముఖ్యంగా వ్యవసాయ పరిశోధన, మానవ వనరుల అభివృద్ధి, పంటకోత నిర్వహణ మరియు మార్కెటింగ్‌ ‌వంటి రంగాలలో  ప్రోత్సహించబడతాయి.
4. దిగుమతులపై పరిమాణాత్మక ఆంక్షలను తొలగించిన తరువాత, ప్రపంచ మార్కెట్లో సంభవించే అనవసరమైన ధరల హెచ్చుతగ్గుల యొక్క ప్రతికూల ప్రభావం నుండి రైతులను రక్షించడానికి, వ్యవసాయ ఉత్పతుల ఎగుమతులను ప్రోత్సహించడానికి, వ్యవసాయ ఉత్పత్తుల  వస్తువుల వారీగా వ్యూహాలను రూపొందించడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది.
5. వ్యవసాయ ఉత్పత్తుల ధరలలో విస్తృత హెచ్చుతగ్గులను తగ్గించడానికి, ప్రభుత్వం భవిష్యత్‌ ‌మార్కెట్ల కవరేజీని విస్తరిస్తుంది.
6. దేశంలో రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పించటం.
7. గ్రామీణ విద్యుదీకరణపై ప్రధానంగా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది.
8. వ్యవసాయ యంత్రాలు మరియు పనిముట్లు మరియు ఎరువులు, పంట కోత నిల్వ మరియు ప్రాసెసింగ్‌ ‌వంటి పదార్థాలపై ఎక్సైజ్‌ ‌సుంకం సమీక్షించబడుతుంది.
9. నీటిపారుదల మరియు ఇతర వ్యవసాయ ప్రయోజనాల కోసం కొత్త పునరుత్పాదక శక్తి వనరులను ఉపయోగించడం ప్రోత్సహించబడుతుంది.
10. రైతులకు సకాలంలో తగినంత రుణాన్ని అందించడానికి గ్రామీణ మరియు వ్యవసాయ రుణాల ప్రగతిశీల సంస్థాగతీకరణ కొనసాగుతుంది. ఇదంతా వాజపేయి ప్రభుత్వ హయాంలో జరిగింది.
ఇప్పుడు మోడీ ప్రభుత్వం భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా పునర్నిర్మించగల పెద్ద సంస్కరణలను 2020 మే 15న ప్రకటించింది. ఈ సంస్కరణలు ఏమిటో చూద్దాం..
1. ఎసెన్షియల్‌ ‌కమోడిటీస్‌ ‌యాక్ట్ 1955(ఇసిఎ) కు సవరణలు చేయటం.
2. ఎపిఎంసి(అగ్రికల్చరల్‌ ‌ప్రొడ్యూస్‌ ‌మార్కెట్‌ ‌కమిటీ) వెలుపల ఎవరికైనా రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవాలి అనుకుంటే అనుమతించే కేంద్ర చట్టాన్ని ప్రవేశపెట్టడంతో పాటుగా రైతులు తాము పండించే పంట రాష్ట్రల సరిహద్దుల్లో చిక్కుకోకుండా అమ్ముకునే అవకాశాన్ని కల్పించటం.
3. కాంట్రాక్ట్ ‌వ్యవసాయాన్ని సులభతరం చేయడానికి అనుకూలమైన చట్టాలు ఏర్పాటు చేయడం, రైతులు విత్తనాలు విత్తే సమయంలో తమ ఉత్పత్తులకు బేరం చేసుకునే అవకాశం కల్పించటం.
ఇంతవరకు చదివినప్పుడు మనకు ఓ స్పష్టత వస్తుంది. అదేమంటే ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రజల ఆకలి తీర్చే ఓ అన్నపూర్ణ రంగంగా పరిగణించటం లేదు. ప్రభుత్వం దృష్టిలో వ్యవసాయ రంగం కూడా లాభాలు ఆర్జించగలిగే ఓ వ్యాపార రంగంగా ప్రభుత్వం పరిగణిస్తున్నది. ఈ విషయం రైతులకి కూడా తెలుసు. ఇలా పరిగణించటంపై పెద్ద పెద్ద పొలాలు వున్న వారికి అభ్యంతరం కూడా లేదు. అయితే చిన్న రైతులు కౌలు, రైతులు మాత్రం గుడ్డిలో మెల్ల అన్నట్టు పొలం పనిలో బతుకుతున్న ఈ చిన్న బతుకు కూడా ప్రైవేటు చేతికి పొతే ఎలా బతికేది అని ఆందోళనకి దిగుతున్నారు. ఇక మన లాంటి ఐదు అంకెల జీతపు జీవులం రైతుల గురించి చర్చించటం అనే మాట మన మధ్య తలెత్తగానే మన అందరం ముందు కరుణ రసంలోకి మునిగిపోయి ఆలోచించటం మొదలు పెడతాం. అందుకే మన సమాజంలో దున్నేవాడిదే భూమి అనే నినాదం పుట్టింది. ఇక మోడీ తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణల ప్రాభవం వ్యవసాయ రంగంపై ఎలా ఉంటుంది చూద్దాం.
1. ఎపిఎంసి(అగ్రికల్చరల్‌ ‌ప్రొడ్యూస్‌ ‌మార్కెట్‌ ‌కమిటీ) అనే వ్యవస్థ ప్రభుత్వం ఇకపై నిర్వీర్యం చేసే అవకాశం ఈ చట్టం వలన ఏర్పడింది. దీనివలన రైతులు తమ పంట దాచుకునే అవకాశాలు తగ్గిపోతాయి పంట దాచే గొడవౌన్‌ ‌ప్రతి రైతు కలిగి వుండే అవకాశమే మన దేశంలో లేదు కనుక పంట చేతిలో పట్టుకుని బేరం చేయటం వలన దలారురులు ఇష్టం వచ్చిన రేటులో కొనే అవకాశం వుంది.
2. అత్యవసర వస్తువుల జాబితా చట్టం ఇక లేదు. అంటే బియ్యం, గోధుమలు, ఆలుగడ్డలు, ఉల్లి, నూనె గింజలు ఈ జాబితాలో లేకపోవటం వలన ఎవరైనా వీటిని కొని స్టాక్‌ ‌చేసుకోవచ్చు. ఫుడ్‌ ‌చైన్‌ ‌రిటైల్‌ ‌బడా వ్యాపారులయిన రిలయన్స్ ‌వంటి సంస్థలు భారీగా పంటలు కొని, స్టాక్‌ ‌చేసి, కృత్రిమ కరువు సృష్టించి, ఎక్కువ ధరకి కనీస అవసరాలయిన ఆహారపదార్థాలు అమ్ముకోవచ్చు.
3. రైతులు ఎవరికైన అమ్ముకోవచ్చు అని చెబుతున్న ప్రభుత్వం కనీస మద్దత్తు ధర(ఎంఎస్‌పి) ఎత్తివేసి నట్టయితే రైతులు ఎంఎస్‌పి కన్నా తక్కువకి ప్రైవేటు వ్యక్తులకి తమ పంటని అమ్ముకోవాల్సి ఉంటుంది. మోడీ ప్రభుత్వం చట్టంలో ఎంఎస్‌పి ప్రస్తావన లేకుండ చేసి కేవలం నోటి మాటగా ఎంఎస్‌పి ఎత్తి వేయం అని చెబుతుంటే రైతులు నమ్మటం లేదు.

4. విత్తనాలు వేసే సమయంలో బేరం రైతు చేయాలి అన్నప్పుడు కొనే వాడు చెప్పే పంట పండించాల్సి ఉంటుంది. కాంట్రాక్టు ఫార్మింగ్‌లో పెద్ద పెద్ద పొలాలు రిలయన్స్ ‌వంటి సంస్థలు హస్తగతం చేసుకుని తమకు లాభాలు వచ్చే పంటలు పండించేలాగా ప్రణాళిక వేసుకుని రైతులను జీతానికి పని చేసేలాగా చేసుకునే అవకాశం వుంది..
ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు ఈ మూడు చట్టాలు నెల జీతం వస్తే ఇంటి సరుకులు కొనుక్కునే  వారికి.. రైతుకి..పర్యావరణానికి తూట్లు పొడిచే చట్టాలు అన్నది స్పష్టం. ఈ చట్టాల పునాది 2000 సంవత్సరంలోనే పుట్టింది. అప్పటి నుండి మనం నిమ్మకు నీరెత్తి కూర్చునే ఉండటం చూసి మోడీ ప్రభుత్వం ఈ చట్టాలు రొమ్ము విరుచుకుని పార్లమెంట్లో పాస్‌ ‌చేసింది.

Leave a Reply