Take a fresh look at your lifestyle.

చమురుపై పనిచేయని రాముడి సెంటిమెంట్‌

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి హిందుత్వ సెంటిమెంట్‌ ఎక్కువ కనుక,ఆ సెంటిమెంట్‌ ‌తోనే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు లోక్‌ ‌సభలో సమాజ్‌ ‌వాదీ సభ్యుడు విశ్వంభర్‌ ‌నిషాద్‌ ‌చేసిన ప్రయత్నం అందరి దృష్టిని ఆకర్షించింది. సీతమ్మ పుట్టిన శ్రీలంకలోనూ, రావణాసురుని లంకలోనూ పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌రేట్లు తక్కువ. రాముడు పుట్టిన భారత్‌ ‌లో మాత్రం లీటర్‌ ‌పెట్రోల్‌ ‌వందరూపాయిలకు చేరుకుంటోంది ఇదేమి విచిత్రం అని ఆ సభ్యుడు ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన విషయాన్ని ఆయన సభలో ప్రశ్నించారు . బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై పార్లమెంటులోనూ, వెలుపల చేసిన విమర్శలు గుర్తు చేసుకోవల్సిన సమయం ఇది.

చమురు ఉత్పత్తులను మన దేశం దిగుమతి చేసుకుంటోంది కనుక,వాటి ధరలపై నియంత్రణ మన చేతుల్లో లేదని యూపీఏ హయాంలో ఆనాటి ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌ అన్నప్పుడు లోక్‌ ‌సభలో బీజేపీ సభ్యులు రివ్వున లేచి తాము అధికారంలోకి వొస్తే చమురు ఉత్పత్తుల ధరలను నియంత్రిస్తామని ఢంకా భజాయించి మరీ చెప్పారు. ఇప్పుడు వారు కూడా మన్మోహన్‌ ‌సింగ్‌ ‌మాదిరిగానే సమాధానమిస్తున్నారు. చమురు దిగుమతులపై మన దేశం స్వాతంత్య్రం వొచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇంకా ఆధారపడి ఉందన్న విషయం మన దేశంలో చిన్న పిల్లలకు సైతం తెలుసు.ఇందుకు బాధ్యులెవరో కూడా తెలుసు. చమురును ఆదాయ వనరుగా పాలకులు మార్చుకున్నప్పుడు ఇంతకన్నా మెరుగైన స్థితి ఎందుకుంటుందన్నది మేధావుల ప్రశ్న.

చమురు ఉత్పత్తుల ధరలను తగ్గించాలన్న రాజకీయ సంకల్పం అటు కేంద్రానికీ,ఇటు రాష్ట్రాలకూ లేదు. ఇతర పన్నుల ద్వారా రాబడి లక్ష్యాలను సాధించలేకపోతున్న పాలకులు చమురు ధరలపై వేసే సుంకాల ద్వారా నమ్మకంగా ఆదాయం వొస్తుందన్న ఉద్దేశ్యంతోనే ఎప్పటికప్పుడు చమురుపై అదనపు సుంకాలను విధిస్తున్నారు. ఈ సుంకాలు కూడా దేశవ్యాప్తంగా ఒకే తీరుగా లేవు. రాష్ట్రానికో రేటు వంతున వసూలు చేస్తున్నారు. చమురు ఉత్పత్తులపై అడిగే ప్రశ్నలకు సంబంధిత శాఖ మంత్రి ఎప్పుడూ దాటవేత సమాధానం చెబుతూ ఉంటారు.

బుధవారం సమాజ్‌ ‌వాదీ పార్టీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రథాన్‌ ‌సమాధానమిస్తూ ఇతర దేశాల్లో చమురు ధరలతో మనం పోల్చుకోకూడదని సలహా ఇచ్చారు. వాడకాన్ని బట్టి వాటి ధరలు ఉంటాయని సెలవిచ్చారు. అందులో కొంత నిజం ఉన్నా, స్వదేశంలో చమురు ఉత్పత్తులను పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆయన వివరించారు. కృష్ణా,గోదావరి బేసిన్‌ ‌లో చమురు నిక్షేపాలను వెలికి తీసే కార్యక్రమం మరుగు పడటానికి రాజకీయాలే కారణం. ఆంధప్రదేశ్‌ ‌కి రావల్సిన వాటాను గుజరాత్‌ ఎగరేసుకుని పోయింది.అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీయే కారణమని ఆంధప్రదేశ్‌ ‌నాయకులు అప్పట్లో ఆరోపించారు.

- Advertisement -

ఇప్పుడు ఎవరూ నోరు మెదపడం లేదు. ఏ ప్రాంతంలో లభ్యమయ్యే సహజవనరులలో ఎక్కువ శాతాన్ని ఆ ప్రాంతం కోరడం మొదటి నుంచి ఉన్నదే అయినప్పటికీ కేజీ బేసిన్‌ ‌చమురు విషయంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డా. వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి కేంద్రంతో పోరాడిన సంగతి ఇంకా జనం దృష్టిలో ఉంది. కేంద్రంలో ఏ పార్టీ లేదా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా, అంబానీ కుటుంబానికి సాగిల పడాల్సిందేనంటూ కమ్యూనిస్టు నాయకుల చేసే ఆరోపణల్లో అసత్యం లేదు. అంబానీకి ఇప్పుడు ఆదానీ తోడయ్యారు.అంతే తేడా. మన వనరులను ఇతరులు ఎత్తుకుని పోతుంటే ఏమీ చేయలేని నాయకులు మనకు పాలకులుగా ఉన్నారు.

వైఎస్‌ ఈ ‌విషయంలో కఠినంగా వ్యవహరించడం వల్లనే ఆయన ప్రాణానికి ముప్పు వొచ్చిందని జనం ఇప్పటికీ చెప్పుకుంటుంటారు.ఇందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా, రాష్ట్రాల హక్కుల కోసం పోరాడే నాయకులు ఈనాడు కరువయ్యారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రానికి రావల్సిన సహజవనరుల వాటాల కోసం ఏనాడూ పోరాడలేదు. పైగా ఆర్థిక సంస్కరణల అమలులో తానే ముందున్నానని చెప్పుకుంటూ బడా పారిశ్రామిక వర్గాలకు అనుకూలమైన నిర్ణయాలను ఆయన తీసుకున్నారు. హైదరాబాద్‌ ‌హైటెక్‌ ‌సిటీ నిర్మాణం కూడా అందులో భాగమే.ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసు. అయితే, చమురు ధరల విషయంలో రాష్ట్రాలు నోరు మెదపలేని పరిస్థితిని కేంద్రం తీసుకుని వొచ్చింది.

ఇందుకు కారణం రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్ర పథకాల నిధులు వంటి అవసరాల కోసం రాష్ట్రాలు కేంద్రం మీద ఆధారపడి ఉన్నాయి. నిజానికి ఇవి రాష్ట్రాలకు రావల్సిన న్యాయసమ్మతమైన వాటాలే. కానీ మోడీ అధికారంలోకి వొచ్చిన తర్వాత రాష్ట్రాలను నిర్వీర్యం చేశారన్న ఆరోపణ నిరాదారం కాదు. చమురు ధరలు పైపైకి పోతుంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎన్నో అవస్థలకు గురి అవుతున్నారు. ఉద్యోగులలో కనీసం 80 శాతం పైగా సొంత వాహనాలు ఉన్నవారే. వారికొచ్చే ఆదాయంలో అధిక భాగం పెట్రోల్‌ ‌కే సరిపోతోంది.

హైదరాబాద్‌ ‌వంటి మహానగరాల్లో ఉద్యోగాలు చేసే వారు ముప్పయి మైళ్ళ దూరం కూడా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.అలాంటి వారి అవస్థలను పట్టించుకునే ఏలికలు లేరు. చమురును వస్తు,సేవా పన్ను (జిఎస్‌ ‌టి) పరిధిలో చేర్చాలన్న డిమాండ్‌ ‌ను కేంద్రం పెడచెవిన పెడుతోంది.కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయంటూ మంత్రి ఈ మధ్య సెలవిచ్చారు. కొన్ని వ్యతిరేకించినా మెజారిటీ రాష్ట్రాలు సుముఖంగానే ఉన్నాయి కనుక,దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చు.అయితే, ఆదాయ వనరును వదులు కోవడానికి కేంద్రం కానీ, రాష్ట్రాలు కానీ సిద్ధంగా లేవన్నది యథార్ధం.

Leave a Reply