Take a fresh look at your lifestyle.

దారిదీపం వెతుక్కుంటూ ..నేను

‘ముక్కుకు మూతికి కప్పేసిన మాస్కును వీపుమీద ఉన్న ఆక్సిజన్ సిలెండరును సవరించుకుంటూ ఏమి చెప్పాలో తెలియక నీలిగ్రహంలో దారితప్పిన నేను దారిదీపం వెతుక్కుంటూ..శార్వరిలోకి..’

- Advertisement -

మా తాతలు నడయాడిన
మట్టి తివాచీపై ఒదిగిన పచ్చదనంలోకి నే ప్రవహిస్తూ
ఆ ప్రవాహపు ఒరవడిలో
ఆరబోసిన అద్భుత అందాల అడవి అంచు దాటి
చిక్కనవుతున్న నీడల్లోకి ..ఆకుల్లోంచి
తొంగిచూసే భానుకిరణాలను ముద్దాడుతూ
కొండంచున నిలబడి లోయల్లోకేగే
మేఘమాలికలతో చాలనం చేస్తూ నేను

సారవంతమైన సువాసనలు
అడవి మల్లెల గుబాళింపులు
ఒంటి నిండా ఒంపుకుంటూ
ఏటివంకల పరవళ్లతో పరుగెడుతూ నేను

జలపాత సవ్వడులతో
మనసు పురివిప్పిన నెమలై
మావిచివురు తిన్న కోయిలై
ప్రకృతితో పదం కదం కలుపుతూ నేను

చెవుల పిల్లుల చెంగు చెంగు పరుగులు
లేడి పిల్లల బెదురు చూపులు
మిణుగుర్ల కాంతి నిండుగా నింపుకుంటూ
కోతి కొమ్మచ్చులతో పోటీ పడుతూ నేను

ఝంకార నాదాల తుమ్మెదలు
ఇంద్రధనుస్సు రంగుల సీతాకోకలు
చుట్టూ చేరి పలుకరిస్తుంటే వాటినొదిలి
చిటారుకొమ్మన మిఠాయి పొట్లంకోసం నేను

నీలాకాశంలో మెరిసే జాబిల్లినై
విశ్వానికి చల్లని వెన్నెల్లు కురిపించాలని
కలగంటూన్న..నే..జరజరా జారిపోతూ .
చీకటిగుయ్యారంలో కాళ్లు నిగ్గదన్నిన నేను

కరిగిపోతున్న కలల్లోంచి
కాంక్రీటు అరణ్యంలో హెల్ప్ హెల్ప్ ..అరుస్తూ
నన్నాదుకోండి ..నన్నర్ధం చేసుకోండి ..ఆర్థిస్తున్నా
చీకటి రంగుల్లో భీకర నిశ్చబ్దం .., తర్వాత

నింగీ – నేలా
నీరూ – నిప్పూ- గాలీ
నన్నడుగుతున్నాయి ..
మమ్మల్ని ఎప్పుడైనా అర్ధం చేసుకున్నావా ..

ఆదివాసులు
పురుగు పుట్రా
పిట్టా గుట్టా
చెట్టూ చేమా
వాగు వంకా
నదీనదాలు
అడవులరణ్యాలు
నన్ను నిలదీస్తున్నాయి
మా పరాధీన వ్యధను ఎప్పుడైనా విన్నావా

ఈ గుండెల్లో…
ఎన్ని రహస్యాల్ని
ఎన్ని జ్ఞాపకాల్ని
ఎన్ని వైపరీత్యాల్ని ఇముడ్చుకున్నామో..
ఎంత చరిత్రని
ఎంత జ్ఞాన సంపదని పొదివి పట్టుకున్నామో ..
నీకు తెలుసా..నను ప్రశ్నిస్తున్నాయి
అదంతా,
నీ సొత్తు అనుకుంటున్నావ్ .
నాణేనికి మరోవైపు ఎప్పుడైనా ఆలోచించావా ..?

వేటగాడై వల విసిరి
ఈ మట్టిపొరల పరిమళాలను
అంతరాంతరాల్లో పదిలపరుచుకున్న
అనంత సంపదను డేగలా తన్నుకు పోతున్నావ్
అల్లుకుపోయిన ఆత్మీయ బంధాలను ఏమార్చి
వెదురు బద్దను చీల్చినట్టు చీల్చేస్తుంటే
చిక్కి శుష్కించిపోతూ చేస్తున్న ఆర్తనాదాలు
మోగుతున్న చావు డప్పు నీవేనాడైనా విన్నావా..?!

మీ మాయా ప్రపంచపు పోకడల్లో
ఇమడలేక క్షణక్షణం
మేం పడుతున్న ఘర్షణ,
హృదయాంతరాల్లోని వేదన
ఏదో రూపంలో మీ ముందు పరుస్తూనే ..
నీకు ఎరుక చేసే ప్రయత్నం చేస్తూనే
ఆకాశానికి నిచ్చెన వేసే నీ ముందు
నా గోస.. చెవిటి వాడి ముందు శంఖమూది నట్లే ..

జవసత్వాలు పుంజుకోడం కోసం
నిత్యం చేసే పోరాటంలో అలసిపోతూ ..
బిడ్డల్ని పదికాలాలపాటు పచ్చగా
నిలుపుకోవాలన్న ఆరాటం ఆవిరైపోతూ ..
అయినా, ఎన్నాళ్లని, ఎన్నేళ్ళని మీకోసం మేం?
అసలు, మీ కోసం మీరేం చేస్తున్నట్లు..?
కళ్ళుమూసుకుని పాలు తాగే పిల్లులైనప్పుడు
తప్పదుగా.. అంధకారం అనుభవించండి

ఏంటీ ..
పంచభూతాలు నన్ను శపిస్తున్నాయా
ప్రేమనుపంచే తల్లి ఆగ్రహిస్తున్నదా
ఉలిక్కిపడి ఉక్కిరి బిక్కిరవుతూ .. నేను

ముక్కుకు మూతికి కప్పేసిన మాస్కును
వీపుమీద ఉన్న ఆక్సిజన్ సిలెండరును
సవరించుకుంటూ ఏమి చెప్పాలో
తెలియక నీలిగ్రహంలో దారితప్పిన నేను
దారిదీపం వెతుక్కుంటూ..శార్వరిలోకి

వి. శాంతి ప్రబోధ
22. 03. 2020

Leave a Reply