Take a fresh look at your lifestyle.

సుదీర్ఘ పోరాటల ఫలితం.. వ్యవసాయ చట్టాల రద్దు

“సాగు చట్టాల రద్దు ప్రకటనల వరకే పరిమితం కాకుండా శీతాకాలపు పార్లమెంట్ సమావేశాల్లోనే రద్దు చేస్తూ రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర ఎమ్మెస్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధర చట్టము తీసుకు రావాలి. వ్యవసాయ రంగానికి ఇబ్బంది కలిగించేటువంటి నూతన విద్యుత్ చట్టాన్ని , కార్మిక వ్యతిరేక చట్టాలను కూడా ఉపసంహరించుకోవాలి. రైతు ఉద్యమకారులపై అన్ని రకాల కేసులు బేషరతుగా ఉపసంహరించాలి . ఉద్యమంలో అసువులు బాసిన 700 మంది రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు 50 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేర్చాలి.”

పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అని శ్రీశ్రీ అన్నట్లు రైతుల సుదీర్ఘ పోరాట ఫలితంగా గత సంవత్సరం కొరోనా సంక్షోభ కాలంలో అప్రజాస్వామికంగా పార్లమెంటులో చర్చకు పెట్టకుండా 18 రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో వ్యతిరేకించిన మూడు వ్యవసాయ సాగు చట్టాలను అమలులోకి తీసుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. గురునానక్ జయంతి కానుకగా ప్రధాని మోడీ మూడు వ్యవసాయ సాగు చట్టాలను మనస్ఫూర్తిగా వెనక్కి తీసుకుంటున్నామని, వచ్చే శీతాకాలపు సమావేశాల్లో వాటి రద్దు తీర్మానాలు చేస్తామని నిర్ణయం తీసుకోవడం అభినందనీయం…. ఈ రద్దు వెనక 700 మంది అమరుల త్యాగాలు, అలుపెరుగని అవిశ్రాంత సుదీర్ఘ రైతాంగ పోరాటం దాగి వుంది . దేశ వ్యాప్తంగా కొరోనా విలయ తాండవం చేస్తుండగా ఎండనక, వాననక ,చలి అనక రేయింబవళ్ళు తమ వ్యవసాయ పనులను వదిలిపెట్టి, కుటుంబ సభ్యులతో సహా, వయసుడిగిన వారూ ఈ నల్ల చట్టాల రద్దు కోసం దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఉద్యమించడం వల్ల, వారి ఆందోళనకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కష్టాలను దగ్గరుండి చూశాం అని, వారి సంక్షేమం అభివృద్ధి దృష్ట్యా వారిని అన్ని రకాల ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని, ఈ చట్టాల వల్ల రైతులకు ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాలని వేడుకుంటూ ఈ మూడు సాగు చట్టాలు రద్దు నిర్ణయాన్ని సంచలనాత్మకంగా ప్రకటించడం జరిగింది. ఈ సంచలనాత్మక నిర్ణయం వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నను , రైతు సంక్షేమం దృష్ట్యా రద్దు ప్రక్రియను ఆహ్వానించ దగినది. ప్రజాస్వామిక న్యాయం కోసం జరిగిన కర్షకుల అవిశ్రాంత పోరుతో ప్రభుత్వం మడమ తిప్పవలసిన అవసరం వచ్చింది.

గత సంవత్సరం జూన్ 5న మూడు వ్యవసాయ సాగు చట్టాల రూపకల్పన జరిగింది. ఈ సాగు చట్టాల రూపకల్పన క్షేత్రస్థాయిలో రైతు సంఘాలతో, వ్యవసాయరంగ నిపుణులతో, ఆర్థికవేత్తలతో చర్చించకుండా కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఏకపక్షంగా చేయడం, దేశవ్యాప్తంగా కొరోనా విజృంభిస్తున్న సమయంలో 2020, సెప్టెంబర్ 17 మరియు 20 తేదీలలో లోక్ సభ, రాజ్యసభలో వెంట వెంటనే ప్రవేశపెట్టి సరైన రీతిలో చర్చించకుండా తమకున్న సంఖ్యా బలంతో తీవ్ర అభ్యంతరాల మధ్య ఆమోదింపజేసుకొని , సెప్టెంబర్ 27 ,2020న రాష్ట్రపతి ఆమోదం పొంది అవి చట్టాలు అయ్యాయి. వాటిని ప్రతిపక్ష పార్టీల కోరిక మేరకు పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం సెలెక్ట్ కమిటీ పరిశీలనకు కూడా పంపకుండా నూతన వ్యవసాయ చట్టాలు తీసుకురావడంతో రైతుల నిరసనలు పంజాబ్, హర్యానా లో ప్రారంభమై దేశ వ్యాప్తం అయ్యాయి.కొరోనా సంక్షోభంలో ఈ చట్టాలను బలవంతంగా అమలు చేయాలని ప్రయత్నించడం తో రైతులను చావో రేవో అన్నట్లు పోరాటానికి పురిగొల్పింది.

నూతన వ్యవసాయ చట్టాలను రైతులు ఎందుకు వ్యతిరేకించారు?
1) వ్యవసాయ స్వేచ్ఛాయుత మార్కెట్ చట్టం: ఈ చట్టం ప్రకారం రైతులు పండించిన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించింది. అనగా ఎక్కడ ధర ఎక్కువ ఉంటే అక్కడ అమ్ముకోవచ్చు . రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా మీద ఎలాంటి ఆంక్షలు ,టాక్సీ ఉండదు. వన్ నేషన్ వన్ మార్కెట్ అన్నమాట. కానీ దేశంలో బక్కచిక్కిన సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. వారు దూర ప్రాంతాలకు వెళ్లి తమ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం చాలా తక్కువ. ఈ చట్టంలో కనీస మద్దతు ధరకు రక్షణ లేదు. రైతులు తమ పంటలను మార్కెట్ యార్డ్ లో అమ్ము కుంటేనే కనీస మద్దతు ధర చెల్లించడం జరుగుతుంది .కానీ బయట అమ్మడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ధరలను కార్పొరేట్ సంస్థలు నిర్ణయిస్తాయని రైతులు ఆందోళన చెందారు.

2) కాంట్రాక్ట్ ఫార్మింగ్ లేదా ఒప్పంద వ్యవసాయ చట్టం ప్రకారం రైతులు కొంతమందికి బడా కార్పొరేట్ సంస్థల మధ్య ఒప్పందం కుదుర్చుకుని , కార్పొరేట్ సంస్థ చెప్పిన పంటలనే పండించాల్సిన అవసరం, ధరలనుకూడా నిర్ణయించే అధికారం ఆ సంస్థలకే ఉండేవిధంగా చట్టంలో పొందుపరచడం జరిగింది. దీంతో రైతు పంటను పండించే స్వేచ్ఛను , మద్దతు ధర పొందే అవకాశం కోల్పోతాడు. ఈ చట్టం ఆహార భద్రతకు, రైతు స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా ఉంది.

3) నిత్యావసర సరుకుల ధరల సవరణ చట్టం; ఇంతకు ముందున్న చట్టం ప్రకారం ప్రభుత్వం అనుమతించిన పరిమితికి మించి ఆహార ధాన్యాలను, నిత్యావసర సరుకులను ఉంచకూడదు. మార్కెట్లో ధర విపరీతంగా పెరిగిన తర్వాత సరకులను అమ్ముకునే వ్యాపారస్తుల ను నియంత్రించే చట్టం ఇది.కానీ కొత్త చట్టంలో నియంత్రణ అనే అంశాన్ని ఎత్తివేశారు. అనగా వ్యాపారస్తులు తమకు ఇష్టం వచ్చినట్లు నిత్యావసర సరుకులను నిలువ చేసుకోవచ్చు, దీంతో కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉంది. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచితే రైతులు, వినియోగదారుల అయిన ప్రజలు నష్టపోతారు.

ఇలా కర్షక ప్రజావ్యతిరేక చట్టాలను అమలు చేయాలని ప్రయత్నించడంతో గత సంవత్సర కాలంగా మొక్కవోని ధైర్యంతో పట్టుదలతో, అననుకూల వాతావరణ పరిస్థితులలో రైతులు సుదీర్ఘపోరాటం చేయడంతో తప్పనిసరి పరిస్థితులలో ప్రజాగ్రహానికి గురి అవుతున్నామని భావించిన కేంద్రం సాగు చట్టాలను వెనక్కితీసుకునే ప్రయత్నం మొదలు పెట్టింది. రైతు ఉద్యమకారులపై అనేక రకాలుగా దుష్ప్రచారం చేయడం, రోడ్లపై నడవ నీయకుండా మేకులు నాటడం, కందకాలు తవ్వడం, ట్రాక్టర్లను పాడు చేయడం, తప్పుడు కేసులు బనాయించడం, జైల్ల పాలు చేయడం, హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో రైతులపై ఏకంగా భౌతిక దాడులకు ప్రజా ప్రతినిధులు పురిగొల్పడం, లఖింపూర్ సంఘటనలో రైతులపై కారు నడపడం, కాల్పులు జరపడం లాంటి అమానవీయ సంఘటనలు కోకొల్లలుగా జరిగాయి. ఈ నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని తాత్కాలికంగా సాగు చట్టాలపై స్టే విధించడం, సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ నియామకం చేయడం జరిగింది. 12 సార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో, రైతు సంఘాల ప్రతినిధులు చర్చలు జరిపినను అవి విఫలం అయ్యాయి. ప్రభుత్వం ఎన్ని ప్రత్యామ్నాయాలు చూపినను రైతు సంఘాలు రద్దు చేయడమే తప్ప ఏ ప్రత్యామ్నాయానికి లొంగ లేదు. అవసరమైతే 2024 వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తూ ఉద్యమించడం వలన విధిలేని పరిస్థితిలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయక తప్పలేదు. ఈ రద్దు నిర్ణయాన్ని స్వయంగా ప్రధాని ప్రకటిస్తూ 2014లో తాము అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు లక్ష కోట్ల రూపాయలను రైతులకు పరిహారంగా అందించినట్లు, రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇక ముందుకూడా గ్రామీణ మార్కెట్లను బలోపేతం చేస్తామని, 22 కోట్ల భూసార పరీక్షల కార్డులు అందజేస్తామని, రైతులందరికీ ఉపయోగ పడేలా ఫసల్ బీమా యోజన అందిస్తామని తెలిపారు.

తక్కువ ధరలకే నాణ్యమైన కల్తీ లేని విత్తనాలు మరియు ఎరువులు అందజేస్తామన్నారు. ఎన్నికల హామీ ప్రకారం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి తక్షణమే హామీ ఇచ్చిన విషయాలు ప్రకటనల వరకే పరిమితం కాకుండా అమలు చేయాలి. రైతే రాజు, దేశానికి వెన్నెముక అని కీర్తిస్తూనే ధాన్యం కొనుగోలు విషయంలో, కనీస మద్దతు ధర అందించే విషయంలో, పంటల సాగు విధానాన్ని ప్రకటించే విధానంలో స్పష్టత లేకపోవడం వలన రైతులు ధాన్యపు కుప్పల మీదనే ప్రాణాలు వదులుతుండటం విచారకరం. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వాలు సమన్వయంతో చర్చలు జరిపి రైతుల వద్ద నుండి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. వ్యవసాయ చట్టాల రద్దు ప్రక్రియ మొదలుపెట్టి పార్లమెంట్ సమావేశాలలో తీర్మానాలు పొంది తక్షణమే రద్దు చేయాలి. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు లాభదాయక ధరలు అందించేందుకు చట్టబద్ధమైన హామీలు కల్పించాలి. మూడు సాగు చట్టాల రద్దు ప్రకటనల వరకే పరిమితం కాకుండా శీతాకాలపు పార్లమెంట్ సమావేశాల్లోనే రద్దు చేస్తూ రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర ఎమ్మెస్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధర చట్టము తీసుకు రావాలి.

వ్యవసాయ రంగానికి ఇబ్బంది కలిగించేటువంటి నూతన విద్యుత్ చట్టాన్ని , కార్మిక వ్యతిరేక చట్టాలను కూడా ఉపసంహరించుకోవాలి. రైతు ఉద్యమకారులపై అన్ని రకాల కేసులు బేషరతుగా ఉపసంహరించాలి . ఉద్యమంలో అసువులు బాసిన 700 మంది రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు 50 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేర్చాలి. లేనిచో ప్రజాస్వామిక ప్రజా ఉద్యమాలకు తల్లోగ్గాల్సిందే … ఎన్నికల లబ్ధి కోసమే కంటితుడుపు చర్యగా వ్యవహరిస్తే రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రజాస్వామిక ఆకాంక్షల కోసం, న్యాయబద్ధమైన విధానాల కొరకు పోరాడుతున్న ప్రజా ఉద్యమాలను ఆపడం సాధ్యం కాదని, మహోన్నత రైతాంగ పోరాటం రుజువు చేసింది. రైతుల సంఘటిత పోరాట ఫలితమే ఈ చారిత్రాత్మక విజయం.
జై జవాన్, జై కిసాన్..

tanda-sadhanandha
– తండా సదానందం, టీపీటిఏఫ్‌ ‌జిల్లాఉపాధ్యక్షుడు, మహబూబాబాద్‌ ‌జిల్లా

Leave a Reply