Take a fresh look at your lifestyle.

మే 29 వరకూ లాక్‌డౌన్‌

  • అన్నీ జోన్లలోనూ మద్యం విక్రయాలకు అనుమతి
  • 25 వేల మంది వైద్యులు, పారామెడికల్‌ ‌సిబ్బంది సిద్ధం
  • ఆర్టీఏ కార్యాలయాలు యధావిధిగా పనిచేసుకోవచ్చు
  • న్యాయవాదులను ఆదుకునేందుకు రూ. 25 కోట్లు
  • వలస కార్మికులు రాష్ట్రంలో ఉంటేనే మంచిది
  • రాత్రి 7 తరువాత కనిపిస్తే కఠిన చర్యలు : సీఎం కేసీఆర్‌ 

కొరోనా నియంత్రణకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మే 29 వరకూ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించారు. ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలంటే లాక్‌డౌన్‌ ఒక్కటే ఆయుధమనీ, అందుకే ఎవరికి కోపం వచ్చినా లాక్‌డౌన్‌ ‌పొడిగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సరిహద్దు రాష్ట్రాలు ఏపి, కర్నాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌లలో మద్యం దుకాణాలు తెరుచుకున్నందున రాష్ట్రంలో కూడా తెరువక తప్పని పరిస్థితి ఏర్పడిందని అందుకే మద్యం విక్రయాలకు అనుమతినిస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న రాత్రి పూట కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుందనీ, రాత్రి 7 తరువాత ఎవరు కనిపించినా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. రెడ్‌ ‌జోన్లలో గృహనిర్మాణానికి సంబంధించి సిమెంటు, ఎలక్ట్రికల్‌ ‌దుకాణాలతో పాటు వ్యవసాయ సామాగ్రికి సంబంధించిన దుకాణాలను తెరవడానికి అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. ఈనెల 15 వరకు రెడ్‌జోన్ల పరిధిలో ఉన్న 6 జిల్లాలలో పరిస్థితిని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి అందులో పరిస్థితిని సమీక్షించి అందుకు అనుగుణంగా తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆరెంజ్‌, ‌గ్రీన్‌ ‌జోన్లలో మిగతా అన్ని దుకాణాలకు అనుమతినిస్తున్నట్లు చెప్పారు. మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలలో ఏ దుకాణమైనా తెరుచురోవడానికి అనుమతి ఉందని చెప్పారు. మంగళవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో లాక్‌డౌన్‌ ‌కొనసాగింపు, ప్రస్తుత పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ ‌మీడియా సమావేశంలో మాట్లాడారు.

భవిష్యత్తులో కొరోనాతో కలసి జీవించాల్సిందేననీ, బతికి బట్టకట్టాలంటే కఠిన నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. కొరోనా కనిపించని శత్రువనీ, దీనికి ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ ‌లేదనీ, లాక్‌డౌన్‌ అనే ఆయుధాన్ని పాటించి ప్రజలంతా సహకరించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.దేశంలోనే కరీంనగర్‌ ‌తొలి కంటైన్మెంట్‌ ‌జోన్‌ అనీ, అక్కడ తీసుకున్న కఠిన నిర్ణయాల కారణంగా ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోగలిగామని చెప్పారు. హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణలో సూర్యాపేట, వరంగల్‌ అర్బన్‌, ‌వికారాబాద్‌, ‌మేద్చల్‌,‌రంగారెడ్డి, హైదరాబాథ్‌ ‌జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయనీ, యాదాద్రి, వరంగల్‌ ‌రూరల్‌, ‌వనపర్తి, భద్రాద్రి, సిద్దిపేట, ములుగు, మహబూబాబాద్‌, ‌నాగర్‌కర్నూలు, పెద్దపల్లి జిల్లాలు గ్రీన్‌జోన్లో ఉన్నాయని చెప్పారు.అలాగే, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, ‌మెదక్‌, ‌భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, ‌జగిత్యాల, మంచిర్యాల, నారాయణపేట, సిరిసిల్ల, నల్గొండ, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ‌ఖమ్మం, జనగామ,కుమ్రం భీం, నిర్మల్‌, ‌గద్వాల ఆరెంజ్‌ ‌జోన్లో ఉన్నాయని చెప్పారు. వచ్చే 18 రోజుల్లో చాలా జిల్లాలు గ్రీన్‌జోన్లో ఉన్నాయనీ, ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్ ‌తీసుకోలేమని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా జూనియర్‌ ‌న్యాయవాదులను ఆదుకునేందుకు రూ. 25 కోట్లను కేటాయిస్తున్నామనీ, అందులో భాగంగా తొలి విడతగా రూ. 15 కోట్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా అందజేస్తామని చెప్పారు. రెడ్‌ ‌జోన్లో ఉన్న హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, మేడ్చల్‌, ‌వికారాబాద్‌ ‌జిల్లాలలో ఇకపై కూడా కఠిన నిబంధనలు అమలు చేస్తామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొరోనా కేసుల సంఖ్య 1096కు చేరిందనీ, కొత్తగా మంగళవారం 11 కేసుల వచ్చాయని చెప్పారు. 439 మంది వైద్య చికిత్సలు తీసుకుంటున్నారనీ, 43 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని చెప్పారు. రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న వలస కార్మికులకు పూర్తి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. అయితే, ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు తమ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులను రప్పించుకునేందుకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన దృష్ట్యా వారిని ఇక్కడే ఉండమని కోరుతున్నామని చెప్పారు. అయితే, తమ సొంత రాష్ట్రానికి వెళ్లాలని నిర్ణయించుకుంటే పరిస్థితి ఆధారంగా వారిని తమ రాష్ట్రాలకు పంపిస్తామని చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలోని లేని విధంగా రైతులు పండించిన ప్రతీ పంటనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. రైతులు ప్రతిపక్షాల మాటలు విని రాజకీయాలు చేస్తే నష్టపోయేది రైతులేననే విషయాన్ని గ్రహించాలని కోరారు.

Leave a Reply