Take a fresh look at your lifestyle.

లాక్‌ ‌డౌన్‌ ‌కష్టాలు అన్నీ ఇన్నీ కావు

లాక్‌ ‌డౌన్‌ ‌కష్టాలు అన్నీ ఇన్నీ కావు. స్వీయ నియంత్రణను పాటించే స్పృహను జనంలో కలిగించేందుకు లాక్‌ ‌డౌన్‌ ఉపయోగపడుతుం దనడంలో సందేహం లేదు. అదే సందర్భంలో లాక్‌ ‌డౌన్‌ ‌మరో పార్శ్వాన్ని పరిశీలిస్తే ప్రజల దైనందిన జీవనం ఎంత దుర్భరంగా ఉందో స్పష్టం అవుతుంది. తెల్లవారగానే నిత్యావసరాలను సమకూర్చుకోవడం సామాన్యులకు పెను సవాల్‌గా తయారైంది. శ్రీమంతులు, ఎగువ మధ్యతరగతి వర్గాలకు అందుతున్న సదుపాయాలు బడుగు, నిరుపేద వర్గాలకు అందడం లేదు. రాజకీయ నాయకులు, మంత్రులు అంతా ఈ వర్గాలపై సానుభూతి ఒలకబోయడంలో ముందుంటున్నారు కానీ, వారికి నిత్యావసరాలను అందించే ఏర్పాట్లు చేయలేకపోతున్నారు. ఇందుకు లబ్దిదారుల్లో అచేతనత్వం, అత్యాశ కూడా కారణం అవుతున్నాయి. వలస కూలీల పరిస్థితి త్రిశంకు స్వర్గంలో ఉంది. అసలు వారి గురించి పట్టించుకున్న వారే లేరు. వలస కూలీలకు భోజనాలు ఏర్పాటు చేసేశామంటూ ఫొటోలు మీడియాకు పంపడంతో తమ పని అయి పోయిందని భావించేవారిని అనేక మందిని చూస్తున్నాం. ఆకలితో ఉన్న వారికి ఒక పూట తిండి పెట్టడం నిజంగా గొప్ప విషయమే. వారికి శాశ్వత పునరావాసాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అధికారులు, పోలీసులు ఎంతో శ్రమిస్తున్న మాట నిజమే. అయితే, వారి మధ్య సమన్వయం లోపిస్తోందన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. ప్రభుత్వం కూడా లక్షలాది రూపాయిలు విడుదల చేసేశామని చెప్పుకోవడం తప్ప అవి సక్రమంగా ఖర్చవుతున్నాయో లేదో పర్యవేక్షణ జరిపించడం లేదు. తూర్పు, ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో ఈ విషయంలో పరిస్థితి కొంత మెరుగే. బీహార్‌, ‌జార్ఖండ్‌, ‌మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రాల్లో వలస కార్మికుల జీవనం దుర్భరంగా ఉందని మొబైల్‌ ‌వాణి పేరిట విలేఖరుల బృందం నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

- Advertisement -

బీహార్‌లో ఉచిత రేషన్‌కి అర్హులైన వారిలో 90 శాతం మందికి రేషన్‌ అం‌దడం లేదని సర్వేలో వెల్లడైంది. అలాగే, భారతీయ జనతాపార్టీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి అధికారంలోకి వచ్చిన మధ్యప్రదేశ్‌లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అంతా అధికారుల పర్యవేక్షణలోనే సాగుతోంది. ఈ మూడు రాష్ట్రాల్లో బడుగు వర్గాల్లో 60 శాతం మంది తమకు పంపిణీ కావల్సిన రేషన్‌ అం‌దడం లేదని ఫిర్యాదు చేశారు. వలస కార్మికుల గురించి కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ పలు సార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వలస కార్మికులకు శాశ్వతమైన ఆవాసాలు ఉండవు. వారు తమ శిబిరాలనుంచి బయటికి వస్తే పోలీసులు పట్టుకుని ప్రశ్నిస్తున్నారు. వారి వద్ద శాశ్వతమైన చిరునామాగల గుర్తింపు కార్డులు ఉండనందున పోలీసులు వారిని ప్రశ్నల వర్షంతోనూ, మరోవిధంగానూ వేధిస్తున్నారు. మొదట ఏప్రిల్‌ 14‌వ తేదీన వరకూ విదించిన లాక్‌ ‌డౌన్‌ను మే మూడు వరకూ కేంద్రం పొడిగిస్తే, తెలంగాణ ప్రభుత్వం మే 7వ తేదీ వరకూ పొడిగించింది. కొరోనా వ్యాప్తిని నిరోధించడానికే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉండవచ్చు. కానీ, అసంఘటితరంగ, వలస కార్మికులు, దినసరి వేతనాలతో జీవనం సాగించేవారి సంగతిని ప్రభుత్వం మరింత సీరియస్‌గా తీసుకోవాలి. లేని పక్షంలో వారి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అవుతుంది. వలస కార్మికుల సమస్యలను గురించి పట్టించుకునే వారు లేరు. వలస కార్మికుల వల్ల కొరోనా వ్యాప్తి చెందు తోందన్నది అర్థ సత్యం. వారిపై అపోహలను సృష్టించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. లాక్‌ ‌డౌన్‌ ‌నియమనిబంధనలు అమలు చేయడంలో కేరళ, బెంగాల్‌ ‌వంటి రాష్ట్రాలు విఫలమవుతున్నట్టు కేంద్రం గుర్తించింది. ఈ రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. కేంద్రం విధించిన నియమనిబంధనలను అమలు జేయడంలో ఈ రాష్ట్రాలు కలిసి రావాలని ఇప్పటికే కేంద్ర హోం శాఖ విజ్ఞప్తి చేసింది. లాక్‌ ‌డౌన్‌ ‌కాలపరిమితి పూర్తి అయ్యేవరకూ అన్ని వర్గాలు కలిసికట్టుగా కృషి చేసినప్పుడే కేంద్రం తీసుకుంటున్న చర్యలు ప్రతిఫలిస్తాయి. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కొరోనా మరణాలు తక్కువే. కేంద్రం మొదటి నుంచి తీసుకుంటున్న జాగ్రత్తలే ఇందుకు కారణం.

Leave a Reply