Take a fresh look at your lifestyle.

లాక్‌ ‌డౌన్‌ – ‌తగ్గుతున్న పాజిటివ్‌ ‌కేసులు ..!

ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ‌ప్రకటించడంతో భారీ ముప్పు తప్పిందనే చెప్పోచ్చు. లాక్‌డౌన్‌ ‌విధించడానికి ముందు రాష్ట్రంలో పాజిటివ్‌ ‌కేసులు విపరీతంగా పెరుగుతూ వొచ్చాయి. ఒక  దశలో ఒక్క రోజులో పదివేల పాజిటివ్‌ ‌కేసులు నమోదైన సందర్భంకూడా లేకపోలేదు. హాస్పిటల్స్  అన్నీ  పాజిటివ్‌ ‌పేషంట్లతో కిటకిటలాడాయి. పేషంట్లను చేర్చుకునే పరిస్థితి లేకపోవడంతో హాస్పిటల్స్  ‌చుట్టు తిరిగి అంబులెన్స్‌లోనే తమ చివరి క్షణాలను వొదిలిన సందర్భాలు ఏర్పడ్డాయి. అయినా లాక్‌డౌన్‌ ‌విధించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం  చేసింది.

చివరకు న్యాయస్థానం కూడా ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టాల్సి వొచ్చింది. అప్పుడుగాని రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ‌పై నిర్ణయం తీసుకోలేదు. ఏదైతేనేమి మే 12 నుండి పదిరోజులపాటు లాక్‌డౌన్‌ ‌రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత మే 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అంతకు ముందు రాష్ట్రంలో రోజూ నాలుగైదువేలు దాటుతున్న పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య అయితే తగ్గుముఖం పట్టినట్లు లెక్కలు చెబుతున్నాయి.  ప్రస్తుతం రెండు నుండి మూడు వేల మధ్య నే పాజిటివ్‌ ‌కేసులు నమోదు అవుతుండడం కేసులు తగ్గుముఖం పడుతున్న సంకేతాలనిస్తున్నాయి. ఈ రెండు మూడు వేల సంఖ్యకూడా తగ్గాలంటే మరికొన్ని రోజులు ఈ లాక్‌డౌన్‌ను పొడిగించడమే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో ఆరు రోజుల్లో పొడిగించిన లాక్‌డౌన్‌ ‌సమయంకూడా దాటిపోనుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు.

ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు అంటే కేవలం నాలుగు గంటలపాటు ప్రజలు నిత్యావసర సరుకులను కొనుగోలు చేసుకోవడానికి వెసులుబాటు కలిపించి మిగతా సమయమంతా ఇండ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది. అయితే మొదటి దశలో పదిరోజులపాటు విధించిన లాక్‌డౌన్‌లో ప్రజలు ఈ నిబంధనలను పాటించకుండా విచ్చలవిడిగా తిరగడంతో పాజిటివ్‌ ‌కేసుల సంఖ్యకూడా పెరుగుతూ వచ్చాయి. దీంతో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు సిబ్బంది నిబంధనలు కఠినంగా అమలు చేయడం ప్రారంభించింది. రాష్ట్రం లోపల నే  కాకుండా, రాష్ట్ర సరిహద్దులను కూడా మూసివేసింది.

అత్యవసరం అయితే, అందుకు సరైన ఆధారాలు చూపిస్తేనే రాష్ట్రంలోకి  రానిస్తున్నారు.  రాష్ట్రంలో కూడా అనవసరంగా ఇళ్ళనుండి  బయటికి వొచ్చినవారిపై లాఠీ ప్రయోగాలు చేయడం, వారి వాహనాలను సీజ్‌ ‌చేయడం ప్రారంభించారు. ఆ విధంగా ద్విచక్ర, భారీ వాహనాలు లాక్‌డౌన్‌ ‌మొదలైనప్పటినుండి ఇరవై వేలకు పైగా వాహనాలు  పోలీసులు సీజ్‌ ‌చేశారు. అంతేకాదు. మాస్క్ ‌పెట్టుకోకుండా తిరిగిన దాదాపు ఆరువేల మంది నుండి జుర్మానా కూడా వసూలు చేశారు. ఒక వైపు లాక్‌డౌన్‌ అమలులో ఉండగా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో  ఇంటింటా ఫివర్‌ ‌సర్వే నిర్వహించడంకూడా హాస్పిటల్స్  ‌పై వొత్తిడి తగ్గడానికి కారణంగా మారిందనే చెప్పవచ్చు. కొద్దిపాటి జ్వరం వొచ్చినా భయపడి హాస్పిటల్స్  ‌కు పరుగుపెట్టె  జనాన్ని ఈ సర్వే కొంతవరకు తగ్గించిందనే చెప్పాలె.

రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ సర్వేలో ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఎనభై లక్షల కుటుంబాల్లో సర్వే నిర్వహించగా వారిలో లక్షా 88వేల మందికి పాజిటివ్‌ ‌లక్షణాలున్నట్లు తేలింది. అయితే ఈ సర్వే బృందాలు  వారికి మెడికల్‌ ‌కిట్లను అందజేయడం, కావల్సినవారిని ఐసోలేషన్‌లో ఉండమని చెప్పడం వల్ల వీరంతా ఆందోళనతో  హాస్పిటల్స్  ‌బాట పట్టడం తప్పింది. కాగా, ఇప్పుడు రెండవ దశ ఫివర్‌ ‌సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించ నుంది కూడా. ఇలాంటి పరిస్థితిలో లాక్‌డౌన్‌ ‌పొడిగించడమా, రిలాక్షేషన్‌ ఇవ్వడమా లేక నైట్‌ ‌కర్ఫ్యూను విధిస్తారా అన్న విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఈ వారంరోజుల్లో వొచ్చే పాజిటివ్‌ ‌కేసులపై ఉంటుందనుకుంటున్నారు.

కొరోనా మొదటిదశలో విధించిన లాక్‌డౌన్‌వల్ల ప్రజలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థికంగా నష్టపోయింది. ఆ కారణంగానే రెండవ దశ కొరోనా తీవ్రతరంగా మారినప్పటికీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ‌విధించడానికి  వెనుకాముందాడింది. కాని తప్పని పరిస్థితిలో లాక్‌డౌన్‌ ‌పెట్టక తప్పలేదు. దీనివల్ల సత్ఫలితం కనిపిస్తున్నప్పటికీ కేవలం ఉదయం నాలుగు గంటల పాటు మాత్రమే సడలింపు ఉండడంతో రోజు వారీ కూలీలు, చిరు వ్యాపారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరెంటు పనులు చేసుకునేవారు, మోటర్‌ ‌మెకానిక్‌లు, టైలర్స్ ఇలా రోజూ ఏదో పనిచేసుకుంటేగాని పూటగడవని అనేకులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మరికొంత సమయం సడలింపు కల్పించే అవకాశం కనిపిస్తుంది..  కాని పక్షంలో మరో వారం పదిరోజులకు మించి లాక్‌డౌన్‌ ‌పొడిగించకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply