Take a fresh look at your lifestyle.

లాక్‌ ‌డౌన్‌ ‌మరింత.. కఠినతరం..!

  • మానవీయ కోణంలో వలస కార్మికుల తరలింపు
  • కేంద్ర హోమ్‌శాఖసహాయమంత్రి కిషన్‌రెడ్డి

దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తర్వాత వచ్చిన ఏకాభిప్రాయం మేరకు లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగించామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి కిషన్‌రెడ్డి శనివారం తెలిపారు. రాష్ట్రాలతో కలిసి కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నామని, రాష్ట్రాలు ఇచ్చే సమాచారం ఆధారంగానే జోన్ల వర్గీకరణ జరిగిందని, దేశవ్యాప్తంగా 130 రెడ్‌ ‌జోన్‌ ‌లు, 284 ఆరెంజ్‌ ‌జోన్‌ ‌లు, 319 గ్రీన్‌ ‌జోన్‌ ‌లు ఉన్నాయని, రెడ్‌ ‌జోన్‌ ‌ప్రాంతాల్లో ఇకపై లాక్‌డౌన్‌ ‌మరింత కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను నిర్దేశించామని కిషన్‌ ‌రెడ్డి చెప్పారు. కంటైన్‌మెంట్‌ ‌జోన్లలో కర్ఫ్యూ తరహా వాతావరణం ఉండాలని, వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధించాలని, మంత్రి అన్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,290 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి అని, దేశంలో 26 జిల్లాల్లో 28 రోజులుగా ఒక్క కేసూ కూడా నమోదు కాలేదని, 40 జిల్లాల్లో గత 21 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని మంత్రి తెలిపారు. కొత్త కేసులు వస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రజలకు కొన్ని వెసులుబాట్లు కలిగేలా విధివిధానాలు చేశామని మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలిపారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో 2.52 లక్షల పడకలు, 27వేల ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయని, 2.22లక్షల పీపీఈ కిట్లను సేకరించాలని నిర్ణయించామని, 30కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ‌మాత్రలు సిద్ధం చేస్తున్నామని, కిషన్‌ ‌రెడ్డి వివరించారు. వలస కార్మికుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచన చేస్తోందన్నారు.

దీనిలో భాగంగానే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు 12వేల కోట్లు అందించామని మంత్రి వెల్లడించారు. స్వంత రాష్ట్రాలకు వెళ్లాలనే వలసకార్మికుల కోసం నిన్న ఒక్క రోజే ఆరు రైళ్లు నడిపామని, దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకు పోయిన వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు, యాత్రీకులను తరలింపులో కేంద్రం, ఆయా రాష్ట్రాలకు పూర్తి సహాయ, సహకారాలు కేంద్రం అందిస్తుందని తెలిపారు. ఎవరిని తరలించాలో రాష్ట్ర ప్రభుత్వ నోడల్‌ అధికారులే గుర్తిస్తారు, వలస కార్మికులు ఉన్న చోటుకే బస్సులు వచ్చి తీసుకెళ్తాయి, ‘‘ఎవరూ రైల్వే స్టేషన్‌లోకి రావొద్దు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని, రాష్ట్రాలు ఎన్ని రైళ్లు కోరితే అన్ని రైళ్లు కేటాయిస్తాం’’, అని మంత్రి స్పష్టం చేశారు. దూరంతో సంబంధం లేకుండా టిక్కెట్‌ ‌ధర కేవలం 50 రూపాయలు నిర్ణయించామని, టిక్కెట్‌ ‌ధరను రాష్ట్ర ప్రభుత్వం లేదా పనిచేసే కంపెనీలే చెల్లించాలన్నారు. కూలీల తరలింపు కోసం 300 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని’’ కిషన్‌ ‌రెడ్డి తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!