Take a fresh look at your lifestyle.

లాక్‌ ‌డౌన్‌ – ‌నినాదమా..? విధానమా..!

” అప్పుడేమో  కనీసం వలస కార్మికులు కూడా సర్దుకునేందుకు అవకాశం ఇవ్వకుండా అగమేఘాల మీద లాక్‌ ‌డౌన్‌ ‌విధించి దేశానికి తాళం వేశారు. ఇప్పుడేమో 130 కోట్ల జనాభా ప్రాణాల్ని రిస్క్‌లో పెట్టి ఉన్నవన్నీ సడలించడం ఎంత వరకు న్యాయం..? మొదటిసారి లాక్‌ ‌డౌన్‌ ‌విధించినప్పుడు దేశంలో కేవలం 400 మంది కరోనా రోగులు ఉండేవారు. ఇప్పుడు రోజుకు అయిదు వేల చొప్పున పెరుగుతున్నారు. మరి అప్పుడు లాక్‌ ‌డౌన్‌ ‌విధించి, ఇప్పుడు ఏం గొప్ప మార్పులు వచ్చాయనీ, ఏ రకంగా కరోనా కట్టడి అయిందని సడలింపులు ఇస్తున్నారు..? విశ్వవ్యాప్తంగా మానవజాతితో మారణహోమం చేస్తున్న కరోనా పరివ్యాప్తి గురించి అంచనా వేయడంలో భారత ప్రభుత్వం విఫలమైందని అనుకోవాలా..? ఇప్పుడేమో, దేశ ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి యావత్‌ ‌ప్రజలందరినీ కరోనాకు కానుకగా ఇవ్వబోతున్నారా..?  “

మేరే ప్యారే దేశ్‌ ‌వాసియో…!’

టెలివిజన్‌పై ఈ గొంతు వినగానే గుండెల్లో ఏదో గుబులు మొదలవుతుంది. ఏం వినాల్సి వస్తుందో, రేపట్నుండి మన జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయోనని వెన్నుపూస వణుకుతుంది. మొదటిసారి ఈ వణుకుకు బీజం నవంబర్‌ 2016‌లో పడింది. ‘ఆజ్‌ ‌రాత్‌ ‌ఠీక్‌ 12 ‌బజేకే బాద్‌…’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించగానే, భక్తులు తప్ప ఎక్కువ శాతం ప్రజలు ఏదో జరగబోతోందని లోలోన కదిలిపోయారు. ‘నల్లదనం నిర్మూలనకు, పెద్ద నోట్ల రద్దుకు ఏం సంబంధం చెప్మా..’ అని అమాయక జనం నొసలు చిట్లించినా, ‘చూద్దాం.. దేశానికి ఏదైనా మంచి జరుగుతుందేమోనని..’ ఓపికపట్టారు. ఆ తర్వాత భారతీయుల జీవితాలు ఎలా మలుపుతిరిగాయో, దేశం ఎంత అల్లకల్లోలం అయిందో అందరికీ తెలిసిందే.. ఆనాటి గాయాలు ఇంకా మాననే లేదు. ఎందరు చనిపోయారో, ఎన్ని పెళ్ళిల్లు ఆగిపోయాయో, జనజీవితాలు మొత్తం బ్యాంక్‌ల ముందు ఎలా క్యూలో నలిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నల్లదనం ఏ మాత్రం తెల్లగా మారిందో తెలియదు కానీ, అదొక మరుపురాని గాయంగా భారతీయుల మదిలో నిలిచిపోయింది.

ఆ తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ రాత్రిపూట టెలివిజన్‌ ‌తెరపైకి వచ్చి దేశాన్ని సంబోధిస్తాడని ఎప్పుడు ప్రచారం జరిగినా, అదురుతున్న గుండెలతో, శ్వాసను ఆపుకొని, ఆసక్తిగా ఏం చెబుతారోననీ ఎదిరిచూడడం జనాలకు అలవాటైంది. ప్రధానమంత్రిగారి వ్యవహార శైలి, నిర్ణయాలు తీసుకోవడంలో చూపించే ఆ చొరవ, ఒక రకమైన తెగింపు… ఇవన్నీ ప్రజల్ని ఆశ్చర్యచకితుల్ని చేసేవే..! గతంలో ఏనాడూ చూడనివే..! ఇంతలో కరోనా వచ్చేసింది. మొదట చైనాలో మొలకెత్తి, క్రమక్రమంగా విషవృక్షంగా మారి, వందలాది మందిని పొట్టనబెట్టుకున్న తర్వాత, అది ఇతర దేశాల వైపు తొంగిచూసింది. ఆయా దేశాల్లోని జనజీవితాలతో చెడుగుడు ఆడుకుంటున్నప్పటికీ మన దేశ ప్రభుత్వ విధాన నిర్మాతలు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. గాలి మోటర్ల మీద దాదాపు 15 లక్షల మంది ప్రయాణీకులు విదేశాల నుండి స్వదేశానికి రావడానికి పూల దారుల్ని అలంకరించి స్వాగతించారు. ఎవరెవరి దేహాలు కరోనా వాహకాలుగా మారాయో తెలియదు కానీ మన దేశంలోకి కూడా కరోనా చిరుదరహాసంతో అడుగులు మోపింది. మెల్లిమెల్లిగా దేశంలో అక్కడక్కడ కరోనా కదలికలు మొదలయ్యాయి. అప్పుడు ప్రభుత్వంలో కాస్త చలనం కలిగింది. అప్పుడప్పుడే ప్రభుత్వ ప్రకటనల ద్వారా, మీడియా వార్తల ద్వారా కరోనా బీభత్సాన్ని గురించి ప్రజలు తెలుసుకుంటున్న సందర్భం. విపరీతమైన ప్రచారం వల్ల, సోషల్‌ ‌మీడియాలో కరోనాకు చెందిన క్రూరమైన, ఘోరమైన కథనాల వల్ల భారతీయులు భయపడిపోతున్న తరుణమది. వందల మంది రోగులు, ఒకరిద్దరి చావులు కూడా అప్పుడే తాజాగా ఈ దేశం నమోదు చేసుకొంది. కరోనా గురించి ప్రజలు కూడా అప్రమత్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం 22 మార్చ్ ‌నాడు ‘జనతా కర్ఫ్యూ’ ప్రకటించింది. దేశ ప్రజలంతా ముక్తకంఠంతో ఆ నిర్ణయాన్ని ఆమోదించారు. నూటికి వంద శాతం ఆ జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. అదే రోజు రాత్రి.. మళ్ళీ అదే కంఠం ఠంగుమంది..

‘మేరే ప్యారే దేశ్‌ ‌వాసియో….!’
దేశం మొత్తం బుల్లితెరను అల్లుకుపోయింది. ప్రధాని మోదీపై ఏదో అచంచల విశ్వాసం. ఈ దేశాన్ని కరోనా మహమ్మారి నుండి తప్పకుండా కాపాడతాడనే ప్రగాఢ విశ్వాసం. ప్రధానిగారు కరోనా లక్షణాల గురించి, విజృంభణ గురించి సవిస్తారంగా వివరించి, ‘ఆజ్‌ ‌రాత్‌ ‌ఠీక్‌ 12 ‌బజే సే…!’ అంటూ దేశ కదలికలన్నిటిని బంధించేశారు. ప్రజలు కూడా ఆ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతించారు. తెల్లారి నుండి ఎక్కడ చూసినా కరోనా ముచ్చట్లే.. ఎవరి నోట విన్నా కరోనా కథలే.. భయం.. భయం.. దేశమంతా భయంభయంగానే బతకసాగింది. మరోవైపు కరోనా రోగుల సంఖ్య పెరగసాగింది. లాక్‌ ‌డౌన్‌ ‌మరింతా పకడ్బందీగా కొనసాగేలా పోలీసులు రంగంలోకి దిగారు. ప్రజలంతా లాక్‌ ‌డౌన్‌ ఉం‌టేనే బతగ్గలం అనే నిర్ణయానికి వచ్చేసారు. ‘కేవలం లాక్‌ ‌డౌన్‌ ఒక్కటే కరోనా కనెక్షన్‌ను కట్‌ ‌చేస్తుందని, లాక్‌ ‌డౌన్‌ ‌తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని..’ ప్రభుత్వాలు కూడా ఊదరగొట్టాయి. అప్పటికే ప్రపంచం మొత్తం కరోనా గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. ఆయా దేశాల నుండి వస్తున్న వార్తలు విని, మన దేశ ప్రజలు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురికాసాగారు. ప్రధాని సకాలంలో లాక్‌ ‌డౌన్‌ ‌విధించడాన్ని భారతీయులు ఒక శాస్త్రీయ చర్యగా భావించి అభినందించారు. మోదీగారి నిర్ణయం వల్లే దేశం కరోనాను కట్టడి చేయగలిగిందని, పైకి చెప్పకపోయినా, లోలోన మురిసిపోయారు. చప్పట్లు కొట్టమంటే కొట్టారు. దీపాలు వెలిగించమంటే వెలిగించారు.. ఒక వారం తర్వాత క్రమక్రమంగా దైనందిన ఇబ్బందులు మొలకెత్తసాగాయి. పాల కష్టాలు, కూరగాయల కష్టాలు, రేషన్‌ ‌కష్టాలు మొదలయ్యాయి. కరోనేతర రోగాల చికిత్సలు నిలిచిపోయాయి. రవాణా సౌకర్యాలు మూతబడ్డాయి. లాక్‌ ‌డౌను పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు అంకిత భావంతో రోజుకి 24 గంటలు కష్టించి పనిచేయసాగారు. అక్కడక్కడ జనాలను రక్షించే ప్రయత్నంలో లాఠీతో శిక్షించారు కూడా..! ప్రధాన మంత్రితో పాటు ముఖ్యమంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం, మీడియా, సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు లాక్‌ ‌డౌన్‌ ‌పాటించాలనీ, కరోనాను అరికట్టాలనీ ప్రబోధించసాగారు.

కానీ, ఇంతలో ఏ ఒక్కరూ ఊహించని మరోకోణం బహికృతమైంది. దీన్ని ఏ శాసనకర్త కానీ, ఏ సామాజిక మేధావి కానీ, ఏ ప్రభుత్వాధినేత కానీ ఊహించని విపత్తు ఇది. దేశ ప్రగతి డొల్లతనాన్ని బట్టబయలు చేసిన ఉదంతమిది. అదే వలస కార్మికుల కాలి నడక..! వందలు, వేలు, లక్షల మంది వలస కార్మికులు దేశ దారుల్లో చెమట చుక్కల్ని దారపోయసాగారు. పిల్లాజెల్లా, ముల్లే మూటా సర్దుకొని, రాత్రనక, పగలనక నడవ సాగారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడుతున్నామనీ, అతి త్వరలో దేశం విశ్వగురువుగా చెలామణి కానుందని చేసుకున్న ప్రచారాల నగ్నత్వం బయటపడసాగింది. కాశ్మీర్‌ ‌నుండి కన్యాకుమారి వరకు ఈ వలస కార్మికులు సాగిస్తున్న ఈ మహాప్రస్థానం దేశాధినేతల దివాళాకోరుతనాన్ని ఎలుగెత్తి చాటుతోంది. మహిళలు, వృద్ధులు, పిల్లలు నానా యాతనలు పడుతున్నారు. దారుల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయి. దారుల్లోనే మరణాలు సంభవిస్తున్నాయి. జాతీయ రహదారులన్నీ వలస కార్మికుల గోసలతో నిండిపోతున్నాయి. అన్నం లేదు. నీళ్ళు లేవు. ఏ ఒక్కరి ఆసరా లేదు. నడవడమొక్కటే లక్ష్యం. ఊరికి చేరుకోవడమొక్కటే గమ్యం. ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.. ఏ ఒక్కరిలో చలనం లేదు. వాళ్ళ గోసకు వాళ్ళను వదిలివేసిన దీనగాథ హృదయాల్ని కలిచివేస్తోంది. అయినా ఆ వలసజీవులు నోరు మెదపడం లేదు. ఏ ప్రభుత్వాన్ని నిందించడం లేదు. నడక .. నడక.. నడక..! జీవితాన్నే నడక చేసుకొని సొంతింటికి చేరాలనుకుంటున్నారు. అయినా లాక్‌డౌన్‌ను ఎవరూ వ్యతిరేకించలేదు. ఒకటి తర్వాత ఒకటి… లాక్‌డౌన్‌ల సంఖ్యలు పెరుగుతూనే పోయాయి.. లాక్‌డౌన్‌లతో పాటు దేశంలో కరోనా బాధితుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది.

అకస్మాత్తుగా ప్రభుత్వాలు యూటర్న్ ‌తీసుకున్నాయి. ‘కరోనాతో సహజీవనం చేయడం నేర్చుకోవాలి..’ అనే సరికొత్త నినాదాన్ని తలకెత్తుకున్నాయి. ‘దేశ ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారిపోతోందని, లాక్‌ ‌డౌన్‌లో సడలింపులు ఇవ్వక తప్పడం లేదని, ప్రజలు తమ ప్రాణాల్ని తామే కాపాడుకునేందుకు నియమాలను పాటించాలనీ..’ నూతన శ్రుతిలో రాగాలాపనలు చేయసాగాయి. పచ్చ రంగు, నారింజ రంగు, ఎర్రరంగు జోన్ల పేరుతో జనాల చెవుల్లో బలవంతంగా పువ్వులు పెట్టే కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రజల దృష్టిని ప్రభుత్వాల వైఫల్యాల నుండి మళ్ళిస్తున్నారు. నూతన విధానంలో భాగంగా ముందుగా వైన్‌ ‌షాపులు తెరిచారు. దాంతో దేశం లోని తాగుబోతులందరూ షాపుల ముందు బారులు తీరారు. భౌతిక దూరాలు లేవు. నియమాలూ లేవు. లాక్‌ ‌డౌన్‌ ‌తొలి దశలో బయట మనిషి కనిపిస్తే కూడా నేరంగా భావించిన పోలీసులు ఈ బారుల్ని కంట్రోల్‌ ‌చేయలేక చేతులెత్తేశారు. కరోనాను కట్టడి చేసేందుకు ఈ వైన్‌ ‌షాపులు ఎలా ఉపయోగపడతాయో ప్రభుత్వాలే చెప్పాలి.

క్రమక్రమంగా సడలింపుల పర్వం మొదలయింది. రిక్షాలకు, ట్యాక్సీలకు, వివిధ రకాలైన దుకాణాలకు షరతులతో కూడిన అనుమతులివ్వసాగారు. కానీ, ఈ దేశంలో ఎలాంటి షరతులు పనిచెయ్యవని వైన్‌ ‌షాపులు నిరూపించాయి. అయినా ప్రభుత్వాలు తమ ఖజానాను నింపుకోవడమే ప్రధాన లక్ష్యంగా సడలింపులు ఇస్తూనే ఉన్నాయి. మరోవైపు దేశంలో కరోనా రోగుల సంఖ్య లక్ష దాటిపోయింది. అది ప్రతి రోజూ ఇంకా పెరుగుతూనే ఉంది. ఇంతలో రైళ్ళకు అనుమతులు ఇచ్చారు. అంతరాష్ట్రీయ విమానయాన సేవలకు అనుమతులిచ్చారు. మూతిలో మూతిపెట్టి సేవలందించే సెలూన్లకు కూడా అనుమతులిచ్చారు. జూన్‌ ఒకటి నుండి 200 వందల రైళ్ళను దేశవ్యాప్తంగా నడపబోతున్నారు. మొదట్లో ‘‘చేతులు కడుక్కొండి, భౌతిక దూరం పాటించండి.. సానిటైజర్స్ ‌వినియోగించండి..’’ అని సూత్రాలు చెప్పిన ప్రభుత్వాలు బస్సుల్లో, రైళ్ళల్లో, విమానాల్లో, అటోల్లో, ట్యాక్సీల్లో ఏ రకంగా వీటిని పాటించే అవకాశం ఎంతుందో తెలియనంత అమాయకత్వంలో ఉన్నారా అనే సందేహం వేస్తోంది.
అటోలో ఇద్దరే కూర్చుండాలని, బైక్‌ ‌పై ఒక్కరే ఉండాలని, ట్యాక్సీలో ముగ్గురే ఉండాలని నియమాలు విధిస్తే పాటించేదెవరు..? కేవలం చెప్పినంత మాత్రానా పాటించే అవకాశం ఉంటే దేశవ్యాప్తంగా లాక్‌ ‌డౌన్‌ ‌విధించాల్సిన అవసరమే రాకపోయేది. కేవలం మీడియా ద్వారా ‘అప్రమత్తంగా ఉండండి.. భౌతిక దూరం పాటించండి..’ అని ధర్మసూత్రాలు అనౌన్స్ ‌చేస్తే సరిపోయేది. కానీ అప్పుడేమే కనీసం వలస కార్మికులు కూడా సర్దుకునేందుకు అవకాశం ఇవ్వకుండా అగమేఘాల మీద లాక్‌ ‌డౌన్‌ ‌విధించి దేశానికి తాళం వేశారు. ఇప్పుడేమో 130 కోట్ల జనాభా ప్రాణాల్ని రిస్క్‌లో పెట్టి ఉన్నవన్నీ సడలించడం ఎంత వరకు న్యాయం..? మొదటిసారి లాక్‌ ‌డౌన్‌ ‌విధించినప్పుడు దేశంలో కేవలం 400 మంది కరోనా రోగులు ఉండేవారు. ఇప్పుడు రోజుకు అయిదు వేల చొప్పున పెరుగుతున్నారు. మరి అప్పుడు లాక్‌ ‌డౌన్‌ ‌విధించి, ఇప్పుడు ఏం గొప్ప మార్పులు వచ్చాయనీ, ఏ రకంగా కరోనా కట్టడి అయిందని సడలింపులు ఇస్తున్నారు..? విశ్వవ్యాప్తంగా మానవజాతితో మారణహోమం చేస్తున్న కరోనా పరివ్యాప్తి గురించి అంచనా వేయడంలో భారత ప్రభుత్వం విఫలమైందని అనుకోవాలా..? ఇప్పుడేమో, దేశ ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి యావత్‌ ‌ప్రజలందరినీ కరోనాకు కానుకగా ఇవ్వబోతున్నారా..? రోజుకో మాట, ఘడియకో విధానం.. క్షణక్షణానికి మారుతున్న ప్రభుత్వ నిర్ణయాలు.. దేశ ప్రజలంతా పూర్తిగా అయోమయంలోనే కాదు… ఆందోళనలో ఉన్నారు. లాక్‌ ‌డౌన్‌ అనేది ప్రభుత్వ విధానమా..? లేక కేవలం నినాదమా..?సమాధానం ఎవరిస్తారు..?

sagaveni ravindhra mimbai
– సంగెవేని రవీంద్ర,
ముంబై,

Leave a Reply