Take a fresh look at your lifestyle.

లాక్‌ ‌డౌన్‌ ‌ల వల్ల కేసులు తగ్గలేదు

దేశంలో కొరోనా వైరస్ విస్తరణ విజృంభిస్తున్నది..గురువారం 9 వేల పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..వైరస్ వేగంగా విస్తరిస్తున్న దేశాల్లో ఇండియా 3 వ స్థానం…మొదట అమెరికా..తరువాత స్థానంలో బ్రెజిల్ ఉన్నయి.గురువారం మన దేశంలో 9651 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..270 మంది వ్యాధి తో మరణించారు.  దేశంలో  219117 పాజిటివ్ కేసులు నమోద కాగా…అందులో 6319 మంది మృత్యువాత పడ్డారు. కేసుల సంఖ్యలో 7వ స్థానం..మరణాల్లో 12 స్థానంలో ఉన్నాము. ప్రతి రోజు దేశంలో సగటున రష్యా కంటే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి…

       దేశంలో  కొరోనా తీవ్రత రెండున్నర నెలలు   దాటినా తగ్గలేదు. పదిహేను రోజుల్లో   కేసుల సంఖ్య రెట్టింపు కావడమే ఇందుకు నిదర్శనం.  లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటిస్తే కొరోనా తగ్గుముఖం పడుతుందన్నది   వట్టి భ్రమేనన్న విషయం  నానాటికీ పెరుగుతున్న కేసుల సంఖ్యతో రుజువైంది. కొరోనాపై  అమెరికా అధ్యక్షుడు  ట్రంప్‌ ‌నుంచి అతి సామాన్య వ్యక్తుల వరకూ ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతూ వొచ్చారు.  ఎవరి మాట  నమ్మాలో తెలియక జనం గందరదగోళంలో పడ్డారు. ఇంకా  పడుతూనే ఉన్నారు.కొరోనాకు మందు లేదనీ,  స్వయం  నియంత్రణ ద్వారానే దానిని తగ్గించడం సాధ్యమని   శాస్త్రజ్ఞులు,  వైద్య రంగంలో    ప్రతిభ గలవారూ చెబుతూనే ఉన్నారు. కొరోనా తో  సహజీవనం తప్పదన్నప్పుడు    పాలనా రంగంలో అనుభవం ఉన్నవారే చాలా మంది  చాలా రకాలుగా వ్యాఖ్యలు చేశారు.  అయితే, కొరోనా ఎప్పటికీ మనతో ఉండేట్టుగా కనిపిస్తోంది.  ప్రస్తుత పరిస్థితుల్లో జనం   జీవించాలంటే  స్వయం నియంత్రణ ఒక్కటే మార్గం.
         కొరోనా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటి పోయింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వాలు మాత్రం ఏం చేస్తాయి.అయితే, ముందు నుంచి వైరస్ విస్తరణ పై  జనంలో   భయం  పెరిగేట్టు చేయడం వల్లనే  అది  మరింత విస్తృతం అవుతోందేమోననిపిస్తోంది. కొరోనా గురించి అతిగా  ప్రచారం చేయడం వల్ల కూడా   ఈ పరిస్థితి ఏర్పడింది. మలేరియా, ఫ్లూ వంటి వ్యాధులు  ఎప్పటి నుంచో సమాజంలో  ఉన్నాయి. వాటిని నివారించేందుకు  మందులు కనుగొన్న కారణంగా  వాటిపై భయం పోయింది.  అలాగే, కొరోనాకు మందులు వొచ్చేవరకూ ఈ భయం వెన్నాడుతూనే ఉంటుంది. అంతవరకూ ప్రజలు  జాగ్రత్తలు పాటించాలి.  అయితే, కొరోనా విషయంలో   ప్రభుత్వాలు కొంత అతి ధీమాను ప్రదర్శించడం కూడా ఒక కారణం కావచ్చు.    తెలంగాణకు కొరోనా భయం లేదు,  ఎప్పటికీ రాదని   ముఖ్యమంత్రి కేసీఆర్‌  ‌ముందు  ప్రకటన చేశారు. ఒక పాలకునిగా ప్రజలకు ధైర్యం చెప్పేందుకు ఆయన ఆ ప్రకటన చేసి ఉండవచ్చు, కానీ, ఇప్పుడు తెలంగాణలో కేసుల సంఖ్య మూడువేలు దాటి పోయింది.  మరణాలు దాదాపు వందకు చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో   కొరోనా రాదని ఎవరూ చెప్పలేరు. అయితే, కొరోనాతో లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించేసి పనులు మానుకుని కూర్చోమనడం  సరైన సలహా కాదు.  పనులు మానుకున్నంత మాత్రాన కొరోనా తగ్గి పోవడం అనేది   నిజం కాదని ఇప్పుడు తేలిపోయింది. పనులకు హాజరు అవుతూనే సమాన దూరం లేదా భౌతిక దూరాన్ని పాటించడం, కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన జాగ్రత్తలను పాటించడం మినహా మనకు మరో మార్గం లేదు. నానాటికీ పెరుగుతున్న  కేసుల సంఖ్య మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరిస్తోంది.
             లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించే ముందు  ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోలేదు.అంటే   వలస కార్మికులను ముందుగానే వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేసుకుని ఉంటే ఇంత గందరగోళ పరిస్థితి ఏర్పడి  ఉండేది కాదు. అలాగే, నిత్యావసర వస్తువులను  అన్ని రాష్ట్రాలకూ చాలినన్ని  తరలించేందుకు   ముందు చూపుతో వ్యవహరించి ఉంటే చాలా ప్రాంతాల్లో నిత్యావసరాలకు కొరత ఏర్పడి ఉండేది కాదు.     పొరుగు దేశాల నుంచి లేదా పొరుగు రాష్ట్రాల నుంచి వొచ్చే వారి విషయంలో ప్రభుత్వానికి సరైన అవగాహన లేదు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో    కేసులు సంఖ్య పెరగడానికి  ఇతర ప్రాంతాల నుంచి వొచ్చిన    వారి వల్లేనని ప్రభుత్వంలో ఉన్నవారే అదికారికంగా  ప్రకటిస్తున్నారు.  వారిని కట్టడి చేయడం ప్రభుత్వాలకు సాధ్య పడలేదని అనుకోవాలా  లేక  ఎంత మంది వొస్తారో ప్రభుత్వానికి అంచనా లేదా  వంటి ప్రశ్నలు తలెత్తుతాయి . అంటే తగిన సంసిద్ధత లేకుండానే ప్రభుత్వం లాక్‌ ‌డౌన్‌ ‌ను దశలవారీగా అమలు జరిపింది. పోనీ దీని వల్ల లాభం ఏమైనా జరిగిందా అంటే అదీ లేదు.   పాలనా రంగంలో విశేషమైన అనుభవం ఉన్న రాజకీయ, రాజకీయేతర రంగాలకు చెందిన వారు మన దేశంలో అనేక మంది ఉన్నారు. వారెవరినీ  ప్రధానమంత్రి మోడీ సంప్రదించలేదు. ఆయన  ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం కొత్త కనుక, ఏం చేయాలో తెలియక, తన కింది వారినీ, లేదా మంత్రులు, ముఖ్యమంత్రులను మాత్రమే సంప్రదించి నిర్ణయాలు తీసుకున్నారనే అనుకోవాలి. లాక్‌ ‌డౌన్‌ ‌సడలింపుల విషయంలో కూడా     శాస్త్రీయ మైన పద్దతిలో కాకుండా   సలహాదారులు ఏం చెబితే దానిని పాటించారనే విమర్శలు నిర్హేతుకం కాదని స్పష్టం అవుతోంది.
           సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా వ్యాపార,  పారిశ్రామిక వర్గాలకు మేలును దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకోవడం పెట్టుబడిదారీ వ్యవస్థలో సర్వసాధారణం. మనది ప్రజాస్వామిక దేశమని ఎన్ని గొప్పలు చెప్పుకుంటున్నా, వాణిజ్య,పారిశ్రామిక అనుకూల విధానాల నే అనుసరిస్తోందన్నది నిర్వివాదాంశం.   ఈ నేపథ్యంలో   సడలింపుల విషయంలో ప్రభుత్వం ఆ వర్గాల ప్రయోజనాలను  పరిగణనలోకి తీసుకుందే తప్ప ప్రజల  ప్రయోజనాలను గురించి ఆలోచించలేదు   రవాణా వ్యవస్థ కు సడలింపుల విషయంలో ప్రభుత్వం   ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బస్సులు లేకపోయినా, ఆటోలు, ప్రైవేటు వాహనాలకు అనుమతించారు. జనం ఒక  చోట నుంచి మరో చోటకు వెళ్ళేందుకు ప్రైవేటు వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. సహజంగానే వారు ఇదే అవకాశమని దోచుకుంటున్నారు.    దూరాన్ని పాటించాలని ఎన్ని హెచ్చరికలు చేసినా, ఆటోల్లో కుక్కేసి జనాన్ని తీసుకుని వెళ్తున్నారు.    ప్రజలు కూడా తమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆటోవాలాలను  ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరిస్థితి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్లే వొచ్చింది.అందువల్ల సడలింపుల విషయంలో ప్రభుత్వం సరైన  పద్దతిని పాటించడం లేదనిపిస్తోంది. లాక్‌ ‌డౌన్‌  ఎం‌దుకోసం విధించారో, ఎవరి కోసం విధించారో  ప్రభుత్వానికే తెలియాలి.  దశలవారీ లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల ప్రజలు  లాభ పడింది ఏమీ లేదు. కేసులు తగ్గిందీ లేదు..!

Leave a Reply