Take a fresh look at your lifestyle.

మండల రోజులకు చేరుకోనున్న లాక్‌ ‌డౌన్‌

రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం లాక్‌ ‌డౌన్‌ను మరో 19 రోజులపాటు పొడిగించింది. దీంతో దేశచరిత్రలో గతంలో ఎన్నడూలేని విధంగా యావత్‌ ‌భారతావని మండలకాలం లాక్‌ ‌డౌన్‌తో గృహబంధీగా కొనసాగనుంది. ఇప్పటికే ఇరవై ఒక్క రోజులుగా కాశ్మీర్‌ ‌నుండి కన్యాకుమారి వరకు అభివృద్ధి కార్యక్రమాలన్ని స్థంబించి పోగా ఇప్పుడు మరో పందొమ్మిది రోజులు అదే పరిస్థితి కొనసాగనుంది. గత నెల 22న జనతా కర్ప్యూ తర్వాత 24నుండి మొదటి విడుత లాక్‌ ‌డౌన్‌ అమలులోకి వచ్చింది. ఏప్రిల్‌ 14‌తో ఇరవై ఒక్కరోజుల లాక్‌ ‌డౌన్‌ ‌ముగియనుండగా భారత ప్రధాని దాన్ని మరో పందొమ్మిది రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అంటే మే మూడవ తేదీ వరకు ఇది అమలులో ఉంటుంది. రెండవ విడుత ప్రకటించిన లాక్‌ ‌డౌన్‌లో కొంత వెసులుబాటును కల్పించనున్నట్లు ప్రధాని తెలిపారు.

ఏప్రిల్‌ 20‌వ తేదీ నాటికి దేశంలోని వివిధ రాష్ట్రాలు, జిల్లాల్లో కొరోనా వైరస్‌పై తీసుకుంటున్న చర్యలు, ఆయా ప్రాంతాల్లో వైరస్‌ ‌ప్రభావం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని లాక్‌ ‌డౌన్‌ ‌నిర్బంధాన్ని పరిస్థితులను బట్టి కొంతవరకు సడలించనున్నట్లు ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కొరోనాను నిరోధించే పరీక్షా సమయంగా మారింది. లాక్‌డౌన్‌ ‌ప్రకటించిన మొదటి విడుత ముగింపు నాటికి కొరోనా వ్యాప్తిని పరిశీలిస్తే దేశవ్యాప్తంగా 9,352 కేసులు నమోదు కాగా, 324 మంది ఈ వ్యాధి కారణంగా చనిపోయారు. ఇదొక విధంగా ఇతరదేశాలతో బేరీజు వేస్తే చాలా తక్కువనే చెప్పాలి. ఈ వ్యాధి వల్ల నష్టాన్ని ప్రభుత్వం ముందుగానే ఊహించి లాక్‌డౌన్‌ ‌ప్రకటించిన కారణంగానే తక్కువ నష్టంతో బయటపడుతున్నాం. అగ్రరాజ్యంగా, ఆధునిక ప్రగతిని సాధించిన దేశంగా పేరున్న అమెరికాలో నేటికీ వేలసంఖ్యలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం ఏప్రిల్‌ 14‌నాటికి ఆ దేశంలో 22,941 మరణాలు సంభవించగా, సుమారు అయిదు లక్షల డెబ్బైనాలుగువేల కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్థానంలో ఇటలీ ఉంది.

ఇటలీలో 20వేల 465గురు మృతిచెందారు. స్పెయిన్‌లో 17వేల489, బ్రిటన్‌లో 11వేల329, ఇరాన్‌లో 4వేల585, చైనాలో మూడువేల 341, జర్మనీలో మూడువేల ముప్పై రెండు, టర్కీలో వెయ్యి 296, బెల్జియంలో మూడువేల 903, నెదర్లాండ్స్‌లో రెండువేల 823 మంది మృతిచెందారు. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధితో మృతి చెందిన వారు లక్షా 17వేల 664 మంది కాగా, సుమారు 18 లక్షల 96వేల కేసులు నమోదైనాయి. అయితే ఇవన్నీ ప్రభుత్వాల దృష్టికి వచ్చిన మరణాలే. ఇంకా లెక్కకు రాని మరణాలు మరికొన్ని ఉండే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక మనదేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని పరిశీలిస్తే ఇప్పటివరకు ఈ వైరస్‌ ‌కారణంగా మరణించిన వారు 17 మంది కాగా, వ్యాధితో బాధపడుతున్న వారు 592గా నమోదైంది. మన పక్కనే ఉన్న మహారాష్ట్రలో ఇప్పటికే 149మరణాలు సంభవించగా, అక్కడ రోజురోజుకు వైరస్‌ ‌బాధితులసంఖ్య జోరుగా పెరుగుతోంది.

సోమవారం ఒక్కరోజులోనే 352 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కావడం పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. పక్కనే ఉన్న తెలంగాణపై ఆ ప్రభావం పడకుండా ఇక్కడి ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అలాగే మధ్యప్రదేశ్‌లో 43, గుజరాత్‌లో 26, ఢిల్లీలో 24, తమిళనాడు, పంజాబ్‌ల్లో 11 చొప్పున, పశ్చిమబెంగాల్‌, ‌కర్ణాటకలో ఏడుగురి చొప్పున, ఉత్తరప్రదేశ్‌లో 5, హరియాణ, కేరళ, రాజస్థాన్‌లలో ముగ్గురిచొప్పున మృతిచెందగా ఆయా రాష్ట్రాల్లో ఇంకా వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్‌ ‌పొడిగించడమే సరైందిగా కేంద్ర ప్రభుత్వం కూడా భావించింది. అయితే రెండవసారి ప్రకటించిన లాక్‌డౌన్‌ను మొదటి విడుతకన్నా చాలా పటిష్టంగా అమలుపర్చనున్నట్లు స్వయంగా ప్రధాని మోదీ మంగళవారం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ చెప్పిన విషయం తెలిసిందే. కనీసం ఏప్రిల్‌ 20‌వ తేదీవరకైనా ప్రజలు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. తమ సూచనలను తు.చ. తప్పకుండా పాటించిన పక్షంలో లాక్‌డౌన్‌ ‌కారణంగా మూసివేయబడిన కొన్ని రంగాలకైనా మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రధానంగా రైతులు, దినసరి కూలీలను దృష్టిలో పెట్టుకుని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోనున్నట్లు కూడా ఆయన చెప్పారు. అయితే అంరూ ఆశించినట్లు ఆదాయాలు లేక ఆర్థికంగా సంక్షోభంలో పడిపోయిన రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, పారిశ్రామిక మరియు ఇతర రంగాలకు కానీ ఆర్థికంగా తోడ్పాటునందించే విషయాన్ని ప్రధాని కనీసం ప్రస్తావించకపోడం శోచనీయం. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలను చేపట్టింది. పేదల ఉపాధి నిలిచిపోవడంతో ప్రతీ కుటుంబానికి 15వందల రూపాయలను వారి బ్యాంకు ఖాతాలో వేయడం ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 74 లక్షల మందికి డబ్బు అందే విధంగా వెయ్యి 112 కోట్ల రూపాయలను ఇప్పటికే బ్యాంకులకు బదలీచేసింది కూడా. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎక్కువగా కొరోనా కేసులు రాష్ట్ర రాజధానిలోనే నమోదవుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌పైనే ప్రత్యేక దృష్టిని సారించింది. రాజధానిని పదిహేడు జోన్లుగా విభజించి అన్ని విభాగాల అధికారులతో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెడుతుండడంతో లాక్‌డౌన్‌ ‌పొడిగింపు అనివార్యమేనంటున్నారు.

Leave a Reply