Take a fresh look at your lifestyle.

లాక్‌ ‌డౌన్‌ – 2020

ఆకాశం ఎప్పట్లాగే అద్భుతంగా దర్శనమిస్తోంది
ఆకాశం క్రింద భూమే ఆందోళనగా ఉంది
గాలి సహజంగా స్వచ్ఛగానే పరుగులు పెడ్తోంది
గాలి దొంతరల్లోనే ఏదో మర్మం జరుగుతోందన్న
భయం ఉంది
ఒక స్మశాన నిశ్శబ్ద నిశీధి
నీచుట్టూ ఆవరించినట్లుంది కదూ!
ఒక విషాద వికృత విస్ఫోటనంలో
దహించిపోతున్నట్లుంది కదూ!
అవును… నిజమే…!
శతాబ్దాల శాస్త్రాలను పుక్కిట పట్టి
దశాబ్దాల సాంకేతికతను కనుసన్నల్లో పెట్టి
ఛిద్రమైన పోకడలతో
కొని తెచ్చుకున్న
అభద్రతా భావమొక్కటి
అణువణువూ తొలిచివేస్తోంది కదూ!

ఇప్పుడిక…
చింతలకూ చిరునవ్వులకూ
సంతోషాలకూ దుఃఖాలకూ
ఒక మెడికల్‌ ‌ముసుగు కట్టేసుకుంటావు
కళ్ళూ కనుబొమ్మలతోనే
వినోద విషాదాలను ప్రదర్శిస్తుంటావు
ఇకముందూ…
నీ గుర్తింపు నీకొక సన్నిహిత సంక్షోభమే!
దూరాన్ని అనుభవిస్తూ
దగ్గరితనాన్ని అనుభూతి చెందాల్సిన సన్నివేశమే!

ఊరు ఏదైనా కానివ్వు
పేరు ఏదైనా పెట్టుకో
ముసుగు ఏదైనా తొడుక్కో
నీ మనుగడ ముసుగుల్లో
రచించి వంచించిన ఘోరాలెన్ని!?
ప్రళయమై పరచుకున్న నేరాలెన్ని!?
ఎన్ని పరిణామ ప్రక్రియలతో లెక్కించగలవు!?
ప్రకృతి గాయాల ఉష్ణోగ్రతను
ఏ మాపకంతో కొలమానం చేయగలవు!?
వాతావరణ గొంతుక మంటలను
ఏ దివ్యౌషధంతో చల్లార్చగలవు!?
ఎన్ని వృక్షాల సమూహాలను కాల్చావు!
ఎన్ని పక్షుల గూళ్ళను కూల్చావు!
ఎన్ని జంతువులను వేటాడి చంపావు!
ఎన్ని జీవాలను మింగి త్రేన్చావు!
అన్నింటినీ కళ్ళ ముందుంచిన సమయమిది!
గతకాలపు ప్రతీ స్పందనకూ
సమాధానమివ్వాల్సిన సందర్భమిది!

ఇదొక వితండ మనుగడ వాదం!
జీవమూ జీవితమూ వేర్వేరు
జీవం ప్రకృతి సొంతం
జీవితం అన్ని జీవాల అభిమతం
కాలభ్రమణం చెప్తున్న కఠోర సత్యమిదే!

ఇదొక చిత్రమైన పని అనుభవం!
ఏమీ చేయకుండా అలా కూర్చున్నోడే
ఎంతో సాధించిన పరమార్థం!

ఇదొక విచిత్ర యుద్ధం!
పారిపోయి కలుగులో దాక్కున్నవాడే
విజయం సాధించే వైపరీత్యం!

ఇంతటి భారమైన బతుకులోనూ
నీకొక నగ్నసత్యం చెప్పక తప్పదు
…..    ….    ….
నీకిప్పుడు అత్యవసర సేవ హ్యాండ్‌వాష్‌ ‌కాదు
అత్యంత ప్రభావిత బ్రెయిన్‌వాష్‌-

corona 2020 మస్న వేంకటేశ్వర్లు, 8897972070
మస్న వేంకటేశ్వర్లు, 8897972070

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy