Take a fresh look at your lifestyle.

అక్షరాయుధ పాత్రికేయుడు, సాహితీ దురంధరుడు

(నేడు దేవులపల్లి రామానుజరావు 23వ వర్థంతి )
ఆంధ్ర సాహిత్య, సాంస్కృతిక ఉద్యమ నిర్మాత. ఆంధ్రప్రదేశ్‌ ‌సాహిత్య అకాడమీ ప్రథమ కార్యదర్శి. తెలంగాణ విముక్తి పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని పోరాడిన సాహితీకారుడు, ప్రముఖ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు దేవులపల్లి రామానుజరావు. తెలంగాణలో శోభ, గోల్కొండ పత్రికలకు సంపాదకుడిగా, సురవరం ప్రతాపరెడ్డి తర్వాత అంతటి సాహిత్య సేవ చేసిన సాహితీకారుడు. చిత్త శుద్ధితో తెలుగు భాష సేవలో నిమగ్నమై ఫలితాలు సాసించిన తెలుగు భాషా సాధకుడు. ఇంగ్లిషు, తెలుగు, ఉర్దూ భాషా ప్రవీణుడు, వక్త, పరిశోధకుడు. తెలుగు సంస్కృతి అంటే మంచి అభిమాని.

సారస్వత సేవతోపాటు విద్య, వైజ్ఞానిక రంగానికి ఆయన విశేషమైన సేవలందించారు. తెలుగు భాషా సాహిత్య వికాసాలకోసం నిరంతరం కృషి చేయాలని విద్యార్థి దశలోనే నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టుగా సాహిత్య పత్రికను స్థాపించారు. ఆయన ఆరంభించిన ’’శోభ’’మాసపత్రిక తొలుత వరంగల్లులో ప్రచురణ పొంది, తెలుగువారి దృష్టిని విశేషంగా ఆకట్టుకుని ఆ తరువాత కొంత కాలానికి ప్రచురణ హైదరాబాద్‌కు మారింది. శోభలో ఆధునిక సాహిత్య ప్రక్రియల ప్రచురణ జరిగేది. సంపాదకుడుగా రామానుజరావు ముద్ర స్పష్టంగా కనిపించేది. ఎంతోమంది యువ కవులు, రచయితల్ని ప్రసిద్ధ సాహితీవేత్తలుగా శోభ తీర్చిదిద్దింది. శోభ మాసపత్రిక ద్వారా తెలంగాణలోని ప్రముఖ కవులను పరిచయం చేశారు. తెలుగు సాహిత్య పత్రికల చరిత్రలో శోభకు విశిష్టమైన స్థానం ఏర్పడింది.

సురవరం ప్రతాపరెడ్డి పిలుపు మేరకు ‘‘ గోల్కొండ ‘‘ పత్రిక ఉప సంపాదకులుగా పనిచేశారు. గోల్కొండ పత్రికలో సంపాదకుడిగా ఇరవై రెండేళ్ళు సంపాదకీయం వ్రాశారు. రాజకీయ, సాహిత్య రంగంతోపాటు గ్రంథాలయోద్యమం, విద్యారంగం, విశ్వవిద్యాలయం, పత్రికా రచన, రాజకీయాలు, సహకారోద్యమం, ఆంధ్ర మహాసభ కార్యకలాపాలు, విశాలాంధ్రోద్యమం…ఇలా తెలుగు వారి జీవితానికి సంబంధించిన అన్ని రంగాల్లో ఆయన విశేష పాత్ర నిర్వహించారు. రామానుజరావు దేశాభిమానం ఆయనలోని కవితాశక్తిని జాగృతం చేసి పొంగింప చేసింది. ‘పచ్చతోరణం’పద్యరూప దేశాభిమానానికి ఉదాహరణం. ఆయన ఓరుగల్లు మీద వ్రాసిన ఖండకావ్యం తెలుగు సాహిత్యంలోని ప్రబోధ కవితాశాఖలో వెలువడిన విలువైన కళాఖండంగా కావ్య విమర్శకులు గుర్తించారు. అందులోని అయిదు సీసపద్యాలూ పంచరత్నాలు. ఓరుగల్లు కోటను దర్శించే సమయంలో సాహితీపరులు ఆ పద్యాలను స్మరించుకుంటూ ఉంటారు. ఆయన ‘మా ఊరు-ఓరుగల్లు’ అనే వ్యాసం కూడా వ్రాశారు.

రామనుజరావు ఆగష్టు 25, 1917లో వరంగల్లు సమీపాన దేశాయిపేటలో వేంకట చలపతిరావు, ఆండాళ్ళమ్మ దంపతులకు జన్మించారు. తొమ్మిదో తరగతిలో హనుమకొండ పాఠశాలలో చేరారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నారు. 1939 లో మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న నిజాం కళాశాల నుండి బి. ఎ. పట్టభద్రులైనారు. 1942-44 మధ్య కాలంలో నాగపూర్‌ ‌విశ్వవిద్యాలయంలోఎల్‌ ఎల్‌ ‌బి ఉత్తీర్ణులయ్యారు. అక్కడే డాక్టర్‌ ‌నటరాజ రామకృష్ణతో పరిచయం ఏర్పడింది. మే 23, 1943 న ఏర్పడ్డ ఆంధ్ర సారస్వత పరిషత్తుతో ఆయనకు మొదటి నుంచి అనుబంధం ఉంది. 1944లో దానికి కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికై తర్వాత 1947లో కార్యదర్శి అయ్యారు. 1952లో తొలిసారి అధ్యక్షుడై మధ్యలో కొంత విరామం తప్ప చివరివరకూ అధ్యక్షుడిగా వ్యవరించారు. 1953 లో అలంపురంలో ఆయన నిర్వహించిన ఆంధ్ర సారస్వత పరిషత్తు సప్తమ వార్షికోత్సవాలకు హైదరాబాదు నుంచి ప్రత్యేకమైన రైలు నడిపారు. అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఈ ‌సమావేశాలను ప్రారంభించడమే కాక రెండు రోజులపాటు హాజరయ్యారు.

1960-62 లో సాహిత్య ప్రతినిధిగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. సహకార రంగ వ్యాపార సంస్థ డైరెక్టర్‌గా, సాధారణ భీమా సంస్థ డైరెక్టర్‌గానూ పనిచేశారు. అనేక గ్రంథాలయాలకు పాలక సభ్యుడిగా, వ్యవస్థాపకుడిగా, పరిపాలకుడిగా తన విలువైన సేవలందించారు. 1950 నుండి 1979 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం సెనేట్‌, ‌సిండికేట్‌ ‌సభ్యుడిగా ఉన్నారు. మూడు పర్యయాలు కార్య నిర్వహణా (ఆక్టింగ్‌) ‌కులపతిగా వ్యవహరించారు. హైద్రాబాద్‌ ‌కేంద్ర విశ్వవిద్యాలయం సెనేట్‌ ‌సభ్యుడిగా పనిచేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ ‌సార్వత్రిక విశ్వవిద్యాలయం కార్యనివాహక సంఘ సభ్యుడిగా ఉన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్ర ప్రదేశ్‌ ‌సాహిత్య అకాడమి, శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, కేంద్ర సాహిత్య అకాడమీలలో మూడు దశాబ్ధాలకు పైగా తెలుగు భాష, రచనల వ్యాప్తికి కృషి చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం సెనేట్‌ ‌సభ్యుడిగా పనిచేశారు. రెండు, మూడేళ్ళ పాటు హైద్రాబాద్‌ ‌కేంద్ర విశ్వవిద్యాలయం నిర్వహణా సంఘ సభ్యుడిగా పనిచేశారు. 1990 లో ఆంధ్ర ప్రదేశ్‌ ‌సారస్వత విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్‌ ‌పట్టా అందుకున్నారు. 1993 జూన్‌ 8 ‌కన్ను మూసారు.
– నందిరాజు రాధాకృష్ణ , 9848128215

Leave a Reply