Take a fresh look at your lifestyle.

‌ప్రజల దీక్షకు మద్యం బహుమతా..?

ప్రపంచాన్నే వణికించిన మహమ్మారి కొరోనాను కట్టడిచేయడానికి భారత ప్రజలు గత నలభైరోజులుగా అకుంఠిత దీక్షతో స్వీయనింత్రణను పాటిస్తే అందుకు బహుమతిగా మద్యం అమ్మకాలకు కేంద్రం, రాష్ట్రాలు అనుమతివ్వడవ ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో కొరోనా వైరస్‌ ‌సోకినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను ఇప్పటికి మూడుసార్లుగా మే 17 వరకు కొనసాగించేందుకు నిశ్చయించింది. మూడవసారి పొడిగింపులో సడలింపుల్లో భాగంగా మద్యం విక్రయాలకు అనుమతించింది. కేంద్రం అనుమతించడమే ఆలస్యం దేశంలోని పలురాష్ట్రాలు వెంటనే దాన్ని అమలులోకి తీసుకొచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటన వెలువడిన వెంటనే దేశరాజధాని ఢిల్లీతో సహా అన్ని రాష్ట్రాల బ్రాండీషాపుల ముందు మందుబాబులు బారులు తీరారు. గత నలభై నాలుగు రోజులుగా ఒక్క చుక్క మందుకోసం ముఖం వాచిపోయిన వారంతా ఒక్కసారే రోడ్ల మీదకు రావడంతో వారిని అదుపుచేయడం పోలీసులకు కష్టతరంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో అత్యవసర అవసరాల నిమిత్తమే తప్ప అనవసరంగా ఎవరినీ రోడ్లపైకి రానివ్వకుండా ఇంతకాలం ఎంతో కట్టుదిట్టంగా కాపలాకాసిన పోలీసు సిబ్బందికిప్పుడు మద్యం ప్రియులను కంట్రోల్‌ ‌చేయడం పెద్ద సమస్యగా తయారైంది. కేంద్ర ప్రభుత్వం మూడవసారి అమలుపర్చిన లాక్‌డౌన్‌లో ప్రకటించిన మద్యం సడలింపు ప్రజలకిప్పుడు లైసెన్స్‌గా మారడంతో మద్యం షాపులముందంతా జనాలతో నిండిపోతోంది. లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో తమ కుటీంబీకులు మరణించినారని చెప్పినా వెళ్ళేందుకు అనుమతివ్వని పోలీసులకు ఇది పెద్ద తలనొప్పిగా తయ్యారైంది. పిల్లలు ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర చిక్కుబడితే కనీస కనికరం కూడా చూపించకుండా ఎవరినీ ఇంటి నుండి బయటికి రానివ్వలేదు.

ఇంటినుండి మూడు కిలోమీటర్లు దాటివస్తేనే లాఠీలు ఝళిపించిన పోలీసులు, ప్రాణాంతకమైతే తప్ప దవాఖానాకు వెళ్ళలేని పరిస్థితిని అమలుచేసిన పోలీసులకిది నిజంగానే పరీక్షగా మారింది. నిన్నటి వరకున్న వాతావరణాన్ని ఒక్కసారే భగ్నంచేస్తూ కొండవీటి చాంతాడంత క్యూలైన్లతో మద్యం అమ్మకాలు జరపడం చూస్తుంటే తాముపడ్డ శ్రమంతా వృథా అవుతున్నదన్న బాధ ఇప్పుడు ప్రజల్లో వ్యక్తమవుతున్నది. కొరోనా వైరస్‌కు నేటికీ ప్రపంచంలోని ఏదేశం కూడా మందును కనుక్కోలేదు. మన దేశంతో సహా అనేక దేశాలు మరో నెల రెండు నెలల్లో దానికి సరైన వ్యాక్సిన్‌ ‌కనుగొనబోతున్నట్లు విశ్వాసాన్ని మాత్రం వ్యక్తంచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో లాక్‌డౌన్‌ ఒక్కటే దానికి సరైన మందుగా అన్నిదేశాలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. మన దేశం కూడా ఇప్పటికి లాక్‌డౌన్‌ను మూడవసారి పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో మొదటి నుండీ ముందుంటున్న తెలంగాణ ప్రభుత్వం కూడా లాక్‌డౌన్‌ను కేంద్రం కన్నా ఎప్పుడూ ఎక్కువ రోజులు పొడిగిస్తూ వస్తున్నది. కేంద్రం మే 17 వరకు మూడవసారి లాక్‌డౌన్‌ను పొడిగించగా, తెలంగాణ ప్రభుత్వం తాజాగా మే 29వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే కేంద్రం రెండు దఫాలుగా కొన్ని రంగాలపై సడలింపు జరిపినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి సడలింపులు లేకుండానే లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ వచ్చింది. అయితే మద్యం విషయంలో మాత్రం కేంద్ర సడలింపును రాష్ట్రంలో అమలు పర్చకుండా ఉండలేకపోయింది. కేంద్రం ఎప్పుడైతే మద్యం అమ్మకాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందో రాష్ట్రాలన్నీ పోలోమని మద్యం షాపులను తెరిచేశాయి. నలభై రోజులుగా నాలుక ఎండిపోతున్న మందు ప్రియులు ఒక్కసారే దుకాణాలమీద పడ్డారు. ఒక్క రోజున్నే కోట్లాది రూపాయలమేర ఆయా రాష్ట్రాలు లాభాలను ఆర్జించాయంటేనే మందుబాబులు ఏవిధంగా దానికోసం ఎదురుచూస్తున్నారో అర్థమవుతున్నది. ఏపిలో ఒక్క రోజున్నే మద్యం అమ్మకాలమీద 68కోట్ల లాభాన్ని ఆర్జించిందంటే దానికోసం ఎంతముఖం వాచి ఉన్నారో తెలుస్తున్నది. యుపి రాష్ట్రం ఒక్కరోజున్నే వందకోట్ల లాభాన్ని ఆర్జించిందట. ముంబాయితో రికార్డుస్థాయి అమ్మకాలు జరిగాయి. రెండురోజుల్లోనే మొత్తం స్టాక్‌ అం‌తా అయిపోవడంతో మద్యం కోసం వస్తున్న వేలాది మందిని కంట్రోల్‌ ‌చేసేందుకు మళ్ళీ మద్యం దుకాణాలను ఆ రాష్ట్రం బంద్‌ ‌చేయించిందంటేనే ఎంత వొత్తిడి ఉందో అర్థమవుతోంది.

కర్ణాటక ప్రభుత్వం కూడా ఒక్కరోజున్నే 45కోట్ల లాభాన్ని ఆర్జించింది. దీంతో రాష్ట్రాలు గత నెలన్నర రోజులుగా కోల్పోయిన ఆదాయాన్ని ఈ విధంగానైనా సమకూర్చుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పాటు మద్యం అమ్మకాలను మొదలు పెట్టకపోయినా చుట్టుపక్కల రాష్ట్రాల్లో సాగుతున్న అమ్మకాలు, రాష్ట్ర సరిహద్దు గ్రామాలకు ఆయా రాష్ట్రాల నుండి సరుకు వస్తుండడం, కల్తీ సరుకు కూడా చోటుచేసుకునే అవకాశం ఉడడంతో తప్పనిసరి పరిస్థితిలో బుధవారం అనుమతివ్వాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సిఎం కేసీఆర్‌ ‌తెలిపారు. మే 29 వరకు లాక్‌డౌన్‌ ‌పొడిగించిన దరిమిలా అప్పటివరకు మద్యం విక్రయాలను కూడా నిలువరిస్తే ఇంతకాలం రాష్ట్ర ప్రజలు పడిన కష్టానికి ఫలితముండేది. ఒకరినొకరు తోసుకుంటూ, లాక్‌డౌన్‌ ‌నిబంధనలను పాటించకుండా, కనీసం ముఖానికి మాస్క్‌లు కూడా లేకుండా మద్యం కోసం ఎగబడుతున్న తీరు భయాందోళన కలిగిస్తున్నది. కాగా, మద్యం అమ్మకాలు మొదలై రెండురోజులే అయినప్పటికీ ఇప్పటికే ఏపిలో ఆరుగురి మరణానికి కారణమైంది. అలాగే తెలంగాణ రాజధాని సమీపంలో కుటుంబ కలహం చోటుచేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే కొరోనాను తట్టుకోవడానికి, ఇమ్యూనిటీని పెంచుకోవాలని ఓ పక్క వైద్యరంగనిపుణులు చెబుతున్న పరిస్థితిలో తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడంతో పాటు, కనీసం సామాజిక దూరాన్ని పాటించాలన్న ఇంగితం కూడా కరువవుతుంది. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వాలు మద్యం అమ్మకాలతో కొరోనాను ఎలా నియంత్రిస్తాయన్నది ప్రశ్న.

Leave a Reply