Take a fresh look at your lifestyle.

జీహెచ్‌ఎం‌సి ఎదుట బీజేపీ కార్పొరేటర్ల మెరుపు ధర్నా

  • మేయర్‌ ‌చాంబర్‌లో బైఠాయించి ఆందోళన
  • సర్వసభ్య సమావేశం నిర్వహించాలని డిమాండ్‌
  • ఎవరి ఆదేశం మేరకు విధ్వంసానికి దిగారు : మేయర్‌ ‌విజయలక్ష్మి
  • జనరల్‌ ‌బాడీ నిర్వహించకుంటే కార్పొరేటర్లు ఎందుకున్నట్లు ?
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ఫైర్‌

జీహెచ్‌ఎం‌సి సర్వసభ్య సమావేశం వెంటనే నిర్వహించాలనీ, గ్రేటర్‌కు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ బీజేపీ కార్పొరేటర్లు, ఆ పార్టీ కార్యకర్తలు మంగళవారం మెరుపు ధర్నా నిర్వహించారు. నిరసనలో భాగంగా మేయర్‌ ‌ఛాంబర్‌లో బైఠాయించి ఆందోళన చేపట్టిన బీజేపీ కార్యకర్తలు టేబుల్‌ ‌విరగ్గొట్టారు. పూల కుండీలను పగలగొట్టి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. మేయర్‌, ‌కమిషనర్‌ ‌చాంబర్ల వద్ద కార్పొరేటర్లు, మహిళా కార్యకర్తలు తలుపులు తోసుకుంటూ లోపలికి వెళ్లారు. బీజేపీ కార్యకర్తలు మేయర్‌ ‌చాంబర్‌లోనికి వెళ్లే ప్రయత్నంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తోపులాట చోటుచేసుకుంది. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తల విధ్వసంతో గ్రేటర్‌ ‌కార్యాలయమంతా పూలకుండీల మట్టితో నిండిపోయింది. మేయర్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు పోస్టర్లు అంటించారు. జీహెచ్‌ఎం‌సి బోర్డుపై బ్లాక్‌ ‌స్ప్రే కొట్టి నిరసన తెలిపారు. కాగా, జీహెచ్‌ఎం‌సిలో బీజేపీ ఆందోళన, విధ్వంసంపై మేయర్‌ ‌విజయలక్ష్మి స్పందించారు.

కొరోనా వల్ల వర్చువల్‌ ‌సమావేశాలు నిర్వహించామనీ, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో సమావేశం నిర్వహించలేకపోయామని చెప్పారు. కౌన్సిల్‌ ‌సమావేశం లేకపోయినా నా వద్దకు వొచ్చి ఏదైనా అడగొచ్చు కానీ కుర్చీలు ధ్వంసం చేయడం సరికాదని పేర్కొన్నారు. జీహెచ్‌ఎం‌సి లోని వస్తువులు మేయర్‌ ‌సొమ్ము కాదనీ, పార్టీలకు అతీతంగా వొచ్చి అడిగితే పనులు చేస్తున్నామని చెప్పారు. అధిష్టానం సూచన మేరకే బీజేపీ కార్పొరేటర్లు విధ్వంసానికి దిగారా ? ఎవరి ఆదేశం మేరకు బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు ? బీజేపీ కార్యాలయం వద్ద మా కార్పొరేటర్లు ధర్నాకు సిద్ధమయ్యారు కానీ, అది సంస్కారం కాదని ఊరుకున్నామని మేయర్‌ ‌విజయలక్ష్మి వ్యాఖ్యానించారు. మరోవైపు, జిహెచ్‌ఎం‌సి ఎన్నికలు జరిగి ఏడాదైనా ఇంతవరకు జనరల్‌ ‌బాడీ సమావేశం నిర్వహించలేదనీ, అలాంటప్పుడు కార్పొరేటర్లను ఎందుకు ఎన్నుకున్నట్లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్‌ ‌పాలనలో ప్రజాప్రతినిధుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల సంగతేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. మంగళవారం ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో జనరల్‌ ‌బాడీ సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ ‌చేస్తూ ధర్నా చేసిన బీజేపీ కార్పొరేటర్లను అరెస్టు చేయడాన్ని సంజయ్‌ ‌తీవ్రంగా ఖండించారు. జీహెచ్‌ఎం‌సి పాలకవర్గం ఏర్పడి దాదాపు ఏడాది అయితే కానీ స్టాండింగ్‌ ‌కౌన్సిల్‌ ‌సమావేశం ఏర్పాటు చేయలేదనీ, గత సంప్రదాయాలను, నియమ నిబంధనలను తుంగలో తొక్కి ఏకపక్షంగా తమ అనుకూల సభ్యులతో స్టాండింగ్‌ ‌కౌన్సిల్‌ను ఏర్పాటు చేయడం టీఆర్‌ఎస్‌ ‌నియంతృత్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ కార్పొరేటర్లకు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం కల్పించడకపోవడం అప్రజాస్వామికమనీ, వోట్లు వేసి గెలిపించిన ప్రజలను అవమానించడమేనని స్పష్టం చేశారు. 74వ రాజ్యాంగ సవరణను టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తుంగలో తొక్కిందనీ, కొరోనా సాకుచూపి నామమాత్రంగా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి జీహెచ్‌ఎం‌సి పాలనను పూర్తిగా గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు.

కార్పొరేటర్లకు జీహెచ్‌ఎం‌సి మేయర్‌, ‌కమిషనర్‌ అం‌దుబాటులో ఉండటం లేదనీ, వారు ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అనేక అభివృద్ధి కార్యాక్రమాలకు చెందిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనీ, పాత బిల్లులు చెల్లించకపోవడంతో కొత్త పనులు ఎలా చేయించగలుగుతారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ‌మున్సిపల్‌ ‌మంత్రి చెప్పినట్లే జీహెచ్‌ఎం‌సి పనిచేస్తే ఇక కార్పొరేటర్లు, జీహెచ్‌ఎం‌సి పాలక వర్గం ఎందుకు ఉన్నట్లనీ, రాష్ట్ర ప్రభుత్వమే జీహెచ్‌ఎం‌సిని నడిపించదలచుకుంటే ఎన్నికలు ఎందుకు నిర్వహించినట్లని ఈ సందర్భంగా బండి సంజయ్‌ ‌ప్రశ్నించారు.

Leave a Reply