Take a fresh look at your lifestyle.

ఇరుకింట్లో జీవితం.. ఒకే కుటుంబంలో 25మందికి కొరోనా

‌కరోనా మహమ్మారి ప్రభావం గురించి తెలిసి ప్రపంచం మొత్తం గడగడ వణికిపోతున్నా మహారాష్ట్రలోని ఓ కుటుంబం మాత్రం తేలికగా తీసుకుంది. కుటుంబంలోని నలుగురు వ్యక్తులు సౌదీ అరేబియాకు వెళ్లొచ్చినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. విదేశాలకు వెళ్లొచ్చిన వారితో కలిపి మొత్తం 25 మంది ఇరుకుగా ఒకే ఇంట్లో ఉండటంతో అందరికీ కరోనా మహమ్మారి సోకింది. మహారాష్ట్రలోని సంగ్లీ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లారు. మార్చి 23న స్వగ్రామానికి తిరిగొచ్చారు. అయితే విదేశాల నుంచి వచ్చిన తర్వాత 14 రోజులపాటు హోమ్ ‌క్వారెంటైన్‌లో ఉండాలన్న నిబంధనల మేరకు వారు హోమ్ క్వారెంటైన్‌లోనే ఉంటున్నారు.

అయితే వారి ఇల్లు ఇరుకుగా ఉండటం, ఆ ఇంట్లో 20 మంది నివాసం ఉండటంవల్ల అందరికీ కరోనా వైరస్‌ ‌వ్యాపించింది. అయితే వారు బయటకు వెళ్లకపోవడంవల్ల ఇరుగుపొరుగు ఎవరకీ ఈ వైరస్‌ ‌సోకలేదు. దీనిపై కలెక్టర్‌ అభిజిత్‌ ‌చౌదరీ మాట్లాడుతూ.. ఇటువంటి కేసులను ఆరంభంలోనే గుర్తించడం ద్వారా మంచే జరిగిందని, ఒకే కుటుంబంలో ఇందరికి వైరస్‌ ‌సోకిన విషయం ఆరంభంలోనే గుర్తించకపోతే వాళ్లు స్వేచ్ఛగా సమాజంలో తిరిగేవారని, తద్వారా ఈ వైరస్‌ ‌మరింత మందికి సోకేదని అన్నారు. వైరస్‌ ‌సోకిన 25 మందని సంగ్లీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ ‌కేంద్రానికి తరలించామని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కలెక్టర్‌ ‌తెలిపారు.

Leave a Reply