Take a fresh look at your lifestyle.

ఆయుష్షు పెరిగింది…ఆదాయం లేదు

భారత దేశంలో ప్రజల సగటు ఆయుష్షు పదేళ్ళ పెరిగినట్టు లాన్సెట్‌ ‌జనరల్‌ ‌నివేదిక పేర్కొంది. ఆయుర్దాయం పెరిగినా బతికినంత కాలం చీకూ చింత లేకుండా జీవనం సాగించగల పరిస్థితులు మన దేశంలో లేవు. ఇది సాటి మనిషి సృష్టించిన సమస్యే. 1999లో మన దేశంలో సగటు ఆయుర్దాయం 59.6 ఏళ్ళు ఉండగా, 2019 నాటికి అది 70.8 ఏళ్ళకు చేరింది. అయితే, వివిధ రాష్ట్రాల మధ్య తేడాలున్నాయి. కేరళలో ఈ ఆయుష్షు మరింత పెరిగింది. తాజా అధ్యయనం ప్రకారం ఆ రాష్ట్రంలో సగటు వ్యక్తి జీవితకాలం 77.3 ఏళ్లకు చేరుకున్నది. ఇక ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి జీవితకాలం 66.9 ఏళ్లకు చేరుకున్నట్లు లాన్సెట్‌ ‌రిపోర్ట్ ‌వెల్లడించింది. ఆయుష్షు పెరిగినా వయో వృద్ధులకు ఆదాయం లేకపోవడం వల్ల వారు బతుకులీడ్చాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

మరో ముఖ్యవిషయం వయో వృద్దులకు మన దేశంలో సరైన సౌకర్యాలు లేవు. ఆయుష్షు పెరిగినా ప్రజలు ఆరోగ్యంగా జీవించడం లేదని ఇన్‌ ‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌పబ్లిక్‌ ‌హెల్త్ ‌పేర్కొంది. దీర్ఘకాలం బతుకుతున్న వారిలో ఎక్కువ మంది దీర్ఘకాలిక వ్యాధులతో బతుకుతున్నవారే. వీరికి సరైన వైద్య సదుపాయాలను అయినవారు కల్పించలేకపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీనియర్‌ ‌సిటిజెన్స్‌కి ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తామంటూ ఎన్నికల ముందు హామీలైతే గుప్పిస్తాయి కానీ, ఆచరణ శూన్యం మన్న సంగతి రుజువు అవుతోంది. గతంలో మన దేశంలో శిశుమరణాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య బాగా తగ్గింది. ఆధునిక వైద్య రీతులు అందుబాటులోకి రావడం అందుకు కారణం. ఆయుష్షు పెరిగినా వయో భారంతో వచ్చే వ్యాధులకు తోడు గుండె సంబంధమైన వ్యాధులు, కేన్సర్‌ ‌వంటి దీర్ఘకాలిక వ్యాధులతో వయసు పైబడిన వారు బాధపడుతున్నారు.

వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెరగడం, వైద్యవిధానాలు, ఔషధాలు అందుబాటులోకి రావడం ఆయుష్షు పెరగడానికి కారణం. అయితే, అవి ఆర్థికంగా అందుబాటులో లేవు. చాలా మంది తల్లితండ్రులను వృద్ధాప్యంలో ఆదుకోలేకపోవడానికి అసలు కారణం ఇదే. ఆయుష్షు పెరిగినప్పటికీ ఆ వయసు వారికి తగిన జీవన పరిస్థితులు మన దేశంలో లేవు. ఇతర దేశాల్లో వయోవృద్దులకు అక్కడి ప్రభుత్వాలు అందిస్తున్న సాయం గురించిన కథనాలు వెలువడినప్పుడు మనం ఎక్కడున్నామో అర్థం అవుతుంది. మనది ప్రజాస్వామ్య దేశమైనా వోట్లపై రాజకీయ పార్టీలు చూపుతున్న శ్రద్ధ తామిచ్చిన హామీలు, లేదా వాగ్దానాల అమలు విషయంలో చూపలేకపోతున్నాయి. వయోవృద్ధులను కూడా వోటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం కోసమే ఎన్నికల ముందు సీనియర్‌ ‌సిటిజెన్స్‌కు అన్నీ సమకూరుస్తామన్న హామీలు గుప్పిస్తుంటారు. ఆయుష్షు పెరగడం వల్ల చిన్న వారి నుంచి విసుక్కోవడాలు, చీత్కారాలు తప్ప పెద్దవారికి ఒరిగింది ఏమీ ఉండటం లేదు. కనీసం ఆదరణ కూడా నోచుకోని వయోవృద్ధులు ఎంతో మంది ఉన్నారు. అయితే, ఇందుకు ఎవరినీ తప్పు పట్టలేం. ఆధునిక మానవుని జీవనంలో పెరిగిన వేగమే ఇందుకు కారణం. ఆయుర్దాయం భగవంతుడిచ్చేదేనని నమ్మకం మన దేశంలో చాలా మందిలో ఉంది. ఏ మతం వారైనా ఆస్తికులంతా చావు, పుటుకలన్నీ దేవుని నిర్ణయం ప్రకారమే జరుగుతాయని నమ్ముతారు.

అయితే, ఆధునిక వైద్య విధానాలు పెరగడం వల్ల ఆయువును పెంచేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలు కూడా అన్ని సందర్భాల్లో ఫలించడం లేదు. పొగాకు వాడకం బాగా తగ్గడం వల్ల శ్వాస కోస వ్యాధులు తగ్గినప్పటికీ, వాయుకాలుష్యం వల్ల శ్వాస కోస వ్యాధులు యథాతథంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కేన్సర్‌ ‌బారిన పడుతున్న వయోవృద్ధుల సంఖ్య బాగా పెరుగుతోంది. అంటువ్యాధుల వ్యాప్తి తగ్గినప్పటికీ, దీర్ఘకాలిక వ్యాధులతో వయోవృద్ధులు బాధ పడుతున్నారని వాషింగ్టన్‌ ‌యూనివర్శిటీ ప్రోఫెసర్‌ ‌పేర్కొన్నారు. పరిశుభ్రమైన గాలి, స్వచ్ఛమైన నీరు అందక కాలుష్యం పెరుగుతోందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, బాలలూ, వృద్ధులకు ఆ రెండింటినీ ప్రస్తుత కాలంలో అందించలేకపోవడం వల్లనే దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయి. అయితే, ఈ వ్యాధులకు సరైన చికిత్సా విధానాలు వచ్చినప్పటికీ అవి సామాన్యులకు అందుబాటులో లేవు. పోషకాహార లోపంతో చాలా రోగాలు పట్టి పీడిస్తున్నాయి. ఆహారం అంటే బియ్యం, గోధుమలు మాత్రమే కాదు, పండ్లతో సహా బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలి. కానీ, అవన్నీ మార్కెట్‌లో దొరుకుతున్నా ఆర్థిక సమస్యల కారణంగా వృద్దులకు అందుబాటులో ఉండటం లేదు.

ప్రభుత్వ సర్వీసుల్లో రిటైరైన వారికే పెన్షన్లు లభిస్తున్నాయి. ప్రైవేటు రంగంలో దశాబ్దాల పాటు పని చేసి రిటైరైన వారికి అటువంటి సదుపాయాలు లేవు. ప్రభుత్వం సీనియర్‌ ‌సిటిజెన్స్‌కు ఇచ్చే వెయ్యి రూపాయిల పెన్షన్‌ ఏమూలకూ చాలదు. ఆయుష్షు పెరిగిందన్న ఆనందం అందరిలోనూ లేదు. ఊరు పొమ్మంటోంది, ఏరు రమ్మంటోందన్న సామెత ఇప్పటికీ వాడుకలో ఉంది. సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగనంత కాలం బాలలు, వృద్దుల గోడు పట్టించుకునే వారు ఎవరూ ఉండరు. ఒకవేళ అరకొర సాయం అందించేవారున్నా వారు కొండంత ప్రచారాన్ని కోరుకుంటున్నారు. గాలి కాలుష్యం తర్వాత మన దేశంలో వృద్ధులు రక్తపోటు, మధుమేహం వ్యాధులతో ఎక్కువ బాధ పడుతున్నారు. వాటికి సంప్రదాయకమైన వైద్యవిధానాలు అందుబాటులో ఉన్నా ఆధునిక వైద్యం వైపు మొగ్గు చూపడం వల్ల ఆర్థికంగా భరించలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. గత ఏడాది సంభవించిన మరణాల్లో అధిక రక్తపోటు వల్ల మరణించిన వారే ఎక్కువ మంది ఉన్నట్టు సర్వేలో తేలింది. అందువల్ల ఆయుషు పెరిగినా వయోవృద్దులు ఎటువంటి సమస్యలు లేకుండా జీవనం సాగించగల పరిస్థితిలు మన దేశంలో లేవు.

Leave a Reply